Let's talk: editor@tmv.in
జూన్ 12న విద్యార్థులతో ‘యాంటీ డ్రగ్’ ప్రతిజ్ఞ.. గవర్నర్‌కు సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానం

జూన్ 12న విద్యార్థులతో ‘యాంటీ డ్రగ్’ ప్రతిజ్ఞ.. గవర్నర్‌కు సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానం

Gaddamidi Naveen
12 మే, 2026

రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సోమవారం లోక్ భవన్‌లో గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాతో భేటీ అయ్యారు. జూన్ 12న‌ పాఠశాలల పునఃప్రారంభం సందర్భంగా ప్రభుత్వం నిర్వహించనున్న భారీ విద్యార్థుల సమూహ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరుకావాలని గవర్నర్‌ను సీఎం అధికారికంగా ఆహ్వానించారు.

యువత పెడదారి పట్టకుండా ఉండాలంటే, విద్యార్థి దశ నుంచే మాదకద్రవ్యాల పట్ల అవగాహన కల్పించాలని గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా గతంలో ముఖ్యమంత్రికి సూచించారు. పాఠశాలల్లో విద్యార్థుల చేత 'డ్రగ్స్ వ్యతిరేక ప్రతిజ్ఞ' చేయించాలని ఆయన ఇచ్చిన సలహాను గౌరవిస్తూ, రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టింది.

ఈ విద్యా సంవత్సరం నుంచి పాఠశాలలు ప్రారంభమైన తొలిరోజే విద్యార్థులకు అవసరమైన అన్ని వస్తువులతో కూడిన కిట్లను అందజేయనున్నట్లు ముఖ్యమంత్రి వివరించారు. యూనిఫాంలు, పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలు, స్కూల్ బ్యాగ్, క్రీడా దుస్తులు, ఇతర అవసరమైన సామగ్రి. ఈ కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించాలని గవర్నర్‌ను కోరారు.

జూన్ 12న జరిగే ఈ కార్యక్రమంలో వేలాది మంది విద్యార్థులు పాల్గొననున్నారు. ఈ సందర్భంగా పొగాకు, మద్యం, మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటామని విద్యార్థుల చేత సామూహిక ప్రతిజ్ఞ చేయిస్తారు. సమాజం పట్ల బాధ్యతాయుతమైన పౌరులుగా మెలుగుతామని వారు ప్రమాణం చేస్తారు. ముఖ్యమంత్రి ఆహ్వానంపై గవర్నర్ సానుకూలంగా స్పందించారు.పాఠశాల విద్యాశాఖ, పోలీసు శాఖ, ఈగల్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఈ సామూహిక ప్రతిజ్ఞ నిర్వహించనున్నారు. విద్యాసంస్థలను సురక్షితంగా, డ్రగ్స్ రహిత తెలంగాణగా తీర్చిదిద్దడంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల సమష్టి బాధ్యతపై అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని సీఎం వివరించారు.