



అన్నవరం క్షేత్ర ప్రాశస్త్యం: నిత్య సత్య వ్రత నిలయం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కాకినాడ జిల్లాలో పవిత్రమైన రత్నగిరి కొండపై వెలసిన పరమ పావన క్షేత్రం అన్నవరం. "అన్నం వరం" అంటే అడిగిన వారికి అన్నమును, అభీష్టాలను వరంగా ప్రసాదించే క్షేత్రమని అర్థం. కలియుగ వైకుంఠమైన తిరుమల తర్వాత, భక్తజన సందోహంతో కళకళలాడే రెండవ అతిపెద్ద పుణ్యక్షేత్రం ఇదే. ఇక్కడ కొలువై ఉన్న శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి, భక్తుల పాలిట కల్పవృక్షం. ఈ క్షేత్రం కేవలం ఒక మతపరమైన కేంద్రం మాత్రమే కాదు, వేల ఏళ్ల భారతీయ సంస్కృతికి, ఆధ్యాత్మికతకు, వాస్తుశిల్ప కళకు సజీవ సాక్ష్యం. ఇక్కడ ఆచరించే సత్యనారాయణ వ్రతం లోక ప్రసిద్ధి గాంచింది.
భౌగోళిక ఉనికి
అన్నవరం ప్రకృతి ఒడిలో, రత్నగిరి కొండలపై అత్యంత రమణీయంగా కొలువై ఉంది. భౌగోళికంగా ఇది తుని నుండి 18 కిలోమీటర్లు, జిల్లా కేంద్రమైన కాకినాడ నుండి 51 కిలోమీటర్లు, విశాఖపట్నం నుండి 120 కిలోమీటర్ల దూరంలో ఉంది. జాతీయ రహదారి 16 (ఎన్‌హెచ్ 16) కు అత్యంత సమీపంలో ఉండటం వల్ల రోడ్డు మార్గంలో ప్రయాణం చాలా సులభం. రైలు మార్గం ద్వారా వచ్చే భక్తుల కోసం అన్నవరం రైల్వే స్టేషన్ అందుబాటులో ఉంది, ఇక్కడ దాదాపు అన్ని ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆగుతాయి. కొండపైకి చేరుకోవడానికి దేవస్థానం వారు నిర్మించిన ఘాట్ రోడ్డు వాహనాల కోసం, పాతకాలపు మెట్ల మార్గం నడక భక్తుల కోసం ఆహ్లాదకరమైన అనుభూతిని కలిగిస్తాయి.
రత్నగిరి స్థల పురాణం: మేరు పర్వత కుమారుని తపస్సు
పురాణ గాథల ప్రకారం, మేరు పర్వతం, ఆయన భార్య మేనక సంతానం కోసం విష్ణుమూర్తిని ప్రార్థించారు. వారి తపస్సుకు మెచ్చిన స్వామి ఇద్దరు కుమారులను ప్రసాదించాడు. వారే భద్రుడు, రత్నాకరుడు. పెద్దవాడైన భద్రుడు తపస్సు చేసి భద్రాచలంగా మారగా, చిన్నవాడైన రత్నాకరుడు తన తపస్సు ద్వారా విష్ణుమూర్తిని ప్రసన్నం చేసుకుని, తనపై నిరంతరం నివసించమని కోరాడు. ఆ రత్నాకరుడే నేటి రత్నగిరి కొండ. అందుకే ఈ కొండకు రత్నాచలం లేదా రత్నగిరి అనే పేరు స్థిరపడింది.
త్రేతాయుగపు కథ ప్రకారం, శ్రీమహావిష్ణువు రామావతారంలో ఉన్నప్పుడు, రత్నాకరుడు అనే భక్తుడు స్వామి గురించి ఘోర తపస్సు చేశాడు. స్వామి ప్రత్యక్షమై వరం కోరుకోమనగా.. "స్వామీ! నిన్ను నా శిరస్సుపై మోసే భాగ్యాన్ని ప్రసాదించు" అని అడిగాడు. అప్పుడు రాముడు చిరునవ్వుతో.. "కలియుగంలో నేను త్రిమూర్త్యాత్మక స్వరూపంగా సత్యనారాయణ రూపంలో అవతరిస్తాను. అప్పుడు నీవు రత్నగిరి కొండగా మారి నన్ను నీ శిరస్సుపై ధరిస్తావు" అని వరమిచ్చాడు. ఆ మాట ప్రకారమే, నేడు రత్నాకరుడు కొండ రూపంలో స్వామిని మోస్తూ ధన్యుడయ్యాడు. అందుకే ఈ క్షేత్రం మరో వైకుంఠంగా భాసిల్లుతోంది.
రథాకృతి వాస్తు శిల్పం - కాలచక్ర సంకేతం
అన్నవరం ఆలయ ప్రధాన నిర్మాణం ఒక రథం ఆకారంలో ఉండటం ఇక్కడి ప్రత్యేకత. అగ్ని పురాణంలో వివరించిన విధంగా ఈ ఆలయం నిర్మించబడింది. ఆలయానికి నాలుగు మూలలా ఉన్న చక్రాలు సూర్యచంద్రులను, నిరంతరం తిరిగే కాలచక్రాన్ని సూచిస్తాయి. ప్రధాన ద్వారం బంగారు వర్ణంతో ధగధగలాడుతూ భక్తులకు స్వాగతం పలుకుతుంది. గర్భాలయం, ముఖమండపం ఆధ్యాత్మిక శక్తికి కేంద్రాలుగా ఉంటాయి. ఈ రథం మానవ జీవిత ప్రయాణాన్ని, భగవంతుని వైపు సాగే ఆధ్యాత్మిక యానాన్ని ప్రతిబింబిస్తుంది.
శ్రీమాత్రిపాఠ్విభూతి వైకుంఠ మహా నారాయణ యంత్రం
ఈ క్షేత్రంలోని అత్యంత కీలకమైన అంశం గర్భగుడిలో ప్రతిష్ఠించబడిన శ్రీమాత్రిపాఠ్విభూతి వైకుంఠ మహా నారాయణ యంత్రం. ఇది అత్యంత శక్తివంతమైన యంత్రంగా పరిగణించబడుతుంది. ఈ యంత్రం చుట్టూ పంచాయతన పద్ధతిలో గణపతి, సూర్యుడు, బాల త్రిపురసుందరి, మహేశ్వరుడు (శివుడు) కొలువై ఉంటారు. అంటే, ఈ ఒక్క క్షేత్రాన్ని దర్శించుకుంటే శివ, కేశవ, శక్తి స్వరూపాలను దర్శించుకున్న ఫలం లభిస్తుంది. శైవ, వైష్ణవ భేదం లేకుండా అందరూ భక్తితో కొలిచే సమన్వయ క్షేత్రమిది.
ఏక విగ్రహంలో త్రిమూర్తుల దర్శనం (మూలవిరాట్టు)
అన్నవరం స్వామివారి విగ్రహం ప్రపంచంలోనే మరెక్కడా లేని విధంగా అత్యంత విశిష్టంగా ఉంటుంది. సుమారు 13 అడుగుల ఎత్తు ఉన్న ఈ విగ్రహం స్థూపాకారంలో ఉంటుంది.
విగ్రహం యొక్క పాద భాగంలో సృష్టికర్త అయిన బ్రహ్మ, మధ్య భాగంలో స్తంభాకారం లయకారుడైన శివుడు, పై భాగంలో స్థితికారుడైన విష్ణువు (సత్యనారాయణ స్వామి) కొలువై ఉంటారు. ఇది త్రిమూర్తుల ఐక్యతకు నిదర్శనం. భక్తులు గ్రౌండ్ ఫ్లోర్లో విగ్రహ పాదాలను, మొదటి అంతస్తులో స్వామివారి దివ్య మంగళ స్వరూపాన్ని దర్శించుకుంటారు.
చారిత్రక నేపథ్యం (1891)
ఈ ఆలయ ఆవిర్భావం వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది. క్రీ.శ. 1891లో పిఠాపురం సమీపంలోని ఈరంకి ప్రకాశ రావు అనే భక్తుడికి, అప్పటి పిఠాపురం సంస్థానానికి చెందిన రాజా ఇనుగంటి వేంకట రామరాయణంకు శ్రీ సత్యదేవుడు కలలో కనిపించి.. "నేను రత్నగిరిపై అంకుడు చెట్టు కింద వెలిసి ఉన్నాను. నాకు ఆలయం నిర్మించు" అని ఆజ్ఞాపించారు. అతను వెంటనే మేల్కొని, గ్రామ ప్రముఖులు, అద్దేపల్లి కృష్ణశాస్త్రి వంటి వేద పండితులతో కలిసి కొండపైకి వెళ్లారు. అక్కడ స్వామివారి దివ్య విగ్రహం లభించింది. శాస్త్రోక్తంగా అదే ఏడాది శ్రావణ శుక్ల విదియ నాడు స్వామివారిని శాస్త్రోక్తంగా ప్రతిష్ఠించి చిన్న ఆలయాన్ని నిర్మించి పూజలు ప్రారంభించారు.
ఆలయ పునర్నిర్మాణం, శిల్పకళా వైభవం
ప్రారంభంలో అత్యంత సామాన్యంగా ఉన్న ఈ ఆలయం, భక్తుల సంఖ్య పెరగడంతో వైభవోపేతంగా రూపుదిద్దుకుంది. ముఖ్యంగా 1933–34 కాలంలో ఆలయాన్ని రాతి కట్టడంగా మార్చారు. ఈ నిర్మాణంలో మన ప్రాచీన హిందూ వాస్తు శాస్త్ర నియమాలను తూచా తప్పకుండా పాటించారు. ఆలయ గోపురాలు, ప్రాకారాలు అత్యంత మనోహరంగా ఉంటాయి. ప్రతి పునర్నిర్మాణంలోనూ ఆధునిక అవసరాలకు అనుగుణంగా మార్పులు చేస్తూనే, ప్రాచీన శిల్పకళా సౌందర్యం దెబ్బతినకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. నేడు ఈ ఆలయ సముదాయం అద్భుతమైన ఆధ్యాత్మిక ప్రాంగణంగా దర్శనమిస్తుంది.
ఆలయ క్షేత్ర పాలకులు
ప్రధాన ఆలయంతో పాటు రత్నగిరిపై ఇతర దేవతా మూర్తుల ఆలయాలు కూడా ఉన్నాయి. క్షేత్ర పాలకుడిగా శ్రీరామ చంద్రమూర్తి కొలువై ఉన్నారు. స్వామివారి విగ్రహం లభించిన ప్రదేశంలోనే ఈ రామాలయం ఉందని పురాణాలు చెబుతున్నాయి. కొండను రక్షించే శక్తిగా వనదుర్గ అమ్మవారు, కనకదుర్గమ్మ వారు ఇక్కడ కొలువై ఉన్నారు. భక్తులు ప్రధాన దర్శనం అనంతరం ఈ ఉప ఆలయాలను కూడా సందర్శించి ఆశీస్సులు పొందుతారు. కొండ కింద ఉన్న నేరేలమ్మ గుడి కూడా స్థానికులకు అత్యంత ప్రీతిపాత్రమైనది.
సత్యనారాయణ వ్రతం: భక్తుల నమ్మకం
"వ్రతాలలో మేటి.. సత్యనారాయణ వ్రతం" అన్నది జగమెరిగిన సత్యం. లోకంలో ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో చేసుకునే ఈ వ్రతం, అన్నవరం క్షేత్రంలో ఆచరిస్తే వెయ్యి రెట్ల ఫలితం ఉంటుందని భక్తుల నమ్మకం. అన్నవరం పేరు వినగానే అందరికీ గుర్తొచ్చేది సత్యనారాయణ వ్రతం. స్కాంద పురాణంలోని రేవాఖండంలో ఈ వ్రత మహత్యం వివరించబడింది. కష్టాలలో ఉన్నవారు, సంతానం కోరుకునేవారు, సంపద, ఆరోగ్యం కావాలనుకునేవారు ఇక్కడ వ్రతం ఆచరిస్తారు. పెళ్లి చేసుకున్న కొత్త జంటలు తమ వైవాహిక జీవితం సుఖంగా సాగాలని స్వామివారి సన్నిధిలో వ్రతం చేసుకోవడం ఒక ఆనవాయితీ. ప్రతిరోజూ వందలాది జంటలు ఇక్కడ వ్రతం నిర్వహిస్తాయి. ఇందుకోసం దేవస్థానం అత్యాధునిక సౌకర్యాలతో కూడిన భారీ వ్రత మండపాలను నిర్మించింది.
అన్నవరం ప్రసాదం - మధురాతి మధురం
అన్నవరం వెళ్లిన వారు ఎవరైనా సరే, ఆ స్వామివారి ప్రసాదం కోసం వెయ్యి కళ్లతో వేచి చూస్తారు. గోధుమ నూక, స్వచ్ఛమైన ఆవు నెయ్యి, పంచదార, యాలకులు, పాలు కలిపి చేసే ఈ ప్రసాదం రుచి అద్భుతం. దీన్ని 'భోగం ప్రసాదం' అంటారు. ఈ ప్రసాదం తింటే స్వామివారి అనుగ్రహం లభిస్తుందని, రోగాలు నయమవుతాయని భక్తుల విశ్వాసం. ఆకు దొన్నెల్లో ఇచ్చే ఈ వేడి వేడి ప్రసాదం అమృతాన్ని తలపిస్తుంది.
శ్రీ సత్యదేవ స్మార్త ఆగమ వేదపాఠశాల
ధర్మ ప్రచారంలో భాగంగా అన్నవరం దేవస్థానం ఒక అద్భుతమైన వేదపాఠశాలను నిర్వహిస్తోంది. వేద విద్యను పరిరక్షించడం, బీద బ్రాహ్మణ విద్యార్థులను ఆదుకోవడం దీనవ ముఖ్య లక్ష్యం. 8 నుండి 12 ఏళ్ల లోపు పిల్లలకు ప్రవేశం ఉంటుంది. 5 ఏళ్ల విద్యా కాలంలో ఉచిత భోజన, వసతి సౌకర్యాలు కల్పిస్తారు. నెలకు రూ. 1000 చొప్పున విద్యార్థి పేరు మీద డిపాజిట్ చేసి, చదువు పూర్తయిన తర్వాత ఆ మొత్తాన్ని అందజేస్తారు. దీనికి అయ్యే ఖర్చును 50శాతం దేవస్థానం, 50శాతం దేవాదాయ శాఖ భరిస్తాయి.
ప్రధాన పండుగలు, గిరి ప్రదక్షిణ
ఆలయంలో ఏడాది పొడవునా ఉత్సవాలు జరుగుతూనే ఉంటాయి. వైశాఖ శుద్ధ ఏకాదశి నాడు జరిగే స్వామివారి కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా ఉంటుంది. శ్రావణ మాసంలో స్వామివారి జయంతి వేడుకలు, దేవీ నవరాత్రులు, ధనుర్మాస పూజలు ఘనంగా నిర్వహిస్తారు. కార్తీక మాసంలో భక్తుల రద్దీ ఎక్కువుగా ఉంటుంది. కార్తీక మాసంలో ఇక్కడ జరిగే ఉత్సవాలు కనులపండువగా ఉంటాయి. భక్తులు రత్నగిరి కొండ చుట్టూ కాలినడకన ప్రదక్షిణ చేస్తారు.గిరి ప్రదక్షిణ పూర్తయిన తర్వాత సాయంత్రం కొండ దిగువన తొలి పావంచ (మొదటి మెట్టు) వద్ద ఎండుగడ్డితో చేసిన తోరణాన్ని కట్టి దానికి నిప్పు పెడతారు. ఆ అగ్ని తోరణం మధ్య నుండి స్వామివారి పల్లకీని తీసుకువస్తారు.దీనిని జ్వాలా తోరణం అంటారు. ఈ దృశ్యం చూడటానికి రెండు కళ్లు సరిపోవు. ఆ సమయంలో కొండ చుట్టూ చేసే గిరి ప్రదక్షిణ మోక్షదాయకమని భక్తుల నమ్మకం. లక్ష దీపోత్సవ కాంతులతో రత్నగిరి కొండ ఒక దివ్య జ్యోతిలా మెరిసిపోతుంది.
పంపానది: పాప ప్రక్షాళన చేసే జీవనది
కొండ పాదాల చెంత పరవళ్లు తొక్కుతూ ప్రవహించే పంపానది ఈ క్షేత్రానికి ఒక దివ్యమైన ఆభరణం. పంపాతి అనే సాధ్వి విష్ణుమూర్తి కోసం తపస్సు చేసి శరీరాన్ని శుష్కింపజేసుకుంది. రామావతారంలో ఉన్న విష్ణువు ఆమెకు దర్శనమిచ్చి, వరం కోరుకోమన్నాడు. ఆమె నిత్యం స్వామి పాద చెంత ఉండే వరాన్ని కోరింది. స్వామి ఆమెను నదీ రూపం ధరించమని, ఆ నదీ జలాలతోనే తనకు నిత్య అభిషేకం జరుగుతుందని వరమిచ్చాడు. అలాగే, రత్నగిరిపై తనను దర్శించుకోవడానికి వచ్చే భక్తులు ఈ పంపానదిలో స్నానం చేస్తే వారి పాపాలు ప్రక్షాళన అవుతాయని సెలవిచ్చాడు. నేటికీ భక్తులు ఈ నదిలో పవిత్ర స్నానాలు ఆచరించి, కొండపైకి వెళ్లడం ఆనవాయితీ.
నదిపై నిర్మించిన రిజర్వాయర్ పర్యాటక కేంద్రంగా కూడా విరాజిల్లుతోంది. భక్తులు నదిలో పవిత్ర స్నానాలు ఆచరించి, మనసును ప్రశాంతంగా ఉంచుకుని స్వామివారి దర్శనానికి వెళ్తారు. ఇక్కడ అందుబాటులో ఉన్న బోటింగ్ సౌకర్యం యాత్రికులకు ఆహ్లాదాన్ని అందిస్తుంది. పచ్చని అడవులు, చల్లని గాలి, నది అలల సవ్వడి మధ్య అన్నవరం ఒక సుందర ఆధ్యాత్మిక వనంలా కనిపిస్తుంది.
కొండ దిగువన పంపా సరోవరం సమీపంలో చిన్న పిల్లల కోసం ఒక అందమైన పార్కును ఏర్పాటు చేశారు. యాత్రికులు ఇక్కడ సేదతీరవచ్చు. త్వరలో ఇక్కడ గంగా సమేత శివుని విగ్రహం విద్యుత్ అలంకరణలతో ఏర్పాటు చేశారు.
సేవా కార్యక్రమాలు
ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో అన్నవరం దేవస్థానం అత్యంత సమర్థవంతంగా నిర్వహించబడుతోంది. ఆలయ ఆదాయం పరంగా రాష్ట్రంలో ఇది రెండవ స్థానంలో ఉంది. భక్తులు ఇచ్చే కానుకలను తిరిగి భక్తుల సౌకర్యాలకే ఉపయోగిస్తారు. వందలాది గదులతో కూడిన వసతి గృహాలు, నిత్య అన్నదాన పథకం ఇక్కడ విశేషమైనవి. ఇక్కడికి వచ్చే ఏ భక్తుడు కూడా ఆకలితో వెళ్లకూడదన్నది దేవస్థానం లక్ష్యం. అలాగే వేద పాఠశాలలు, గోశాలల నిర్వహణ ద్వారా హిందూ ధర్మ ప్రచారంలో ఈ క్షేత్రం ముందుంది.
ప్రతి ఏటా శ్రావణ శుద్ధ విదియ నాడు స్వామివారి ఆవిర్భావ దినోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది.ఆరోజున హోమాలు, పంచామృత అభిషేకాలు, ఆయుష్య సూక్త పారాయణలు నిర్వహిస్తారు.
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అన్నవరం ఆలయానికి ప్రత్యేక స్థానం ఉంది. ఎందరో దర్శకులు తమ సినిమాలలో ఈ క్షేత్ర వైభవాన్ని చిత్రీకరించారు. కె. విశ్వనాథ్ గారి సినిమాల్లోని ఆధ్యాత్మికత నుండి నేటి తరం సినిమాల వరకు అన్నవరం ఆలయం ఒక పవిత్రమైన లొకేషన్‌గా కనిపిస్తుంది. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి ఈ ఆలయ విశిష్టత మరింతగా తెలిసింది. అన్నవరం ప్రసాదం (గోధుమ రవ్వ ప్రసాదం) రుచి చూడని తెలుగు వారు ఉండరంటే అతిశయోక్తి కాదు.
రవాణా, వసతి
హైదరాబాద్ నుండి అన్నవరం చేరుకోవడానికి రైలు ప్రయాణం అత్యంత సౌకర్యవంతమైన మార్గం. సికింద్రాబాద్ లేదా నాంపల్లి నుంచి విశాఖపట్నం వైపు వెళ్లే గోదావరి, గౌతమి, గరీబ్ రథ్, విశాఖ ఎక్స్‌ప్రెస్ వంటి ప్రధాన రైళ్లు అన్నవరం స్టేషన్లో ఆగుతాయి. రోడ్డు మార్గంలో వెళ్లాలనుకునే వారు విజయవాడ, రాజమండ్రి మీదుగా జాతీయ రహదారి (ఎన్ హెచ్ 16) ద్వారా సుమారు 10 నుండి 12 గంటల్లో చేరుకోవచ్చు. ఏపీఎస్ఆర్టీసీ, టీఎస్ఆర్టీసీ, బస్సులు నిరంతరం అందుబాటులో ఉంటాయి.
వసతి విషయానికొస్తే, రత్నగిరి కొండపై, కొండ కింద దేవస్థానం వారి వసతి గృహాలు (ఏసీ మరియు నాన్-ఏసీ) అందుబాటులో ఉన్నాయి, వీటిని అధికారిక వెబ్సైట్ ద్వారా ముందుగానే బుక్ చేసుకోవడం ఉత్తమం. ఇవి కాకుండా, కొండ దిగువన అనేక ప్రైవేట్ హోటళ్లు, లాడ్జీలు, వివిధ కుల సత్రాలు అన్ని ధరలలో లభిస్తాయి. రద్దీ ఎక్కువగా ఉండే వీకెండ్స్ లేదా పర్వదినాల్లో వెళ్లేటప్పుడు ముందస్తు రిజర్వేషన్ చేసుకోవడం వల్ల ఇబ్బంది లేకుండా ఉంటుంది.
అన్నవరం యాత్ర కేవలం ఒక మొక్కు తీర్చుకోవడం మాత్రమే కాదు, అది ఒక ఆత్మీయ అనుభవం. రత్నగిరి కొండపై వీచే చల్లని గాలి మనసులోని ఆందోళనలను తొలగిస్తుంది. "సత్యమేవ జయతే" అన్న సూక్తికి నిదర్శనంగా నిలిచే సత్యనారాయణ స్వామిని దర్శించుకోవడం వల్ల జీవితంలో సత్య మార్గంలో నడవాలనే స్ఫూర్తి కలుగుతుంది. ఆధ్యాత్మికత, ప్రకృతి సౌందర్యం, మరియు చారిత్రక వైభవం కలగలిసిన అన్నవరం క్షేత్రం ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఒక్కసారైనా సందర్శించాల్సిన పుణ్యధామం.
