
హైదరాబాద్‌లో అమెరికన్ కాన్సులేట్ రోడ్డుకు ‘ట్రంప్’ పేరు.. ఈ నెల 23 ప్రారంభం
తెలంగాణ ప్రభుత్వం వచ్చే వారం హైదరాబాద్ నగరంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరు మీద ఒక ప్రధాన రహదారిని ప్రారంభించనుంది. ఇక్కడి అమెరికన్ కాన్సులేట్ సమీపంలో ఉన్న ఈ ‘డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ’ ను జూన్ 23న ప్రారంభించనున్నట్లు అధికారిక వర్గాలు మంగళవారం వెల్లడించాయి.
హైదరాబాద్‌లోని యునైటెడ్ స్టేట్స్ కాన్సులేట్ జనరల్ వెంబడి ఉన్న అత్యంత ప్రతిష్టాత్మకమైన రహదారికి ‘డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ’గా పేరు పెట్టనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం గత ఏడాది డిసెంబర్‌లోనే ప్రకటించింది. దీంతో పాటు ప్రతిపాదిత రీజినల్ రింగ్ రోడ్ వద్ద నిర్మించబోయే గ్రీన్‌ఫీల్డ్ రేడియల్ రోడ్డుకు దివంగత ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా గౌరవార్థం ఆయన పేరు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే గూగుల్, గూగుల్ మ్యాప్స్ యొక్క ప్రపంచ స్థాయి సహకారాన్ని గుర్తిస్తూ మరో ప్రముఖ రహదారికి ‘గూగుల్ స్ట్రీట్’ అని పేరు పెట్టనున్నారు.
ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రముఖులు, గ్లోబల్ కంపెనీల పేర్లను ఇక్కడి ప్రధాన రహదారులకు పెట్టడం ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని ఆవిష్కరణల హబ్‌గా నిలబెట్టాలనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ చొరవలో భాగమే ఈ నిర్ణయం.
