Let's talk: editor@tmv.in
గుజరాత్ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటేసిన అమిత్‌షా

గుజరాత్ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటేసిన అమిత్‌షా

Pinjari Chand
27 ఏప్రిల్, 2026

గుజరాత్‌లో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మోస్తరు పోలింగ్ నమోదైంది. ఎండ తీవ్రంగా ఉన్నప్పటికీ ఓటర్లు పెద్ద సంఖ్యలో బయటకు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాష్ట్రంలో 15 మున్సిపల్ కార్పొరేషన్లు ఉన్నాయి. అహ్మదాబాద్, సూరత్, వడోదర, రాజ్‌కోట్ వంటి ప్రధాన నగరాలతో పాటు 84 మున్సిపాలిటీలు, 34 జిల్లా పంచాయతీలు, 260 తాలూకా పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇది భారీ ఎన్నికల ప్రక్రియగా భావిస్తున్నారు. ఈ ఎన్నికలు సవరణ చేసిన ఓబీసీ రిజర్వేషన్ నిబంధనల ప్రకారం జరుగుతున్నాయి. దీనివల్ల పలు ప్రాంతాల్లో వార్డుల పునర్విభజన (డిలిమిటేషన్) చేపట్టాల్సి వచ్చింది. అవసరమైతే ఏప్రిల్‌ 27న రీపోలింగ్ నిర్వహిస్తారు. ఓట్ల లెక్కింపు ఏప్రిల్‌ 28న , మొత్తం ఎన్నికల ప్రక్రియ ఏప్రిల్‌ 30నాటికి పూర్తవుతుంది. ఈసారి తొలిసారిగా 9 కొత్త మున్సిపల్ కార్పొరేషన్లకు కూడా ఎన్నికలు నిర్వహిస్తున్నారు. బీజేపీ, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీతో పాటు ఎన్సీపీ, ఏఐఎంఐఎం వంటి పార్టీలు పోటీలో ఉండడంతో అనేక ప్రాంతాల్లో బహుముఖ పోటీ నెలకొంది. సుమారు 9,200 స్థానాలకు పైగా ఎన్నికలు జరుగుతుండగా, 4.18 కోట్లకు పైగా ఓటర్లు అర్హత పొందారు.

ఓటు హక్కు వినియోగించుకున్న అమిత్‌షా

కేంద్ర హోంమంత్రి అమిత్‌షా గాంధీనగర్‌లో కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం దేవాలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌ అహ్మదాబాద్‌లో ఓటు వేశారు. ఇది ప్రజాస్వామ్య పండుగ. ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని పిలుపునిచ్చారు. డిప్యూటీ సీఎం హర్ష్ సంగ్హవి సూరత్‌లో ఓటు వేసి, ప్రజలు అభివృద్ధి కోసం పెద్ద ఎత్తున పాల్గొంటున్నారని అన్నారు. ఇక అదానీ ఎయిర్‌‌పోర్ట్‌ హోల్డింగ్స్‌ డైరెక్టర్ జీత్‌ అదానీ, ఆయన భార్య దివా షా అహ్మదాబాద్‌లో ఓటు వేశారు.