
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో మరో కార్మికుడు మృతి
విశాఖ స్టీల్ ప్లాంట్ లో సంభవించిన ఘోర ప్రమాదంలో మరో కార్మికుడు మృతి చెందారు. దీంతో స్టీల్ ప్లాంట్ దుర్ఘటనలో మృతి చెందిన వారి సంఖ్య తొమ్మిదికి చేరింది. జూన్ 8న సాయంత్రం జరిగిన ఈ ప్రమాదంలో ఎనిమిది మంది కార్మికులు మరణించగా, ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. కాగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల్లో మరొకరు బుధవారం ఉదయం పరిస్థితి విషమించి ప్రాణాలు కోల్పోయారు.
విశాఖపట్నం జిల్లా జాయింట్ కలెక్టర్ జి. విద్యాధరి తెలిపిన వివరాల ప్రకారం.. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పైడిరాజు అనే కార్మికుడు బుధవారం ఉదయం 8:17 గంటలకు ఆసుపత్రిలో మృతి చెందారు. గాయపడిన ఆరుగురిలో 90 శాతం కాలిన గాయాలతో అత్యంత విషమ స్థితిలో ఉన్న ఇద్దరు కార్మికులలో పైడిరాజు ఒకరని ఆమె పేర్కొన్నారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నగరంలోని కింగ్ జార్జ్ ఆసుపత్రి (కేజీహెచ్) కి తరలించి, తదనంతరం ఆయన కుటుంబ సభ్యులకు అప్పగించారు.
అనంతరం స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ఎనిమిది మంది కార్మికుల మృతదేహాలకు పోస్టుమార్టం, ఇతర అధికారిక ప్రక్రియలు పూర్తయిన తర్వాత, వారి కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు సీనియర్ ఆరోగ్య శాఖ అధికారి బుధవారం వెల్లడించారు. కాగా, బీహార్‌కు చెందిన ఒక కార్మికుడి కుటుంబ సభ్యులు విశాఖకు చేరుకుని అవసరమైన ప్రక్రియలు పూర్తి చేసిన తర్వాత ఎనిమిదో మృతదేహాన్ని కూడా అప్పగించినట్లు కింగ్ జార్జ్ ఆసుపత్రి అధికారులు వెల్లడించారు.
బీహార్‌కు చెందిన కార్మికుడి మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించేందుకు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రత్యేకంగా అంబులెన్స్‌ను ఏర్పాటు చేసింది. ప్రమాద వార్త తెలిసిన వెంటనే మృతుడి కుటుంబానికి చెందిన దాదాపు 20 మంది సభ్యులు బీహార్ నుంచి విశాఖపట్నానికి చేరుకున్నట్లు సమాచారం. మరుగుతున్న ద్రవ ఉక్కు పడటంతో మృతదేహాలు పూర్తిగా కాలిపోయినప్పటికీ, బంధువులు తమ వారిని గుర్తించగలిగారని అధికారులు తెలిపారు.
మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం అందించడంతో పాటు, కుటుంబంలోని ఒకరికి ప్లాంట్‌లో ఉద్యోగం కల్పిస్తామని డిప్యూటి సీఎం పవన్ కళ్యాణ్ ప్రకటించారు. తీవ్రంగా గాయపడిన కార్మికులకు ఒక్కొక్కరికి రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందజేస్తామని ఆయన తెలిపారు. మృతిచెందిన ఒక్కో రెగ్యులర్ ఉద్యోగి కుటుంబానికి అన్నిరకాల ప్రయోజనాలు కలుపుకొని రూ.1.72 కోట్లు, కాంట్రాక్ట్ ఉద్యోగుల కుటుంబాలకు రూ. 45.75 లక్షల చొప్పున అందజేస్తామని వెల్లడించారు.
