
ఏపీ ఎన్నికల కమిషనర్‌గా అనిల్ చంద్ర పునేఠా బాధ్యతల స్వీకరణ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన ఎన్నికల కమిషనర్‌గా (ఎస్ఈసీ) రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అనిల్ చంద్ర పునేఠా మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. విజయవాడలోని రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయంలో ఆయన బాధ్యతలు చేపట్టగా కమిషన్ కార్యదర్శి ఏ.మల్లికార్జున ఇతర ఉన్నతాధికారులు ఆయనకు ఘనస్వాగతం పలికారు.
పునేథా నియామకానికి సంబంధించి కమిషన్ కార్యదర్శి మల్లికార్జున అధికారిక ప్రకటన విడుదల చేశారు. బాధ్యతలు స్వీకరించిన తేదీ నుంచి ఐదేళ్ల కాలం పాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారని వెల్లడించారు.
గత ఎస్ఈసీ నీలం సాహ్ని పదవీకాలం ముగియడంతో ఆమె స్థానంలో పునేఠాను నియమిస్తూ ఈనెల 17వ తేదీనే ఉత్తర్వులు వెలువడ్డాయి. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవి రాజ్యాంగబద్ధమైన కీలక బాధ్యతగా ఉండగా, స్థానిక సంస్థల ఎన్నికలను స్వతంత్రంగా నిష్పక్షపాతంగా నిర్వహించడం ప్రధాన విధిగా ఉంటుంది. పంచాయతీలు, మున్సిపాలిటీలు, జిల్లా పరిషత్‌లు వంటి స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, ఓటర్ల జాబితా సిద్ధం ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడం వంటి కీలక బాధ్యతలు ఎస్ఈసీ పరిధిలో ఉంటాయి.
1984 బ్యాచ్‌కు చెందిన అనిల్ చంద్ర పునేఠా గతంలో రాష్ట్ర పరిపాలనలో వివిధ కీలక పదవుల్లో సేవలందించారు. ఆయన అనుభవం నేపథ్యంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ మరింత పారదర్శకంగా సాగుతుందని అధికార వర్గాలు భావిస్తున్నాయి. కాగా స్థానిక సంస్థల ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో ఈ నియామకం రాష్ట్ర రాజకీయ, పరిపాలనా వర్గాల్లో ప్రాధాన్యం సంతరించుకుంది.
