
అమిత్ షా వర్సెస్ అఖిలేశ్ యాదవ్
మహిళా రిజర్వేషన్ బిల్లు, డీలిమిటేషన్ అంశాలపై లోక్‌సభలో గురువారం కేంద్ర ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ అఖిలేశ్ యాదవ్ కేంద్రం తొందరపాటు నిర్ణయాలపై ప్రశ్నించగా, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా మత ఆధారిత రిజర్వేషన్ రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేశారు. లోక్‌సభలో అఖిలేశ్ యాదవ్ మాట్లాడుతూ మహిళా రిజర్వేషన్ బిల్లును కేంద్రం త్వరగా తీసుకురావడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ముందుగా జనగణన పూర్తిచేయాలని, ఆ తర్వాతే డీలిమిటేషన్ ప్రక్రియను చేపట్టాలని ఆయన అన్నారు. మహిళా రిజర్వేషన్‌కు సమాజ్‌వాదీ పార్టీ మద్దతు ఇస్తుంది. కానీ డీలిమిటేషన్ ద్వారా దాన్ని అమలు చేయడాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. ముందుగా జనగణన జరగాలి. తరువాత కులగణన జరగాలి. ఆ తరువాతే రిజర్వేషన్ అంశంపై నిర్ణయం తీసుకోవాలి. లేకపోతే మోసం చేస్తున్నట్టే అని యాదవ్ వ్యాఖ్యానించారు. అలాగే సమాజ్‌వాదీ పార్టీ మరో ఎంపీ ధర్మేంద్ర యాదవ్ కూడా లోక్‌సభలో ప్రవేశపెట్టిన మూడు బిల్లులకు వ్యతిరేకత ప్రకటించారు. అయినప్పటికీ మహిళా రిజర్వేషన్‌కు తమ పార్టీ పూర్తి మద్దతు ఉందని చెప్పారు.
మత ఆధారంగా రిజర్వేషన్ రాజ్యాంగ విరుద్ధం
దీనికి ప్రతిస్పందించిన అమిత్ షా మత ఆధారంగా రిజర్వేషన్ ఇవ్వడం రాజ్యాంగానికి విరుద్ధమని అన్నారు. జనగణన ఎందుకు జరగడం లేదని అఖిలేష్ యాదవ్ అడిగారు. దేశానికి చెప్పదలచుకున్నది ఏమిటంటే జనగణన ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. ప్రభుత్వం కుల గణన చేయాలని కూడా నిర్ణయించింది. కానీ మత ఆధారంగా రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పడం రాజ్యాంగ విరుద్ధమని షా తెలిపారు. ప్రభుత్వం లోక్‌సభలో ప్రవేశపెట్టిన బిల్లుల్లో అర్జున్ రామ్ మేఘ్వాల్ ప్రవేశపెట్టిన రాజ్యాంగ (131వ సవరణ) బిల్లు–2026, డీలిమిటేషన్ బిల్లు–2026, అలాగే అమిత్ షా ప్రవేశపెట్టిన యూనియన్ టెర్రిటరీస్ లాస్ (సవరణ) బిల్లు–2026 ఉన్నాయి. మహిళా రిజర్వేషన్ చట్టం అమలుకు సంబంధించి ఈ బిల్లులను ఆమోదించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 16 నుంచి 18 వరకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేసింది. 2023లో ఆమోదించిన నారీ శక్తి వందన్ అధినియమ్ 2023, అమలును 2029 లోక్‌సభ ఎన్నికల నాటికి చేపట్టాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దీనికి 2011 జనగణన ఆధారంగా డీలిమిటేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని కేంద్రం యోచిస్తోంది.
