
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో మరో కార్మికుడు మృతి
విశాఖ స్టీల్ ప్లాంట్ లో సంభవించిన ఘోర ప్రమాదంలో మరో కార్మికుడు మృతి చెందారు. దీంతో స్టీల్ ప్లాంట్ దుర్ఘటనలో మృతి చెందిన వారి సంఖ్య 10కి చేరింది. జూన్ 8న సాయంత్రం జరిగిన ఈ ప్రమాదంలో ఎనిమిది మంది కార్మికులు మరణించగా, ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు.
ప్రమాదంలో 95 నుంచి 100 శాతం వరకు తీవ్రంగా కాలిన గాయాలైన కార్మికుడు సూరి బాబు, చికిత్స పొందుతూ శనివారం మధ్యాహ్నం 1 గంటకు మృతి చెందినట్టు ఆరోగ్య శాఖ అధికారి తెలిపారు. అంతకుముందు జూన్ 10న మరొక కార్మికుడు కూడా తీవ్ర గాయాల వల్ల మృతి చెందారు. ప్రమాదంలో గాయపడిన ఆరుగురిలో, ఇద్దరు మృతి చెందగా, మరో ఇద్దరు చికిత్స అనంతరం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం మిగిలిన ఇద్దరు కార్మికులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, వారి పరిస్థితి నిలకడగా ఉందని అధికారులు వెల్లడించారు.
మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం అందించడంతో పాటు, కుటుంబంలోని ఒకరికి ప్లాంట్‌లో ఉద్యోగం కల్పిస్తామని డిప్యూటి సీఎం పవన్ కళ్యాణ్ ప్రకటించిన విషయం తెలిసిందే. తీవ్రంగా గాయపడిన కార్మికులకు ఒక్కొక్కరికి రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందజేస్తామని ఆయన తెలిపారు. మృతిచెందిన ఒక్కో రెగ్యులర్ ఉద్యోగి కుటుంబానికి అన్నిరకాల ప్రయోజనాలు కలుపుకొని రూ.1.72 కోట్లు, కాంట్రాక్ట్ ఉద్యోగుల కుటుంబాలకు రూ. 45.75 లక్షల చొప్పున అందజేస్తామని వెల్లడించారు.
