Let's talk: editor@tmv.in
కడపలో 2,250 మెగావాట్ల అదానీ పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టుకు ఏపీ ప్రభుత్వం ఆమోదం

కడపలో 2,250 మెగావాట్ల అదానీ పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టుకు ఏపీ ప్రభుత్వం ఆమోదం

Gaddamidi Naveen
21 మే, 2026

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హరిత ఇంధన (క్లీన్ ఎనర్జీ) వనరులను, విద్యుత్ నిల్వ మౌలిక సదుపాయాలను మరింత బలోపేతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. వైఎస్ఆర్ కడప జిల్లాలో నిర్మించ‌నున్న 2,250 మెగావాట్ల భారీ పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టును "అదానీ హైడ్రో ఎనర్జీ ఎలెవన్ లిమిటెడ్" సంస్థకు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఆంధ్రప్రదేశ్‌ను హరిత ఇంధన పెట్టుబడులకు ప్రధాన కేంద్రంగా మార్చాలనే లక్ష్యంతో, రాష్ట్ర ప్రభుత్వం 'ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ-2024' కింద భారీ ఎత్తున పునరుత్పాదక ఇంధన, పంప్డ్ స్టోరేజ్, గ్రీన్ ఇండస్ట్రియల్ ప్రాజెక్టులను ప్రోత్సహిస్తోంది. ఈ విధానంలో భాగంగానే, కడప జిల్లాలోని "గండికోట-2 పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టు"ను అదానీ సంస్థకు కేటాయించడానికి ఇంధన శాఖ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.

ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (ఎస్ఐపీబీ) సమావేశంలో, స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ కమిటీ సిఫార్సుల మేరకు ఈ ప్రతిపాదనకు తుది ఆమోదం లభించింది. కడప జిల్లాలోని 'లార్డ్ బాలాజీ దొంతి కోన పీఎస్‌పీ పార్క్' వద్ద ఈ ప్రాజెక్టును నిర్మించనున్నారు. ఇది దేశంలోనే అతిపెద్ద పంప్డ్ స్టోరేజ్ వసతులలో ఒకటిగా నిలవనుంది.

ప్రాజెక్టు ప్రత్యేకతలు, నీటి కేటాయింపు..

పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులు విద్యుత్ సరఫరాను సమతుల్యం చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి. డిమాండ్ తక్కువగా ఉన్న సమయంలో అదనపు సౌర, పవన విద్యుత్‌ను ఉపయోగించి నీటిని నిల్వ చేయడం, పీక్ అవర్స్ (డిమాండ్ ఎక్కువగా ఉన్న సమయం) లో ఆ నీటి ద్వారా తిరిగి విద్యుత్‌ను ఉత్పత్తి చేయడం దీని ప్రత్యేకత.

ఈ ప్రాజెక్టు గండికోట రిజర్వాయర్ నుంచి ప్రారంభ దశలో 29.2 ఎమ్‌సీఎమ్ నీటిని, ఆ తర్వాత ఆవిరి నష్టాలను పూడ్చడానికి ఏటా 2.2 ఎమ్‌సీఎమ్ నీటిని వినియోగానికి ప్రభుత్వం అనుమతించింది. ఇది సంబంధిత మార్గదర్శకాలకు లోబడి ఉంటుంది. ఏపీ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ-2024 కింద ఈ ప్రాజెక్టుకు ప్రత్యేక రాయితీలు లభించనున్నాయి. ఈ పాలసీ ద్వారా రాష్ట్రంలో దాదాపు రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు 7.5 లక్షల ఉద్యోగాల సృష్టిని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

ఈ ప్రాజెక్టు నుంచి ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను సమీపంలోని సెంట్రల్ ట్రాన్స్‌మిషన్ యుటిలిటీ సబ్‌స్టేషన్లకు చేరవేసేందుకు ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్‌మిషన్ కార్పొరేషన్ లిమిటెడ్ సహకరిస్తుంది. ఇందుకు అవసరమైన విద్యుత్ తరలింపు మౌలిక సదుపాయాలను అదానీ సంస్థే స్వయంగా అభివృద్ధి చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం, ఈ ప్రాజెక్టును 72 నెలల (6 సంవత్సరాల) లోపు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను రాష్ట్ర అవసరాలకే కాకుండా, రాష్ట్రం వెలుపల కూడా సరఫరా చేసుకోవచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది.