
నేడు రైతుల ఖాతాల్లోకి ‘అన్నదాత సుఖీభవ’ నిధుల విడుదల
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నదాతలకు తీపి కబురు అందించింది. 'సూపర్ సిక్స్' హామీలలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్’ పథకం కింద 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన తొలి విడత పెట్టుబడి సాయాన్ని శనివారం ప్రభుత్వం విడుదల చేయనుంది. పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం లింగంగుంట్ల గ్రామం నుంచి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బటన్ నొక్కి నేరుగా రైతుల ఖాతాల్లోకి ఈ నిధులను జమ చేయనున్నారు.
ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా 46,85,838 రైతు కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. వీరిలో 45.69 లక్షల మంది భూ యజమానులు కాగా, 1.16 లక్షల మంది అటవీ హక్కుల చట్టం కింద సాగు చేసుకుంటున్న గిరిజన రైతులు ఉన్నారు. ఈ పథకం ద్వారా అర్హులైన ప్రతి రైతు కుటుంబానికి ఏడాదికి రూ.20,000 ఆర్థిక సాయం అందిస్తోంది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.14,000 కాగా, కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ కింద రూ.6,000 సమకూరుస్తుంది. ఈ మొత్తాన్ని మూడు విడతల్లో పంపిణీ చేస్తారు.
ఈ విడతలో మొత్తం రూ.3,125.47 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.2,342.92 కోట్లు, కేంద్ర ప్రభుత్వ వాటా రూ.782.55 కోట్లు. శనివారం ఒక్కో రైతు ఖాతాలో రూ.7,000 రాష్ట్ర వాటా రూ.5,000, కేంద్ర వాటా రూ.2,000 జమ కానుంది. గత ఏడాది ఈ పథకం కింద ప్రభుత్వం మొత్తం రూ.8,985.41 కోట్లను రైతులకు పంపిణీ చేసింది.
