Let's talk: editor@tmv.in
చిన్నారుల భవిష్యత్తుకు అంగన్‌వాడీ కేంద్రాలే బలమైన పునాదులు: మంత్రి సీతక్క
చిన్నారుల భవిష్యత్తుకు అంగన్‌వాడీ కేంద్రాలే బలమైన పునాదులు: మంత్రి సీతక్క

చిన్నారుల భవిష్యత్తుకు అంగన్‌వాడీ కేంద్రాలే బలమైన పునాదులు: మంత్రి సీతక్క

Gaddamidi Naveen
16 జూన్, 2026

హైదరాబాద్ జిల్లా గోల్కొండ ప్రాజెక్టు పరిధిలోని మల్లేపల్లి సెంటర్, మహాత్మా గాంధీ నగర్ అంగన్‌వాడీ కేంద్రంలో నిర్వహించిన “అమ్మ మాట – అంగన్‌వాడీ బాట” కార్యక్రమంలో రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి డా. దనసరి అనసూయ సీతక్క పాల్గొన్నారు. నాంపల్లి ఎమ్మెల్యే మజీద్ హుస్సేన్‌తో కలిసి చిన్నారుల నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి, ప్రీ-స్కూల్ విద్యార్థులకు యూనిఫాంలు పంపిణీ చేసి, ప్రాథమిక పాఠశాలల్లో చేరనున్న చిన్నారులకు విద్యారంభ ధృవపత్రాలను అందజేశారు.

అంగన్‌వాడీ కేంద్రంలో చిన్నారులతో కలిసి అక్షరాభ్యాస కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సీతక్క, వారికి అభ్యాస పుస్తకాలు, ఆటవస్తువులు అందించారు. కేంద్రంలో అందుతున్న ప్రీ-స్కూల్ విద్య, పోషకాహార సేవలు, బోధన సామగ్రి వినియోగాన్ని పరిశీలించి చిన్నారుల అభ్యాస పురోగతిపై ఆరా తీశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, బాల్యంలోనే విద్యకు బలమైన పునాది వేయడంలో అంగన్‌వాడీ కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. పోషకాహారం, ప్రీ-స్కూల్ విద్య, ఆరోగ్య సేవలను సమగ్రంగా అందిస్తూ చిన్నారుల సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 38 వేల అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా సుమారు 9 లక్షల మంది చిన్నారులకు సేవలు అందుతున్నాయని మంత్రి వెల్లడించారు. ప్రతి చిన్నారికి రెండు జతల యూనిఫాంలు, 57 రకాల విద్యా, ఆటవస్తువులు అందిస్తున్నామని చెప్పారు. భద్రాద్రి కొత్తగూడెం, ఆదిలాబాద్ జిల్లాల్లో ప్రారంభించిన బ్రేక్‌ఫాస్ట్ పథకానికి మంచి స్పందన లభించడంతో దానిని రాష్ట్రవ్యాప్తంగా విస్తరించనున్నట్లు తెలిపారు.

ప్రైవేట్ నర్సరీలపై అధికంగా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. అంగన్‌వాడీలు చిన్నారుల భవిష్యత్తును తీర్చిదిద్దే తొలి విద్యాలయాలు అని సీతక్క పేర్కొన్నారు. అనంతరం అవగాహన ర్యాలీని ప్రారంభించిన మంత్రి, అంగన్‌వాడీ సేవలపై ప్రజల్లో అవగాహన పెంపొందించాలని పిలుపునిచ్చారు.