
‘పీఎం శ్రీ’ నిధుల వినియోగంలో దేశంలో తొలి స్థానంలో ఆంధ్రప్రదేశ్: మంత్రి లోకేష్
ప్రభుత్వ పాఠశాలల ఆధునీకరణే ధ్యేయంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘పీఎం శ్రీ’ (ప్రధాన మంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా) పథకం నిధుల వినియోగంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచిందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. విద్యాశాఖ ఉన్నతాధికారులతో గురువారం రాత్రి నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన ఈ కీలక మైలురాయిని వెల్లడించారు. ఈ ఘనత సాధించినందుకు అధికారులను ప్రత్యేకంగా అభినందించిన మంత్రి.. ఇదే స్ఫూర్తితో వైఎస్ఆర్ కడప జిల్లా నమూనా ఆధారంగా రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది 844 స్మార్ట్ కిచెన్లను నిర్మించాలని ఆదేశించారు.
దేశవ్యాప్తంగా 14,500 ప్రభుత్వ పాఠశాలలను జాతీయ విద్యా విధానం-2020 ప్రమాణాలకు అనుగుణంగా మోడల్ స్కూల్స్‌గా తీర్చిదిద్దేందుకు ఈ పీఎం శ్రీ పథకాన్ని కేంద్రం అమలు చేస్తోంది. దీని ద్వారా సుమారు 18 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది.
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు 'సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్ల' పంపిణీ ఇప్పటికే ప్రారంభమైందని, రానున్న మెగా తల్లిదండ్రుల-ఉపాధ్యాయుల సమావేశంలోపు ఈ ప్రక్రియను పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. వీటితో పాటు ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న 2.03 లక్షల మంది విద్యార్థులకు కూడా విద్యా కిట్లను అందజేస్తున్నట్లు అధికారులు మంత్రికి వివరించారు. కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాల (కేజీబీవీలు) పై మంత్రి లోకేష్ ప్రత్యేక శ్రద్ధ కనబరిచారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 430 కేజీబీవీల్లోని 1.06 లక్షల మంది బాలికల కోసం తక్షణమే 53,180 బంక్ బెడ్ల ఏర్పాటును చేపట్టాలని ఆదేశించారు. ఈ తరహా వసతులను ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ స్కూళ్లు, కాలేజీలకు కూడా విస్తరించాలని సూచించారు.
అనాధ పిల్లలకు ‘తల్లికి వందనం’ భరోసా
బడికి వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి రూ. 15,000 ఆర్థిక సహాయం అందించే 'తల్లికి వందనం' పథకం పరిధిలోకి అనాధ పిల్లలను కూడా తీసుకురావాలని విద్యాశాఖ మంత్రి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అనాధ పిల్లల సంరక్షకుల వివరాలను సేకరించాలి. ఒకవేళ ఎవరూ లేని పక్షంలో ఆ నిధులను నేరుగా జిల్లా కలెక్టర్‌కు బదిలీ చేసి, లబ్ధి ఆ పిల్లలకే చేరేలా చూడాలి. అంతేకాకుండా, ఈ నిధులు నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లో జమై, వారి చదువు పూర్తయిన తర్వాతే విత్‌డ్రా చేసుకునేలా ఒక శాశ్వత యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలి. దీనివల్ల వారికి దీర్ఘకాలిక ఆర్థిక భద్రత లభిస్తుందని మంత్రి పేర్కొన్నారు.
ప్రైవేట్ అన్-ఎయిడెడ్ పాఠశాలల అనుమతుల ప్రక్రియలో ఉన్న అనవసరమైన నిబంధనలను, ఆంక్షలను తొలగించాలని లోకేష్ అధికారులను ఆదేశించారు. విద్యాసంస్థల్లో పారదర్శకత కోసం ప్రభుత్వం ఆమోదించిన ఫీజుల వివరాలను పాఠశాలల ప్రాంగణాల్లో అందరికీ కనిపించేలా ప్రదర్శించడంతో పాటు పబ్లిక్ డొమైన్ (వెబ్‌సైట్) లో అందుబాటులో ఉంచాలన్నారు. అదేవిధంగా, తెలుగు అకాడమీ ప్రచురించే పాఠ్యపుస్తకాలను ప్రజలు సులభంగా కొనుగోలు చేసేందుకు వీలుగా అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లలో అందుబాటులో ఉంచాలని సూచించారు.
వెనుకబడిన జిల్లాలపై ప్రత్యేక నిఘా
విద్యాపరంగా వెనుకబడిన కర్నూలు, అనంతపురం, మార్కాపురం, అల్లూరి సీతారామరాజు, పోలవరం జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి పిలుపునిచ్చారు. ఆయా ప్రాంతాల్లో ఉపాధ్యాయుల లభ్యతను సమీక్షించి, విద్యార్థుల ఉత్తీర్ణత శాతాన్ని పెంచేందుకు అంకితభావంతో కూడిన కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థుల హాజరు శాతం 95 శాతానికి తగ్గకుండా చూడాలని, మధ్యాహ్న భోజన పథకాన్ని అత్యున్నత నాణ్యత, పారదర్శకతతో అమలు చేయాలని స్పష్టం చేశారు. అలాగే, అధికారిక విద్యా బోధనలో తెలుగు భాషను నిర్లక్ష్యం చేయరాదని, గణితం, సైన్స్, తెలుగు సబ్జెక్టులకు సంబంధించి బ్రిడ్జ్ కోర్సు మెటీరియల్‌ను సిద్ధం చేసి, చదువులో వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని ఉపాధ్యాయులను చైతన్యపరచాలన్నారు. హైస్కూల్ విద్యార్థుల కోసం క్రోమ్‌బుక్స్ తో కూడిన అత్యాధునిక కంప్యూటర్ ల్యాబ్‌ల ఏర్పాటును వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
