Let's talk: editor@tmv.in
ఏపీకి మరో భారీ పెట్టుబడి..రూ.1,000 కోట్లతో క్యారియర్ గ్లోబల్ చిల్లర్ తయారీ యూనిట్

ఏపీకి మరో భారీ పెట్టుబడి..రూ.1,000 కోట్లతో క్యారియర్ గ్లోబల్ చిల్లర్ తయారీ యూనిట్

Panthagani Anusha
6 మే, 2026

ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగంలో మరో భారీ అడుగు పడబోతోంది. ప్రముఖ అంతర్జాతీయ సంస్థ 'క్యారియర్ గ్లోబల్' తిరుపతి జిల్లాలోని శ్రీ సిటీలో సుమారు రూ.1,000 కోట్ల భారీ పెట్టుబడితో అధునాతన చిల్లర్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి నేడు భూమిపూజ కార్యక్రమం నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది.

డిజిటల్ మౌలిక వసతులకు ఊతం

ఈ ప్రాజెక్టు ప్రాధాన్యతను వివరిస్తూ రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌ను కేవలం డేటా సెంటర్ల నిర్వహణకే కాకుండా ఆ రంగాలకు అవసరమైన కీలక భాగాల తయారీ కేంద్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఈ క్యారియర్ గ్లోబల్ యూనిట్ ఏర్పాటు రాష్ట్ర డిజిటల్ మౌలిక వసతుల బలోపేతానికి పారిశ్రామిక వృద్ధికి ఒక మైలురాయిగా నిలుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

డేటా సెంటర్ల హబ్‌గా ఏపీ

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డేటా సెంటర్ల విభాగంలో దేశంలోనే వేగంగా దూసుకుపోతోంది. విశాఖపట్నంలో గూగుల్ సంస్థ 1 గిగావాట్ సామర్థ్యంతో ఏఐ డేటా సెంటర్‌ను ఏర్పాటు చేస్తుండగా రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా 1.5 గిగావాట్ క్లస్టర్‌ను ప్రతిపాదించింది. సుమారు రూ.6 లక్షల కోట్ల పెట్టుబడుల లక్ష్యంతో 6 గిగావాట్ సామర్థ్యాన్ని సాధించి దేశంలోనే అగ్రగామిగా నిలవాలని రాష్ట్రం ప్రణాళికలు రచిస్తోంది. ఈ నేపథ్యంలో క్యారియర్ సంస్థ అభివృద్ధి చేసే ఆధునిక కూలింగ్, థర్మల్ మేనేజ్‌మెంట్ సిస్టమ్స్ తదుపరి తరం ఏఐ మౌలిక వసతులకు వెన్నెముకగా మారనున్నాయి.

ఏసీ తయారీలో శ్రీ సిటీ రికార్డు

శ్రీ సిటీ ఇప్పటికే దేశంలోనే అతిపెద్ద హ్యుమిడిటీ, వెెంటిలేషన్, ఎయిర్ కండిషనింగ్ తయారీ కేంద్రంగా పేరుగాంచింది. ఇక్కడ ఇప్పటికే రూ.12,000 కోట్ల పెట్టుబడులు రాగా సుమారు 25,000 మందికి ప్రత్యక్ష ఉపాధి లభిస్తోంది. 2027 నాటికి భారతదేశంలో ఉత్పత్తి అయ్యే ఎయిర్ కండిషనర్లలో దాదాపు 60 శాతం వాటా శ్రీ సిటీ నుంచే ఉంటుందని అంచనా.

కాగా క్యారియర్ గ్లోబల్ రాకతో స్థానిక సరఫరా వ్యవస్థ మరింత బలపడటమే కాకుండా ఎగుమతుల ఆధారిత తయారీ రంగానికి కొత్త శక్తి వస్తుందని ప్రభుత్వం ధీమా వ్యక్తం చేస్తోంది. పారదర్శకమైన విధానాలు, ప్రభుత్వ ప్రోత్సాహకాలతో రాష్ట్రాన్ని గ్లోబల్ తయారీ కేంద్రంగా మారుస్తామని మంత్రి లోకేష్ పునరుద్ఘాటించారు.