
కూటమి రెండేళ్ల పాలనలో ఆర్థిక సంక్షోభంలోకి ఏపీ: వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకోబోతున్న తరుణంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ అనాలోచిత విధానాలు, అవినీతి, విచ్చలవిడి రుణాల సేకరణ కారణంగా రాష్ట్రం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లోకి కూరుకుపోయిందని ఆయన ఆరోపించారు. ఈ మేరకు ‘ఎక్స్’ వేదికగా స్పందించిన జగన్ కాగ్ అధికారిక గణాంకాలను ప్రస్తావిస్తూ ప్రభుత్వంపై విమర్శలు చేశారు.
పడిపోయిన పన్ను ఆదాయం.. వృద్ధి రేటు అంతా కాగితాలకే పరిమితం
ప్రస్తుత కూటమి ప్రభుత్వం చెప్తున్న 10.7 శాతం జీఎస్‌డీపీ వృద్ధిరేటు అంకెల గారడీయేనని జగన్ కొట్టిపారేశారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర సొంత పన్ను ఆదాయం 3.22 శాతం తగ్గిందని కాగ్ నివేదికలు స్పష్టం చేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో నిజంగా అభివృద్ధి జరుగుతుంటే పెట్టుబడులు, ప్రజల వినియోగం పెరిగి పన్ను వసూళ్లు కూడా భారీగా పెరగాలని కానీ వాస్తవానికి పన్ను ఆదాయం తగ్గడం అనేది రాష్ట్రంలో నెలకొన్న ఆర్థిక మందగమనానికి పాలకుల వైఫల్యానికి సాక్ష్యమని ఆయన వ్యాఖ్యానించారు.
రూ. 13,667 కోట్ల నష్టం ఎవరి వల్లా?
తమ ప్రభుత్వ చివరి ఆర్థిక సంవత్సరం (2023-24)లో రాష్ట్రపు పన్ను ఆదాయం రూ. 85,922 కోట్లుగా నమోదైందని జగన్ గుర్తు చేశారు. సాధారణంగా కనీసం 8 శాతం వృద్ధి నమోదైనా 2025-26 నాటికి ఈ ఆదాయం లక్ష కోట్ల రూపాయలను దాటాల్సి ఉండేదని కానీ ప్రస్తుత ప్రభుత్వ హయాంలో అది కేవలం రూ. 86,553 కోట్లకే పరిమితమైందని గణాంకాలతో వివరించారు. దీనివల్ల టీడీపీ కూటమి ప్రభుత్వ వైఫల్యం కారణంగా రాష్ట్రానికి సుమారు రూ.13,667 కోట్ల మేర పన్ను ఆదాయం నష్టం వాటిల్లిందని ఆయన ఆరోపించారు. ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు నిత్యం జపించే ‘సంపద సృష్టి’ అంటే ఇదేనా? అని జగన్ ప్రశ్నించారు. తక్కువ ఆదాయాలు వచ్చినప్పటికీ ప్రభుత్వం వేగవంతమైన అభివృద్ధి కథనాలు ప్రచారం చేస్తోందని విమర్శించారు.
ఏపీఎండీసీ నిధుల మళ్లింపు రాజ్యాంగ విరుద్ధం
ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ( ఏపీఎండీసీ ) ద్వారా 2025 మేలో సమీకరించిన రూ.9,000 కోట్ల నాన్-కన్వర్టిబుల్ డిబెంచర్ల నిధుల వినియోగంపై జగన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ భారీ నిధులను రాష్ట్రంలో ఎలాంటి శాశ్వత ఆస్తుల సృష్టికి వాడకుండా కేవలం ప్రభుత్వ దైనందిన ఆదాయ వ్యయాలకే (మళ్లింపులకు) వినియోగించేశారని ఆరోపించారు. ప్రభుత్వ గ్యారెంటీతో సేకరించిన ఈ నిధుల ద్వారా ప్రైవేట్ డిబెంచర్ హోల్డర్లకు రాష్ట్ర సమగ్ర నిధిపై హక్కులు కల్పించడం ముమ్మాటికీ రాజ్యాంగ విరుద్ధమని ఆయన స్పష్టం చేశారు.
దారితప్పిన ఆర్థిక నిర్వహణ
ఇక రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక నిర్వహణ పూర్తిగా దారితప్పిందని అవినీతి, తప్పుడు ఆర్థిక విధానాల కారణంగా ఆంధ్రప్రదేశ్ అథోగతి పాలవుతోందని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. గత రెండేళ్లుగా అనుసరిస్తున్న విధానాల వల్లే రాష్ట్రం ఈ దుస్థితికి చేరిందని ఆయన పేర్కొన్నారు. కాగా మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ చేసిన ఈ తీవ్రమైన ఆర్థిక ఆరోపణలపై అధికార పక్షం (టీడీపీ) నుంచి ప్రస్తుతానికి ఎలాంటి అధికారిక స్పందన వెలువడలేదు.
