Let's talk: editor@tmv.in
ఏపీలో పూర్తి స్థాయి వీసా కేంద్రాల ఏర్పాటు చేయాలి: ఏపీ ఛాంబర్స్ విన్నపం

ఏపీలో పూర్తి స్థాయి వీసా కేంద్రాల ఏర్పాటు చేయాలి: ఏపీ ఛాంబర్స్ విన్నపం

Gaddamidi Naveen
14 మే, 2026

ఆంధ్రప్రదేశ్‌లో పెరుగుతున్న అంతర్జాతీయ ప్రయాణాలు, వీసా సేవల అవసరాలను దృష్టిలో ఉంచుకుని అమరావతి, విశాఖపట్నంలో పూర్తి స్థాయి వీఎఫ్‌ఎస్ గ్లోబల్ వీసా అప్లికేషన్ సెంటర్లను (వీఏసీ) ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ (ఏపీ ఛాంబర్స్) రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి. సాయి ప్రసాద్‌కు ఏపీ ఛాంబర్స్ ప్రతినిధి బృందం వినతిపత్రం సమర్పించింది.

ఏపీ ఛాంబర్స్ అధ్యక్షుడు పి. భాస్కరరావు మాట్లాడుతూ, భారీ సంఖ్యలో విదేశీ ప్రయాణికులు ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటివరకు వీఎఫ్‌ఎస్ గ్లోబల్ కేంద్రం లేకపోవడం ఆందోళనకరమన్నారు. అమెరికా, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, యూఏఈ, సింగపూర్, గల్ఫ్ దేశాలు, యూరప్ దేశాలకు విద్యార్థులు, ఎన్నారైలు, ఐటీ ఉద్యోగులు, ఎగుమతిదారులు, వ్యాపారవేత్తలు, పర్యాటకులు, వలస కార్మికులు తరచుగా ప్రయాణిస్తున్నారని తెలిపారు.

రాష్ట్రంలో పూర్తి స్థాయి వీసా సదుపాయ కేంద్రాలు లేకపోవడంతో వీసా ప్రాసెసింగ్, బయోమెట్రిక్ అపాయింట్‌మెంట్‌ల కోసం ప్రజలు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ తదితర నగరాలకు వెళ్లాల్సి వస్తోందన్నారు. దీనివల్ల అదనపు ఖర్చులు, సమయ నష్టం, ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. విశాఖపట్నంలో వీఎఫ్‌ఎస్ గ్లోబల్ కేంద్రం ఏర్పాటు చేస్తే ఉత్తరాంధ్ర ప్రాంతంతో పాటు పొరుగు రాష్ట్రాలైన ఒడిశా, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్ ప్రాంతాల ప్రజలకు కూడా ఉపయోగకరంగా ఉంటుందని భాస్కరరావు అభిప్రాయపడ్డారు.

ఈ నేపథ్యంలో కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ, సంబంధిత విదేశీ రాయబార కార్యాలయాలు, వీఎఫ్‌ఎస్ గ్లోబల్ సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరిపి అమరావతి, విశాఖపట్నాల్లో శాశ్వత సమగ్ర వీసా అప్లికేషన్ కేంద్రాలను త్వరితగతిన ఏర్పాటు చేయాలని ఏపీ ఛాంబర్స్ విజ్ఞప్తి చేసింది.