Let's talk: editor@tmv.in
‘బెస్ట్ టూరిజం ప్రమోషన్ స్టేట్’గా ఏపీకి జాతీయ గుర్తింపు

‘బెస్ట్ టూరిజం ప్రమోషన్ స్టేట్’గా ఏపీకి జాతీయ గుర్తింపు

Gaddamidi Naveen
3 జూన్, 2026

ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగానికి జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం దక్కింది. దక్షిణాదిలోనే అతిపెద్ద ట్రావెల్ అండ్ ట్రేడ్ ఎక్స్‌పో అయిన 'గ్లోబల్ ట్రావెల్ మార్కెట్స (జీటీఎం 2026) ఆంధ్రప్రదేశ్‌ను "బెస్ట్ టూరిజం ప్రమోషన్ స్టేట్" గా ఎంపిక చేసింది. ఈ నేపథ్యంలో కేరళలో జరగనున్న ‘జీటీఎం ఎక్స్ పో -2026’లో ప్రతిష్ఠాత్మక పురస్కారాన్ని అందుకోవడానికి రాష్ట్ర పర్యాటక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ మూడు రోజుల కేరళ పర్యటనకు బయలుదేరి వెళ్లారు.

మంత్రి కందుల దుర్గేష్ కేరళ పర్యటన షెడ్యూల్

జూన్ 3:

తిరువనంతపురంలోని కోవాలం ‘ఉదయ్ సముద్ర లీజర్ బీచ్ హోటల్ అండ్ స్పా’లో జరిగే జీటీఎం ఎక్స్ పో ప్రారంభోత్సవంలో మంత్రి పాల్గొంటారు.

జూన్ 4:

తిరువనంతపురం ‘గోల్డెన్ ప్యాలెస్ కన్వెన్షన్ సెంటర్’ లో జరిగే కార్యక్రమాలకు హాజరవుతారు. అదే రోజు సాయంత్రం 4 గంటలకు కోవాలంలోని ‘లీలా తిరువనంతపురం రావిజ్ హోటల్’ లో దేశవిదేశాల ప్రముఖుల సమక్షంలో 'మెట్రో ఎక్స్‌పెడిషన్ – జీటీఎం టూరిజం అవార్డు 2026' ను స్వీకరిస్తారు.

జూన్ 5:

తిరువనంతపురం నుంచి ముంబయి పర్యటనకు బయలుదేరుతారు.

ఈ అరుదైన పురస్కారం లభించడంపై మంత్రి కందుల దుర్గేష్ హర్షం వ్యక్తం చేశారు. ఇది ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ల దార్శనికతకు, దిశానిర్దేశానికి దక్కిన గౌరవమని ఆయన అభివర్ణించారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో పర్యాటక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ జైన్, ఎండీ ఆమ్రపాలి కాట, అధికారుల బృందం అంతర్జాతీయ స్థాయిలో చేసిన కృషి వల్లే ఈ విజయం సాధ్యమైందన్నారు.

కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన పర్యాటక పాలసీ 2024-29, టూరిజం రంగానికి పారిశ్రామిక హోదా కల్పించడం, ప్రతి జిల్లాలో పర్యాటక ఉత్సవాల నిర్వహణ, సృజనాత్మక డిజిటల్ ప్రమోషన్ల ద్వారా ‘బ్రాండ్ ఏపీ’ ముఖచిత్రం మారిపోయిందని మంత్రి వివరించారు. ఈ అవార్డు ఏపీ పర్యాటక వైభవ ప్రపంచ స్థాయి విజయాలకు ఒక ఘనమైన ఆరంభం మాత్రమేనని, ఈ ఎక్స్‌పో ద్వారా రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు, పర్యాటకులు వచ్చే అవకాశం ఉందని మంత్రి దుర్గేష్ ఆశాభావం వ్యక్తం చేశారు.