Let's talk: editor@tmv.in
రాష్ట్ర రక్షణకు రెండు రోజుల్లో కీలక చర్యలు ప్రకటించనున్న ఏపీ సీఎం

రాష్ట్ర రక్షణకు రెండు రోజుల్లో కీలక చర్యలు ప్రకటించనున్న ఏపీ సీఎం

Gaddamidi Naveen
14 మే, 2026

అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య కొనసాగుతున్న యుద్ధం కారణంగా రాష్ట్రంపై పడే ప్రతికూల ప్రభావాలను ఎదుర్కొనేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమవుతోంది. యుద్ధ ప్రభావం నుంచి రాష్ట్రాన్ని రక్షించేందుకు తీసుకోవాల్సిన నివారణ చర్యలను మరో రెండు రోజుల్లో అధికారికంగా ప్రకటించనున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. బుధవారం గుంటూరు జిల్లా నిడమర్రు గ్రామంలో ఒక ప్రైవేట్ వైద్య కళాశాల, స్కిల్ సెంటర్‌కు శంకుస్థాపన చేసిన అనంతరం జరిగిన సభలో ఆయన ప్రసంగించారు.

ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల చేసిన పొదుపు పిలుపును ప్రస్తావిస్తూ, దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రజలందరూ బాధ్యతాయుతంగా సహకరించాలని ముఖ్యమంత్రి కోరారు. విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేసేందుకు అనవసరంగా బంగారం కొనడం, విదేశీ ప్రయాణాలు చేయడం తగ్గించాలని సూచించారు. కర్నూలు జిల్లాలో వచ్చే జూన్‌లో ఒక బంగారు గని (గోల్డ్ మైన్)ని ప్రారంభించనున్నట్లు సీఎం తెలిపారు. "భారతదేశంలో తయారయ్యే బంగారంలో 60 శాతం ఇక్కడే ఉత్పత్తి అయ్యే అవకాశం ఉంది. మనం దిగుమతులు తగ్గించి, స్వదేశీ ఉత్పత్తిని పెంచితే విదేశీ మారక ద్రవ్య నిల్వలను కాపాడుకోవచ్చు" అని ఆయన వివరించారు.

ఇంధన పొదుపు, గ్రీన్ ఎనర్జీ

పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని తగ్గించడం ద్వారా దేశానికి మేలు జరుగుతుందని ఆయన అన్నారు.భవిష్యత్తులో ప్రపంచమంతా ఇంటి నుండే పనిచేసే పరిస్థితి వస్తుందని, ఇది ఇంధన పొదుపుకు దోహదపడుతుందని పేర్కొన్నారు. ప్రజాప్రతినిధులు భారీ కాన్వాయ్‌లు, సెక్యూరిటీని తగ్గించుకుని ప్రజలకు ఆదర్శంగా నిలవాలని సూచించారు. విదేశీ చమురుపై ఆధారపడకుండా ఉండటానికి ప్రతి ఇంటిపై, పొలాల్లో రూఫ్ టాప్ సోలార్ యూనిట్లు ఏర్పాటు చేసుకోవాలని పిలుపునిచ్చారు.

రాజధాని అమరావతిని ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దుతామని చంద్రబాబు పునరుద్ఘాటించారు. 2026డిసెంబర్ నాటికి అమరావతిలో దేశంలోనే తొలి క్వాంటం కంప్యూటర్ ఏర్పాటు కాబోతోందని సంచలన ప్రకటన చేశారు.190 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్డు, కృష్ణా నదిపై అదనపు వంతెనలు, ఫ్లైఓవర్లతో అమరావతి రూపురేఖలు మారుస్తామన్నారు. నిడమర్రు మెడికల్ కాలేజీని ఏడాదిలోగా పూర్తి చేయాలని గడువు విధించారు. విశాఖలోని గూగుల్ డేటా సెంటర్, ఆర్సెలర్ మిట్టల్ ప్రాజెక్టులను కూడా వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు.

యువతకు గ్లోబల్ అవకాశాలు

ప్రపంచవ్యాప్తంగా నర్సులు, పారామెడికల్ సిబ్బందికి భారీ డిమాండ్ ఉందని, యువత విదేశీ భాషలు నేర్చుకుని అంతర్జాతీయ ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవాలని సీఎం సూచించారు. డిజిటల్ హెల్త్ కేర్ సేవలను 'సంజీవని' ప్లాట్‌ఫారమ్ ద్వారా విస్తరిస్తామని తెలిపారు. అమరావతి, విశాఖపట్నం నగరాలను అంతర్జాతీయంగా పోటీపడే నగరాలుగా తీర్చిదిద్దుతూనే, రాయలసీమను హార్టికల్చర్ (ఉద్యానవన) టెక్నాలజీ హబ్‌గా మారుస్తామని ఆయన పేర్కొన్నారు.