
పర్యాటకుల స్వర్గధామంగా ఆంధ్రప్రదేశ్ నిలిచిపోవాలి : పవన్ కళ్యాణ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పర్యాటకుల స్వర్గధామంగా తీర్చిదిద్దడమే కాకుండా, ఇక్కడికి వచ్చే పర్యాటకులకు అత్యున్నత రక్షణ కల్పించడమే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. పర్యాటకుల భద్రతకు పూర్తి భరోసా ఇచ్చేలా రాష్ట్రంలో ‘పర్యాటక పోలీసు’ అనే సరికొత్త విధానాన్ని ప్రవేశపెట్టనున్నట్లు ఆయన ప్రకటించారు. సచివాలయంలో అటవీ, పర్యాటక, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల ఉన్నతాధికారులతో కలిసి ఆయన ఎకో టూరిజం అభివృద్ధిపై నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షలో పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ కూడా పాల్గొన్నారు.
రాష్ట్రంలోని అద్భుతమైన పర్యాటక ప్రాంతాలను వెలుగులోకి తెచ్చేందుకు నాలుగు ముఖ్య శాఖలతో ఒక ఉమ్మడి కమిటీని ఏర్పాటు చేయాలని డిప్యూటీ సీఎం ఆదేశించారు. ఈ కమిటీ రాష్ట్రవ్యాప్తంగా సుమారు 200 పర్యాటక ప్రాంతాలను గుర్తించి, అక్కడ అందుబాటులో ఉన్న సౌకర్యాలపై ఐదు రోజుల్లోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని సూచించారు. ‘పర్యాటక పోలీసు’ వ్యవస్థ ఏర్పాటుపై త్వరలోనే రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు వెల్లడించారు. ఈ విధానం ద్వారా రాష్ట్రంలో సుమారు 50 వేల మంది యువతకు ఉపాధి లభించడంతో పాటు ఎపికి జాతీయ స్థాయిలో సురక్షిత పర్యాటక రాష్ట్రంగా గుర్తింపు లభిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
గ్రామాల్లో పర్యాటక శోభ తీసుకురావడానికి ఈశాన్య రాష్ట్రాల తరహాలో 'హోమ్ స్టే' సంస్కృతిని ఆతిథ్య విధానాన్ని పైలట్ ప్రాజెక్టులుగా ప్రవేశపెట్టాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. దీనివల్ల గ్రామాలు ఆర్థికంగా బలోపేతం అవుతాయన్నారు. అలాగే కర్నూలు జిల్లాలోని కృష్ణ జింకల ప్రాంతాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో, నల్లమలలోని బైర్లూటి, నెల్లూరులోని ఫ్లెమింగో పక్షుల కేంద్రాలను వాటి ప్రత్యేకతలకు అనుగుణంగా ఎకో టూరిజం కింద అభివృద్ధి చేయాలని అధికారులను ఆదేశించారు.
