
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు మరో రూ.2 వేల కోట్ల బకాయిల విడుదల
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం మరోసారి తీపి కబురు అందించింది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఉద్యోగులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ, పెండింగ్‌లో ఉన్న బకాయిల చెల్లింపులో మరో కీలక ముందడుగు వేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆదేశాల మేరకు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా సోమవారం మరో రూ.2 వేల కోట్ల నిధులను విడుదల చేశారు.
ఉద్యోగ జేఏసీ నాయకులతో జరిగిన చర్చల్లో భాగంగా, 100 రోజుల్లో రూ.6 వేల కోట్ల బకాయిలను మూడు విడతల్లో విడుదల చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ మేరకు గత నెల 29న తొలి విడతగా రూ.2 వేల కోట్లు విడుదల చేయగా, తాజాగా రెండో విడతగా మరో రూ.2 వేల కోట్లు విడుదల చేసింది. దీంతో ఉద్యోగులకు ఇచ్చిన మాటను ప్రభుత్వం నిలబెట్టుకుందని అధికారులు పేర్కొన్నారు.
రిటైర్డ్ ఉద్యోగులు, జిల్లా పరిషత్ ఉపాధ్యాయులకు సంబంధించిన జనరల్ ప్రావిడెంట్ ఫండ్ (జీపీఎఫ్) బకాయిలను ప్రభుత్వం పూర్తిగా చెల్లించింది. ప్రస్తుతం ఈ ఖాతాల్లో ఎలాంటి పెండింగ్ బకాయిలు లేవని వెల్లడించింది. అలాగే సెప్టెంబర్ 2025 వరకు ఉన్న రిటైర్డ్ ఉద్యోగుల కమ్యూటేషన్ బకాయిలన్నింటినీ పూర్తిగా చెల్లించినట్లు తెలిపింది. అదనంగా రూ.10 వేలలోపు విలువ కలిగిన చిన్న మొత్తాల పెండింగ్ బిల్లులను కూడా ప్రభుత్వం పూర్తిగా పరిష్కరించింది. ఈ క్రమంలో దాదాపు ఐదు లక్షలకు పైగా టోకెన్లను క్లియర్ చేసినట్లు అధికారులు వెల్లడించారు.
ప్రభుత్వ నిర్ణయంపై ఉద్యోగ సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆర్థిక పరిమితులు ఉన్నప్పటికీ ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని వారు అభినందించారు. మిగిలిన బకాయిలను కూడా నిర్ణీత గడువులోగా క్రమపద్ధతిలో విడుదల చేస్తామని ఆర్థిక శాఖ అధికారులు స్పష్టం చేశారు.
