
కొత్త ఏవియేషన్ పాలసీ సహా 34 ప్రతిపాదనలకు ఏపీ కేబినెట్ ఆమోదం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన 50వ మంత్రివర్గ సమావేశం రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి దిశానిర్దేశం చేసేలా కీలక నిర్ణయాలను తీసుకుంది. ఈ సమావేశంలో మొత్తం 34 కీలక ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. సాగునీరు, మౌలిక సదుపాయాలు, పర్యాటకం, పారిశ్రామికీకరణ, ఆరోగ్యం, గ్రామీణాభివృద్ధి వంటి వివిధ రంగాల్లో సమూల మార్పులు తీసుకువచ్చే లక్ష్యంతో ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కె. పార్థసారథి మీడియాకు వెల్లడించారు. అమరావతి రాజధాని ప్రాంత అభివృద్ధిని వేగవంతం చేయడంతో పాటు, రాష్ట్రవ్యాప్తంగా పెట్టుబడులను ఆకర్షించేందుకు ఈ కేబినెట్ నిర్ణయాలు దోహదపడనున్నాయని మంత్రి అన్నారు.
సాగునీటి ప్రాజెక్టులకు పెద్దపీట వేస్తూ, పోలవరం ఎడమ ప్రధాన కాలువ (ఎల్.ఎం.సి) ప్యాకేజీలు 5, 5ఏ పనుల కోసం రూ. 796 కోట్ల సవరించిన పరిపాలన అనుమతులను కేబినెట్ మంజూరు చేసిందని తెలిపారు. ఈ పనులలో కాలువ తవ్వకం, కట్టల నిర్మాణం, లైనింగ్ వంటి కీలక పనులు 93.7 కిలోమీటర్ల నుండి 111 కిలోమీటర్ల పరిధిలో జరగనున్నాయి. అలాగే, అమరావతిలో నిర్మిస్తున్న హైకోర్టు కాంప్లెక్స్ వద్ద మౌలిక సదుపాయాల కల్పన కోసం రూ. 547 కోట్లను కేటాయించారు. పార్కింగ్ సౌకర్యాలు, సెక్యూరిటీ పెవిలియన్లు, అంతర్గత రోడ్లు, విద్యుత్ సబ్-స్టేషన్లు, నీటి వనరుల అభివృద్ధి వంటి పనులకు ఈ నిధులు ఉపయోగపడతాయని, అదేవిధంగా, ఏపీ స్టేట్ ఫైబర్ నెట్‌కు అవసరమైన నిధుల కోసం ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా హుడ్కో నుండి రుణం పొందేందుకు రూ. 300 కోట్ల ప్రభుత్వ గ్యారెంటీని కూడా మంత్రివర్గం ఆమోదించిందని పార్థసారథి పేర్కొన్నారు.
ఆర్థిక వృద్ధిలో కీలకమైన విమానయాన రంగంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. 2026-31 సంవత్సరాలకు గాను కొత్త 'ఆంధ్రప్రదేశ్ ఏవియేషన్ పాలసీ'కి ఆమోదం లభించిందని ఆయన ఈ సందర్భంగా మీడియాకు తెలిపారు. ఈ పాలసీ ప్రధాన ఉద్దేశ్యం రాష్ట్రంలో విమానాశ్రయ మౌలిక సదుపాయాలను విస్తరించడం, ప్రయాణీకుల, కార్గో రవాణా సామర్థ్యాన్ని పెంచడం. 2035 నాటికి రాష్ట్రంలో ప్రయాణీకుల సామర్థ్యాన్ని 6.2 మిలియన్ల నుండి 30.38 మిలియన్లకు, కార్గో సామర్థ్యాన్ని 6,240 టన్నుల నుండి 4.27 లక్షల టన్నులకు పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని అన్నారు. దీనికోసం తొమ్మిది కొత్త విమానాశ్రయాలు, పది వాటర్‌డ్రోమ్‌లను అభివృద్ధి చేయనున్నారని తెలిపారు.
ఇది రాష్ట్రంలో ఏరోస్పేస్, మెయింటెనెన్స్, రిపేర్ అండ్ ఓవర్హాల్ రంగాల్లో పెట్టుబడులను గణనీయంగా పెంచుతుందని ప్రభుత్వం భావిస్తోందని పేర్కొన్నారు.
పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడానికి వినూత్న నిర్ణయాలు తీసుకున్నారని, లండన్ ఐ తరహాలో కృష్ణా నది ఒడ్డున దాదాపు ఆరు ఎకరాల స్థలంలో "అమరావతి ఐ" పర్యాటక ప్రాజెక్టును 'డిజైన్, బిల్డ్, ఫైనాన్స్, ఆపరేట్ అండ్ ట్రాన్స్‌ఫర్' పద్ధతిలో అభివృద్ధి చేసేందుకు బిడ్లను ఆహ్వానించనున్నారని ఈ సందర్భంగా వెల్లడించారు. అలాగే, తీర ప్రాంత పర్యాటకాన్ని అభివృద్ధి చేయడానికి చీరాల, విశాఖపట్నంలలో పైలట్ ప్రాజెక్టుగా బీచ్ షాక్‌లను ఏర్పాటు చేసేందుకు డ్రాఫ్ట్ ఎక్సైజ్ పాలసీ గైడ్‌లైన్స్‌ను కేబినెట్ ఆమోదించిందన్నారు.
అమరావతి క్వాంటం వ్యాలీ ప్రాజెక్టు కోసం ఏపీసీఆర్డీఏ కేటాయించిన 49.66 ఎకరాల స్థలానికి స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజుల నుండి మినహాయింపు ఇచ్చారని మంత్రి తెలిపారు. సామాజిక బాధ్యతలో భాగంగా ఆరోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు, అవయవ దానం, మార్పిడి ప్రక్రియలను క్రమబద్ధీకరించడానికి, అలాగే అక్రమ అవయవ రవాణాను అరికట్టడానికి "ట్రాన్స్‌ప్లాంటేషన్ ఆఫ్ హ్యూమన్ ఆర్గాన్స్ అండ్ టిష్యూస్ యాక్ట్, 2011"ను అమలు చేస్తూ ఆర్డినెన్స్ తీసుకురావాలని కేబినెట్ నిర్ణయించిందన్నారు.
గ్రామీణాభివృద్ధిలో భాగంగా జూలై 1, 2026 నుండి "వికసిత్ భారత్ - గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవికా మిషన్ (గ్రామీణ)"ను అమలు చేయనున్నారని, ఈ పథకం ద్వారా గ్రామీణ కుటుంబాలకు కనీస ఉపాధి దినాలను 100 నుండి 125 రోజులకు పెంచడంతో పాటు, వేతనాల చెల్లింపులో జాప్యం జరిగితే నష్టపరిహారం ఇచ్చే నిబంధనలను పొందుపరిచారన్నారు. .
అలాగే పాలనా సంస్కరణలు, పారిశ్రామిక ప్రోత్సాహకాలపై కూడా కేబినెట్ దృష్టి సారించిందని మంత్రి వివరించారు. అగ్రి గోల్డ్ కేసుల వంటి ఆర్థిక నేరాల కేసులను త్వరితగతిన పరిష్కరించేందుకు విజయవాడలో ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేయాలని, ఇందుకోసం 21 పోస్టులను మంజూరు చేయాలని నిర్ణయించారన్నారు.
అంతేకాకుండా, చిత్తూరు జిల్లాలో సౌర విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు కోసం 46.69 ఎకరాల భూమిని లీజుకు ఇవ్వడానికి ఆమోదం తెలిపారని, వైఎస్ఆర్ కడప, అనంతపురం జిల్లాల్లో సోలార్, విండ్, ట్రాన్స్‌మిషన్ ప్రాజెక్టులకు, అలాగే ఇతర జిల్లాల్లో ఎంఎస్ఎంఈ పార్కులు, పారిశ్రామిక ప్రాజెక్టులకు భూములను కేటాయించారని, ఇలా అన్ని రంగాలను స్పృశిస్తూ తీసుకున్న ఈ నిర్ణయాలు ఆంధ్రప్రదేశ్ ఆర్థికాభివృద్ధికి, మౌలిక సదుపాయాల కల్పనకు బలమైన పునాదిని వేయనున్నాయి మంత్రి కె. పార్థసారథి వివరించారు.
