
మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ.. నరహరి దంపతుల లొంగుబాటు
నిషేధిత సీపీఐ (మావోయిస్టు) పార్టీకి దేశవ్యాప్తంగా మరో కోలుకోలేని భారీ దెబ్బ తగిలింది. ఆ పార్టీ కేంద్ర కమిటీ కీలక సభ్యుడు, బీహార్-జార్ఖండ్ స్పెషల్ ఏరియా కమిటీ (బీజేఎస్ఏసీ) కార్యదర్శి పసునూరి నరహరి అలియాస్ విశ్వనాథ్ (64) మంగళవారం తెలంగాణ పోలీస్ డైరెక్టర్ జనరల్ (డీజీపీ) సి.వి. ఆనంద్ ఎదుట లొంగిపోయారు. ఆయనతో పాటు మావోయిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యురాలైన ఆయన భార్య మేదర దానమ్మ అలియాస్ లత కూడా పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఈమేరకు తెలంగాణ డీజీపీ వెల్లడించారు.
ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీజీపీ సి.వి. ఆనంద్ లొంగిబాటు వివరాలను వెల్లడించారు. "టాప్ రేంజ్ లీడర్లయిన నరహరి, దానమ్మల లొంగిబాటు మావోయిస్టు పార్టీకి ఒక పెద్ద విఘాతం. వీరి లొంగుబాటుతో ఆ సంస్థకు చెందిన చిట్టచివరి ఈస్టర్న్ రీజినల్ బ్యూరో దాదాపు కూలిపోయే దశకు చేరుకుందని డీజీపీ పేర్కొన్నారు.
డీజీపీ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ మావోయిస్టు దంపతులు గత కొంతకాలంగా డెంగ్యూ, మలేరియా వంటి తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో తెలంగాణ పోలీసులు గత 10 రోజులుగా నగరంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో వారికి రహస్యంగా వైద్య చికిత్స అందించారు. వైద్యం పూర్తికావడంతో వారు అధికారికంగా లొంగిపోయారు.
మావోయిస్టు పార్టీకి చెందిన దండకారణ్యం, జార్ఖండ్, దేశంలోని ఇతర ప్రాంతాల కమిటీలు వరుసగా ఎదురుదెబ్బలు తింటుండటంతో సాయుధ పోరాటం కొనసాగించడం కష్టతరంగా మారిందని నరహరి మీడియాతో అన్నారు. ఈ నేపథ్యంలోనే పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు మిసిర్ బేస్రా నుంచి ముందస్తు అనుమతి తీసుకున్న తర్వాతే తాను లొంగిపోవాలని నిర్ణయించుకున్నట్లు నరహరి వెల్లడించారు. అలాగే తెలంగాణ ప్రభుత్వ పునరావాస విధానంలోని సానుకూల అంశాలు కూడా తనను జనజీవన స్రవంతిలో కలవడానికి ప్రేరేపించాయని ఆయన పేర్కొన్నారు.
పసునూరి నరహరి నేపథ్యం
తెలంగాణలోని హనుమకొండ జిల్లా కాజీపేట మండలం సోమిడి గ్రామానికి చెందిన నరహరి, వరంగల్‌లో డిగ్రీ చదువుతున్న రోజుల్లోనే రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ (ఆర్ఎస్‌యూ) సిద్ధాంతాల వైపు ఆకర్షితులయ్యారు. 1982లో అప్పటి పీపుల్స్ వార్ గ్రూప్‌లో అజ్ఞాత దళ సభ్యుడిగా చేరారు. ఆ తర్వాత మావోయిస్టు పార్టీలో వివిధ హోదాల్లో పనిచేస్తూ కీలక నాయకుడిగా ఎదిగాడు. 2006లో బీహార్-జార్ఖండ్ స్పెషల్ ఏరియా కమిటీ సభ్యుడిగా బాధ్యతలు చేపట్టిన ఆయనను 2017లో కేంద్ర కమిటీలోకి చేర్చారు.
నరహరి ఆయుధాల తయారీలో నిపుణుడిగా పేరొందినట్లు డీజీపీ తెలిపారు. తుపాకులు, మోర్టార్లు, రాకెట్ ప్రొపెల్డ్ గ్రెనేడ్ల తయారీలో నరహరి నిపుణుడు. ల్యాండ్‌మైన్లు, క్లేమోర్ మైన్లు, బూబీ ట్రాప్‌లు అమర్చడంలో ఆయనకు అపారమైన అనుభవం ఉంది. అంతేకాకుండా సాయుధ క్యాడర్లకు ఆయుధాల తయారీ, మరమ్మతులపై శిక్షణ కూడా ఇచ్చినట్లు వెల్లడించారు.
మేదర దానమ్మ ప్రస్థానం
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన దానమ్మ 1988లో నరహరిని వివాహం చేసుకుని జార్ఖండ్ అడవుల్లో ఆయనతో కలిసి పనిచేశారు. 2004లో నాగ్‌పూర్‌లో అరెస్ట్ అయిన ఆమె ఏడేళ్ల పాటు జైలు శిక్ష అనుభవించారు. బెయిల్‌పై విడుదలైన తర్వాత ఆమె మళ్లీ అండర్‌గ్రౌండ్‌లోకి వెళ్లి 2018లో బీహార్-జార్ఖండ్ స్పెషల్ ఏరియా కమిటీ సభ్యురాలిగా బాధ్యతలు చేపట్టారు.
భారీ రివార్డుల అందజేత
తెలంగాణ ప్రభుత్వ పునరావాస పథకం కింద నరహరి పేరిట ఉన్న రూ. 25 లక్షలు, దానమ్మ పేరిట ఉన్న రూ. 20 లక్షల రివార్డు సొమ్మును డీజీపీ సి.వి. ఆనంద్ డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో ఆ దంపతులకు అందజేశారు. 2024 నుంచి ఇప్పటివరకు మొత్తం 822 మంది మావోయిస్టులు తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోగా, కేవలం ఈ ఏడాదిలోనే 264 మంది జనజీవన స్రవంతిలో కలిశారని డీజీపీ వివరించారు.
మావోయిస్టుల సంఖ్య నామమాత్రం
ప్రస్తుతం తెలంగాణకు చెందిన ముగ్గురు మాత్రమే ఇతర రాష్ట్రాల మావోయిస్టు కమిటీల్లో క్రియాశీలంగా ఉన్నారని డీజీపీ తెలిపారు. వారిలో కేంద్ర కమిటీ సభ్యుడు ముప్పాళ్ల లక్ష్మణ్ రావు అలియాస్ గణపతి, రాష్ట్ర కమిటీ సభ్యులు జేడే రత్నబాయి అలియాస్ సుజాత, వర్త శేఖర్ అలియాస్ మంగ్తూ ఉన్నారు. వీరంతా సాయుధ పోరాటాన్ని వీడి ప్రభుత్వ పునరావాస విధానాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా కేవలం 47 మంది మాత్రమే అండర్‌గ్రౌండ్‌లో ఉన్నారని, వారిలో ఛత్తీస్‌గఢ్‌లో 15, ఒడిశాలో 15, జార్ఖండ్‌లో 13, తెలంగాణలో 3, ఆంధ్రప్రదేశ్‌లో ఒకరు మాత్రమే మిగిలారని తెలిపారు. ఆధునిక భారత సమాజంలో మావోయిస్టు సిద్ధాంతాలకు తావులేదని, అడవుల్లో ఉన్నవారంతా బయటకు రావాలని కోరారు. లొంగిపోయిన వారు మళ్లీ అండర్‌గ్రౌండ్‌లోకి వెళ్లకుండా పర్యవేక్షించడం, వారికి ఉపాధి కల్పించడమే ఇప్పుడు పోలీసుల ముందున్న ప్రధాన సవాలని డీజీపీ అన్నారు.
సీనియర్ న్యాయవాది మొయిజుద్దీన్ హత్య కేసు
ఇదే సమావేశంలో మే 23న నగరంలో జరిగిన సీనియర్ న్యాయవాది ఖాజా మొయిజుద్దీన్ (63) అనుమానాస్పద మృతిపై విలేకరులు అడిగిన ప్రశ్నకు డీజీపీ సమాధానమిచ్చారు. ఈ హత్య వెనుక ఎలాంటి రాజకీయ కోణం లేదని, దీని వెనుక ఉన్న పూర్తి కుట్రను పోలీసులు ఛేదించారని చెప్పారు. అతి త్వరలోనే ఈ కేసు పూర్తి వివరాలను అధికారికంగా వెల్లడిస్తామని డీజీపీ సి.వి. ఆనంద్ స్పష్టం చేశారు. వక్ఫ్ భూముల ఆక్రమణలపై మొయిజుద్దీన్ పోరాడుతున్నందునే భూమాఫియా వ్యక్తులు ఎస్‌యూవీ వాహనంతో తొక్కించి హత్య చేశారని ఆయన కుమారుడు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.
