
సింగరేణిలో బొగ్గు కుంభకోణంపై విచారణ జరపాలి: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి కేటీఆర్ లేఖ
సింగరేణి సంస్థలో చోటుచేసుకున్నట్లు ఆరోపణలు వస్తున్న రూ.1600 కోట్ల భారీ బొగ్గు కుంభకోణంపై వెంటనే సమగ్ర విచారణ చేపట్టాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డికి లేఖ రాశారు.
సింగరేణి సంస్థ ప్రకటించిన నిల్వల నుంచి సుమారు 40 లక్షల టన్నుల బొగ్గు మాయమైందని, దీని విలువ దాదాపు రూ.1600 కోట్లు ఉంటుందని కేటీఆర్ ఆరోపించారు. స్టాక్ యార్డుల్లో ఉండాల్సిన బొగ్గును అక్రమంగా విక్రయించారని పేర్కొన్నారు. ఈ బొగ్గు ఏమైందో వెంటనే తేల్చి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సింగరేణి వరుస కుంభకోణాలకు కేంద్రంగా మారిందని కేటీఆర్ విమర్శించారు. నైనీ కుంభకోణం సహా పలు అక్రమాలపై కేంద్ర ప్రభుత్వం స్పందించలేదని అన్నారు. బొగ్గు నిల్వలను తనిఖీ చేయాల్సిన కేంద్ర బొగ్గు గనుల శాఖ, కాగ్ అధికారులు ఇప్పటివరకు ఎందుకు తనిఖీలు చేపట్టలేదని ఆయన ప్రశ్నించారు.
సింగరేణి బొగ్గు తెలంగాణ ప్రజల ఆస్తి అని పేర్కొన్న కేటీఆర్, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి సంస్థ మనుగడను దెబ్బతీస్తున్నాయని ఆరోపించారు. కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డిల మధ్య ములాఖత్ లేకపోతే.. కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి విచారణ జరపాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అఖిలపక్ష ప్రతినిధి బృందాన్ని సంబంధిత గనుల వద్దకు పంపి వాస్తవాలు వెలికితీయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
