Let's talk: editor@tmv.in
అమరావతిలో ఐబీఎం క్వాంటమ్‌ ఇన్నోవేషన్ సెంటర్‌కు ఏపీ ప్రభుత్వం ఆమోదం

అమరావతిలో ఐబీఎం క్వాంటమ్‌ ఇన్నోవేషన్ సెంటర్‌కు ఏపీ ప్రభుత్వం ఆమోదం

Gaddamidi Naveen
9 జూన్, 2026

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతి క్వాంటమ్‌ కంప్యూటింగ్ సెంటర్ (ఏక్యూసీసీ) పరిధిలో ఐబీఎం క్వాంటమ్‌ ఇన్నోవేషన్ సెంటర్ ఏర్పాటుకు అధికారికంగా ఆమోదం తెలిపింది. ఈ మేరకు రాష్ట్ర ఐటీ శాఖ కార్యదర్శి భాస్కర్ కాటమనేని ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఐబీఎం క్వాంటమ్‌ ఇన్నోవేషన్ సెంటర్ ద్వారా ‘ఐబీఎం క్వాంటమ్‌ నెట్‌వర్క్’ లో ఏపీ భాగస్వామి కానుంది. ఈ అంతర్జాతీయ నెట్‌వర్క్‌లో ఇప్పటికే ప్రముఖ విద్యాసంస్థలు, పరిశ్రమలు, స్టార్టప్‌లు, బోయింగ్, వెల్స్ ఫార్గో, క్లీవ్‌ల్యాండ్ క్లినిక్ వంటి ప్రతిష్టాత్మక ప్రపంచ స్థాయి భాగస్వామ్య సంస్థలు ఉన్నాయి. ఇవి క్వాంటమ్‌ కంప్యూటింగ్ రంగంలో పరిశోధనలు, సామర్థ్య పెంపకానికి కీలక హబ్‌లుగా పనిచేస్తున్నాయి.

ఉత్తర్వుల ప్రకారం.. ఐబీఎం క్వాంటమ్‌ సంస్థ ఏక్యూసీసీ లోపల ఈ ఇన్నోవేషన్ సెంటర్‌ను ఏర్పాటు చేయడానికి ప్రతిపాదించింది. దీని ద్వారా క్వాంటమ్‌ విద్య, సరికొత్త పరిశోధనలు, ఆవిష్కరణలు, నైపుణ్యాభివృద్ధి, గ్లోబల్ ఎంగేజ్‌మెంట్ కార్యక్రమాలలో పరస్పర సహకారం సులువవుతుంది. ఆంధ్రప్రదేశ్‌లో క్వాంటమ్‌ కంప్యూటింగ్ పరిశోధనలను ప్రోత్సహించడం, పరిశ్రమల భాగస్వామ్యాన్ని పెంపొందించడం కోసం ‘కంపెనీల చట్టం, 2013’ కింద ఈ ఏక్యూసీసీ ని ప్రభుత్వం ఇప్పటికే ఏర్పాటు చేసింది.

ఈ కొత్త కేంద్రం ఏర్పాటైనప్పటికీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన క్వాంటమ్‌ ఎకోసిస్టమ్ ప్రాజెక్టుగా ‘అమరావతి క్వాంటమ్‌ వ్యాలీ’ (ఏక్యూవీ) ఎప్పటికప్పుడు అగ్రస్థానంలో కొనసాగుతుందని ఐటీ కార్యదర్శి స్పష్టం చేశారు. క్వాంటమ్‌ సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు విద్యాసంస్థలు, పరిశోధనా కేంద్రాలు, పరిశ్రమలు, స్టార్టప్‌లు ప్రభుత్వ ఏజెన్సీలను ఒకే గొడుగు కిందికి తెస్తూ ప్రభుత్వం ఈ సమగ్ర ఏక్యూవీ ప్రాజెక్టును అమలు చేస్తోంది. ఐబీఎంతో కుదుర్చుకున్న ఈ తాజా ఒప్పందం వల్ల ప్రస్తుతానికి లేదా భవిష్యత్తులో రాష్ట్ర ప్రభుత్వ ఖజానాపై ఎలాంటి ఆర్థిక బాధ్యత, నిరంతర వ్యయం లేదా అదనపు బడ్జెట్ భారం పడదని భాస్కర్ కాటమనేని స్పష్టం చేశారు. ఒకవేళ భవిష్యత్తులో ఏదైనా ఖర్చు చేయాల్సి వస్తే, దానికి ప్రభుత్వం నుంచి విడిగా ముందస్తు అనుమతి పొందాల్సి ఉంటుందని ఆయన జీవోలో పేర్కొన్నారు.