Let's talk: editor@tmv.in
విజయవాడలో యాంటీ నార్కోటిక్స్ ‘ఈగిల్’ ప్రధాన కార్యాలయం ప్రారంభం

విజయవాడలో యాంటీ నార్కోటిక్స్ ‘ఈగిల్’ ప్రధాన కార్యాలయం ప్రారంభం

Panthagani Anusha
26 ఏప్రిల్, 2026

ఆంధ్రప్రదేశ్‌ను మాదకద్రవ్యాల రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో పోలీస్ యంత్రాంగం మరో కీలక ముందడుగు వేసింది. రాష్ట్రంలో డ్రగ్స్, వ్యవస్థీకృత నేరాలను సమర్థవంతంగా అరికట్టడానికి ఏర్పాటు చేసిన ‘ఎలైట్ యాంటీ-నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్’ (ఈగల్) ప్రధాన కార్యాలయాన్ని విజయవాడలో డీజీపీ హరీష్ కుమార్ గుప్తా శనివారం ప్రారంభించారు. మత్తు పదార్థాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపేందుకు అత్యాధునిక సాంకేతికతతో కూడిన ఈ కొత్త కేంద్రం ఇకపై రాష్ట్రవ్యాప్త కార్యకలాపాలకు వేదికగా నిలవనుంది.

ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ ఏడున్నరేళ్ల క్రితం గంజాయి అక్రమ రవాణాను నియంత్రించేందుకు ఒక చిన్న విభాగంగా ప్రారంభమైన ఈ సంస్థ నేడు దేశంలోనే అత్యుత్తమ దర్యాప్తు సంస్థల్లో ఒకటిగా ఎదిగిందని కొనియాడారు. గంజాయి సాగును రాష్ట్రంలో దాదాపు పూర్తిగా నిర్మూలించడం ఈగల్ సాధించిన అతిపెద్ద విజయమని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మార్గదర్శకత్వంలో ప్రభుత్వ సంపూర్ణ మద్దతుతో క్షేత్రస్థాయిలో కఠినమైన చర్యలు తీసుకోవడం వల్లే ఈ అద్భుత ఫలితాలు సాధ్యమయ్యాయని డీజీపీ ఈ సందర్భంగా గుర్తు చేశారు.

మత్తు పదార్థాల సరఫరా గొలుసును తెంచడమే కాకుండా వినియోగాన్ని కూడా నియంత్రించేలా రెండంచెల వ్యూహాన్ని అమలు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా గుర్తించిన డ్రగ్స్ ‘హాట్‌స్పాట్’ ప్రాంతాల్లో ఆధునిక పరికరాల సాయంతో ‘ర్యాండమ్ డ్రగ్ టెస్టింగ్’ నిర్వహించనున్నారు. ఇందుకోసం పోలీసు శాఖను అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో బలోపేతం చేశామని నేరస్థులు ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోలేని విధంగా పటిష్టమైన నిఘా వ్యవస్థను రూపొందించామని డీజీపీ పేర్కొన్నారు.

కేవలం కఠిన చట్టాల అమలుతోనే కాకుండా ప్రజల్లో చైతన్యం తీసుకురావడం ద్వారానే మత్తు రహిత సమాజం సాధ్యమని పోలీసు బాస్ పేర్కొన్నారు. ఇందులో భాగంగా ‘చైతన్యం’, సైకిల్ ర్యాలీలు ‘వజ్రప్రహార’ వంటి వినూత్న కార్యక్రమాల ద్వారా యువతలో అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. వీటితో పాటు మానవ అక్రమ రవాణా నివారణలోనూ ఆంధ్రప్రదేశ్ దేశానికే ఆదర్శంగా నిలిచిందని సీఐడీ పర్యవేక్షణలో రాష్ట్రవ్యాప్తంగా ‘యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్లను ఏర్పాటు చేసిన తొలి రాష్ట్రంగా రికార్డు సృష్టించిందని ఆయన ప్రకటించారు. మొత్తానికి ఈగల్ ప్రధాన కార్యాలయ ప్రారంభంతో రాష్ట్రంలో మాదకద్రవ్యాల మాఫియాపై యుద్ధం మరింత తీవ్రం కానుంది. ప్రభుత్వ చిత్తశుద్ధి, పోలీసుల సాంకేతిక నైపుణ్యం తోడైతే త్వరలోనే ఏపీ డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మారుతుందని అధికార వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.

విజయవాడలో యాంటీ నార్కోటిక్స్ ‘ఈగిల్’ ప్రధాన కార్యాలయం ప్రారంభం - Tholi Paluku