Let's talk: editor@tmv.in
ఏపీ ఇంధన శాఖలో 629 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ల నియామకం..

ఏపీ ఇంధన శాఖలో 629 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ల నియామకం..

Dantu Vijaya Lakshmi Prasanna
26 జూన్, 2026

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ఇంధన శాఖలో 629 మంది అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ల నియామక ప్రక్రియను ప్రారంభించినట్లు ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ వెల్లడించారు. విద్యుత్ రంగాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు కూటమి ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్ హామీల అమలులో భాగంగానే ఈ నియామకాలను చేపట్టినట్లు తెలిపారు.

అమరావతిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, విద్యుత్ ఉత్పత్తి, ప్రసారం (ట్రాన్స్‌మిషన్), పంపిణీ (డిస్ట్రిబ్యూషన్) సంస్థల్లో ఉన్న కీలక ఇంజినీరింగ్ ఖాళీలను భర్తీ చేయడం ద్వారా విద్యుత్ సేవల సామర్థ్యాన్ని పెంచడమే లక్ష్యమన్నారు.

ఇందులో భాగంగా, ఏపీ ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ రాష్ట్రంలోని వివిధ విద్యుత్ సంస్థల్లో ఖాళీగా ఉన్న 629 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి అధికారికంగా గ్రీన్ సిగ్నల్ ఇస్తూ బుదవారం ఉత్తర్వులు జారీ చేశారు.

సంస్థల వారీగా ఖాళీల వివరాలు

ఈ నియామక ప్రక్రియ ద్వారా రాష్ట్రంలోని 5 ప్రధాన విద్యుత్ ఉత్పత్తి, ప్రసార, పంపిణీ సంస్థలలో ఖాళీలను భర్తీ చేయనున్నారు.

• APTRANSCO (ప్రసార సంస్థ): 200 పోస్టులు (అత్యధికం)

• APGENCO (ఉత్పత్తి సంస్థ): 100 పోస్టులు

• APSPDCL (దక్షిణ ప్రాంత పంపిణీ సంస్థ): 134 పోస్టులు

• APEPDCL (తూర్పు ప్రాంత పంపిణీ సంస్థ): 135 పోస్టులు

• APCPDCL (మధ్య ప్రాంత పంపిణీ సంస్థ): 60 పోస్టులు

• మొత్తం ఖాళీలు: 629

ముఖ్యమైన తేదీలు:

అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా మాత్రమే తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది.

• ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ: 30 జూన్ 2026

• దరఖాస్తుకు చివరి తేదీ: 20 జూలై 2026 (కొన్ని డిస్కాంలకు 27 జూలై 2026 వరకు అవకాశం ఉంది)

• కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) తేదీలు: 22 ఆగస్టు 2026 నుండి 29 ఆగస్టు 2026 వరకు

అర్హత ప్రమాణాలు & వయోపరిమితి

1. విద్యా అర్హతలు:

గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి సంబంధిత విభాగంలో (ఎలక్ట్రికల్ / సివిల్ / టెలికాం) బీ.ఈ (B.E) లేదా బీ. టెక్ (B.Tech) ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు అర్హులు. ఎలాంటి ముందస్తు పని అనుభవం అవసరం లేదు. ఇది పూర్తిగా ఎంట్రీ లెవెల్ ఎగ్జిక్యూటివ్ హోదా ఉద్యోగం.

2. వయోపరిమితి (01/01/2026 నాటికి):

• జనరల్ కేటగిరీ (OC): 18 నుండి 34 సంవత్సరాలు. (కొన్ని నోటిఫికేషన్ల ప్రకారం గరిష్ట వయస్సు 42 ఏళ్లుగా నిర్ణయించారు).

• రిజర్వడ్ కేటగిరీలు (SC/ST/BC/EWS): ప్రభుత్వ నిబంధనల ప్రకారం 5 సంవత్సరాల వయోసడలింపు ఉంటుంది.

• దివ్యాంగులు (PwBD): 10 సంవత్సరాల వయోసడలింపు కలదు.

జీతభత్యాలు:

ఏపీ విద్యుత్ రంగంలో ఏఈఈ ఉద్యోగం అత్యంత ప్రతిష్టాత్మకమైనదిగా భావిస్తారు. సవరించిన పే-స్కేల్ (RPS 2022) ప్రకారం ఎంపికైన అభ్యర్థులకు నెలకు ప్రారంభ బేసిక్ పే రూ. 86,245 నుండి ప్రారంభమై గరిష్టంగా రూ. 2,08,915 వరకు ఉంటుంది. దీనితో పాటు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇతర అలవెన్సులు కూడా అందుతాయి.

ఎంపిక విధానం పరీక్షా సరళి (Selection Process):

ఈ పోస్టుల భర్తీని పూర్తిగా పారదర్శకంగా, మెరిట్ ఆధారంగా నిర్వహిస్తారు. ఎంపిక ప్రక్రియలో రెండు ప్రధాన దశలు ఉంటాయి.

• కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష (CBT): మొత్తం 100 మార్కులకు పరీక్ష ఉంటుంది (సమయం: 3 గంటలు).

• సెక్షన్-A (కోర్ సబ్జెక్ట్): మీ ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించిన ప్రశ్నలు - 70 మార్కులు.

• సెక్షన్-B (ఆప్టిట్యూడ్): ఎనలిటికల్ ఆప్టిట్యూడ్ & జనరల్ ఎబిలిటీ - 30 మార్కులు.

• పత్రాల పరిశీలన (Original Document Verification): రాత పరీక్షలో సాధించిన మెరిట్ ఆధారంగా అభ్యర్థులను సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కు పిలుస్తారు.

దరఖాస్తు చేసుకునే విధానం

అర్హులైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ aptransco.gov.in లేదా apvidyutrecruitment.apcfss.in సందర్శించి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

కావలసిన పత్రాలు:

• బీటెక్/బిఈ ప్రొవిజనల్, మార్క్స్ మెమోలు.

• పుట్టిన తేదీ ధృవీకరణ పత్రం (SSC మార్క్స్ లిస్ట్).

• కుల ధృవీకరణ పత్రం (వర్తిస్తే).

• ఇటీవల తీసిన పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో మరియు సంతకం (స్కాన్ చేసినవి).

ఇంజనీరింగ్ పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే పట్టుదలతో ఉన్న అభ్యర్థులకు ఇది ఒక సువర్ణావకాశం. జూన్ 30 నుండి అప్లికేషన్ లింక్ యాక్టివేట్ కానుంది కాబట్టి, అభ్యర్థులు ఇప్పటి నుంచే తమ ప్రిపరేషన్‌ను వేగవంతం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

రాష్ట్రంలో విద్యుత్ మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని, వ్యవస్థాగత సంస్కరణలు, ఆధునికీకరణ చర్యలు, మెరుగైన సేవలందింపుపై దృష్టి సారించిందని ఈ సందర్భంగా మంత్రి వివరించారు. కొత్తగా నియమితులయ్యే ఏఈఈలు విద్యుత్ సంస్థల పనితీరును మరింత సమర్థవంతంగా మార్చడంలో కీలక పాత్ర పోషిస్తారని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ గత రెండేళ్లలో శాఖ సాధించిన పురోగతిని వివరించారు. రాష్ట్రంలో గత రెండు సంవత్సరాలుగా విద్యుత్ చార్జీల పెంపు జరగలేదని తెలిపారు. అలాగే విద్యుత్ కొనుగోలు సగటు వ్యయం 2023-24 ఆర్థిక సంవత్సరంలో యూనిట్‌కు రూ.5.42 ఉండగా, 2025-26 నాటికి అది రూ.4.90కి తగ్గిందని చెప్పారు. దీంతో యూనిట్‌కు రూ.0.52 మేర ఖర్చు తగ్గినట్లు వెల్లడించారు.

ఫ్యూయల్ అండ్ పవర్ పర్చేజ్ కాస్ట్ అడ్జస్ట్‌మెంట్ ట్రూ-డౌన్ సర్దుబాటు ద్వారా విద్యుత్ చార్జీలు యూనిట్‌కు 13.5 పైసలు తగ్గించినట్లు ఆయన తెలిపారు. అలాగే 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రూ.15,790 కోట్ల ఆదాయ లోటును ప్రభుత్వం భరించిందని వెల్లడించారు.విద్యుత్ కొనుగోలు వ్యయాన్ని తగ్గించేందుకు ఎనర్జీ బ్యాంకింగ్, అంతర్రాష్ట్ర విద్యుత్ మార్పిడి (పవర్ స్వాపింగ్) వంటి వినూత్న విధానాలను అమలు చేసినట్లు విజయానంద్ తెలిపారు. ఈ చర్యల వల్ల విద్యుత్ కొనుగోలు మరింత సమర్థవంతంగా మారిందని చెప్పారు.

అదేవిధంగా, తాత్కాలిక మార్కెట్ నుంచి విద్యుత్ కొనుగోలుపై ఆధారపడటాన్ని గణనీయంగా తగ్గించామని వెల్లడించారు. 2023-24తో పోలిస్తే విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కంలు) స్వల్పకాలిక విద్యుత్ కొనుగోళ్లను 50 శాతం కంటే ఎక్కువ మేర తగ్గించగలిగాయని పేర్కొన్నారు.

ట్యాగ్‌లు
AndhraPradeshAPJobsAPGovtJobsEnergyDepartmentAEERecruitmentGovernmentJobsEngineeringJobsPowerSectorJobsYouthEmploymentAPRecruitment2026GottipatiRaviKumarAPEnergySectorPowerInfrastructureJobCalendarElectricityDepartmentDISCOMsEnergyReformsAndhraNewsBreakingNewsLatestNews