Let's talk: editor@tmv.in
ఒమాన్ నుంచి క్షేమంగా స్వదేశానికి చేరుకున్న అన్నమయ్య జిల్లా మహి ళ

ఒమాన్ నుంచి క్షేమంగా స్వదేశానికి చేరుకున్న అన్నమయ్య జిల్లా మహి ళ

Panthagani Anusha
10 మే, 2026

అన్నమయ్య జిల్లా వాయల్పాడు గ్రామానికి చెందిన దూదేకుల షహ్నాజ్ అనే మహిళ ఒమాన్‌లో ఎదుర్కొన్న నరకయాతన ముగిసింది. ఉపాధి కోసం విదేశాలకు వెళ్లి అక్కడ ఏజెంట్ల నిర్బంధంలో చిక్కుకున్న ఆమె ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ చేపట్టిన సత్వర చర్యల ఫలితంగా సురక్షితంగా స్వదేశానికి చేరుకున్నారు. గత ఏడాది నవంబర్‌లో మస్కట్‌కు వెళ్లిన షహ్నాజ్ అక్కడ పని నచ్చక తిరిగి వస్తానన్నందుకు ఏజెంట్లు ఆమెను నిర్బంధించి రూ. 2 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేయడంతో పాటు ఆమె ఫోన్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు.

ఈ క్లిష్ట సమయంలో బాధితురాలి భర్త అబూబకర్ ఏపీఎన్‌ఆర్టీ సొసైటీని ఆశ్రయించగా సంస్థ వెంటనే స్పందించి రాష్ట్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంది. ఒమాన్‌లోని భారత రాయబార కార్యాలయానికి లేఖ రాయడంతో పాటు స్థానిక పోలీసుల సహకారంతో ఏజెంట్లతో జరిపిన చర్చలు సఫలమయ్యాయి. దీంతో ఎటువంటి అదనపు చెల్లింపులు లేకుండానే ఆమెను విడుదల చేసేందుకు ఏజెంట్లు అంగీకరించారు. ఇందుకు ఫలితంగా మే 7వ తేదీన ఆమె హైదరాబాద్ కు చేరుకుంది. ఇక అధికారులు భద్రంగా ఆమెను వాయల్పాడులోని స్వగృహానికి చేర్చారు.

మరోవైపు ఈ ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందిస్తూ విదేశాల్లో చిక్కుకున్న రాష్ట్ర ప్రజల భద్రతకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. సమస్య పరిష్కారంలో చొరవ చూపిన ఏపీఎన్‌ఆర్టీ సొసైటీని ఆయన అభినందించారు. ఈ సహాయక చర్యల్లో జనసేన గల్ఫ్ క్యాడర్, కూటమి సభ్యులు మరియు స్థానిక అసోసియేషన్ ప్రతినిధులు కీలక పాత్ర పోషించి బాధితురాలికి భరోసా కల్పించారు.

కాగా గతంలో ఉక్రెయిన్ యుద్ధం, ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణల సమయంలో భారతీయులను రక్షించినట్లే ఇప్పుడు షహ్నాజ్ విషయంలోనూ కేంద్ర ప్రభుత్వం అదే చిత్తశుద్ధిని చాటుకుందని బాధితురాలి కుటుంబ సభ్యులు కొనియాడారు. తమ బిడ్డను సురక్షితంగా వచ్చేలా సహాయం చేసినందుకు ముఖ్యమంత్రికి, కేంద్ర ప్రభుత్వానికి వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. విదేశాల్లో భారతీయులు ఎక్కడ ఇబ్బందుల్లో ఉన్నా వారి రక్షణకు ప్రభుత్వం అగ్రభాగన ఉంటుందని అధికారులు ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు.