
రేపు ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్ది వేడుకలు..హాజరు కానున్న ప్రముఖులు
మేధావుల పురిటిగడ్డ ఆంధ్ర విశ్వవిద్యాలయం ( ఏయూ) చారిత్రాత్మక ఘట్టానికి చేరుకుంది. అజ్ఞాన తిమిరాలను పారద్రోలి అక్షర కాంతిని పంచడంలో వందేళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న తరుణంలో సోమవారం శతాబ్ది వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
కాగా ఈ వేడుకకు దేశ విదేశాల నుంచి ప్రముఖులు తరలివస్తున్నారు. భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, భారత ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. వీరితో పాటు గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, ప్రముఖ సినీ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తదితరులు ఈ వేడుకల్లో పాలుపంచుకోనున్నారు. షెడ్యూల్ ప్రకారం సచిన్ టెండూల్కర్ మధ్యాహ్నం 2:30 గంటలకు విశాఖ విమానాశ్రయానికి చేరుకుని వర్సిటీకి రానున్నారు. ఉపరాష్ట్రపతి సాయంత్రం 4 గంటల సమయంలో విచ్చేయనుండగా ఆయనకు గార్డ్ ఆఫ్ ఆనర్ అనంతరం ఘన సన్మానం నిర్వహించనున్నారు.
చరిత్ర పుటల్లో ఏయూ ప్రస్థానం
1926లో బ్రిటిష్ పాలనలో మద్రాస్ యూనివర్సిటీ చట్టం ద్వారా ఆవిర్భవించిన ఈ సంస్థ అనతి కాలంలోనే అంతర్జాతీయ ఖ్యాతిని గడించింది. ప్రఖ్యాత గణాంక శాస్త్రవేత్త సి.ఆర్. రావు తొలి వైస్ ఛాన్సలర్‌గా సేవలందించగా భారత రెండవ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ వంటి మహనీయులు ఈ పీఠాన్ని అలంకరించడం గర్వకారణం. ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వురి సుబ్బారావు, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఒడిశా గవర్నర్ కంభంపాటి హరిబాబు, జీఎంఆర్ గ్రూప్ అధినేత జి.ఎం.రావు, సైయెంట్ వ్యవస్థాపకుడు బి.వి.ఆర్. మోహన్ రెడ్డి వంటి ఎందరో మేధావులను ఈ విశ్వవిద్యాలయం దేశానికి అందించింది.
ఒప్పందాలు - ఆవిష్కరణలు
శతాబ్ది జ్ఞాపకార్థం కేంద్ర ప్రభుత్వం విడుదల చేయనున్న రూ.100 స్మారక నాణెం, తపాలా స్టాంప్ ఆవిష్కరణ ఈ ఉత్సవాల్లో ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. వీటితో పాటు ఏయూ చరిత్రను చాటిచెప్పే 'కాఫీ టేబుల్ బుక్', హెరిటేజ్ గ్రంథాలను అతిథులు విడుదల చేయనున్నారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం యూనివర్సిటీ ఆఫ్ ఫ్లోరిడా, ఆక్స్‌మిక్ ల్యాబ్స్, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటియోరాలజీ సంస్థలతో కీలక ఒప్పందాలు కుదుర్చుకోనున్నారు.
పురస్కారాల ప్రదానం
వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన 10 మంది ప్రముఖ పూర్వ విద్యార్థులను ఈ సందర్భంగా ప్రభుత్వం సత్కరించనుంది. ఇందులో మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు, మాజీ కేంద్ర హోం సెక్రటరీ కె.పద్మనాభయ్య, ఐఐటీ ఢిల్లీ మాజీ డైరెక్టర్ వి.ఎస్. రాజు, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. కార్యక్రమం ముగింపులో సచిన్ టెండూల్కర్‌కు ప్రత్యేక సన్మానం నిర్వహించనున్నారు. వందేళ్ల వైభవాన్ని చాటే ఈ వేడుకను వీక్షించేందుకు సుమారు 25 వేల మంది హాజరవుతారని అంచనా వేస్తున్నారు.
