Let's talk: editor@tmv.in
సవరణ బిల్లుతో ప్రజాస్వామ్యానికి ముప్పు: ప్రియాంకగాంధీ

సవరణ బిల్లుతో ప్రజాస్వామ్యానికి ముప్పు: ప్రియాంకగాంధీ

Pinjari Chand
17 ఏప్రిల్, 2026

మహిళా రిజర్వేషన్ చట్టంలో మార్పులు చేయడానికి ప్రభుత్వం తీసుకొచ్చిన రాజ్యాంగ సవరణ బిల్లుపై కాంగ్రెస్ నేత ప్రియాంకగాంధీ వాద్రా తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ బిల్లు పార్లమెంట్‌లో ఆమోదం చెందితే భారతదేశంలో ప్రజాస్వామ్యం ముగిసిపోతుందని ఆమె హెచ్చరించారు. లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ చట్టానికి సంబంధించిన సవరణలు, డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు కోసం ప్రవేశపెట్టిన మూడు బిల్లులపై జరిగిన చర్చలో పాల్గొన్న ప్రియాంక గాంధీ, ప్రభుత్వం ఇప్పటికే ఎన్నికల సంఘం, న్యాయవ్యవస్థ, మీడియా వంటి సంస్థలపై ఒత్తిడి తెచ్చి ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచిందని ఆరోపించారు. ఇప్పుడు రాజ్యాంగ సవరణ బిల్లుతో ప్రజాస్వామ్యంపై బహిరంగ దాడి ప్రారంభమైందని ఆమె అన్నారు.

ప్రస్తుతం లోక్‌సభలో ఉన్న 543 స్థానాలపైనే మహిళలకు 33 శాతం రిజర్వేషన్ ఇవ్వవచ్చని, అయితే ప్రభుత్వం ఎందుకు కొత్తగా స్థానాలను పెంచాలని చూస్తోందని ఆమె ప్రశ్నించారు. బిల్లులో లోక్‌సభ స్థానాలను సుమారు 850 వరకు పెంచే అవకాశం ఉందని, అది డీలిమిటేషన్ కమిషన్ ద్వారా 2011 జనగణన ఆధారంగా నిర్ణయిస్తారని ఆమె పేర్కొన్నారు. ఈ ప్రతిపాదన బయటికి చూస్తే సరైనదిగా కనిపించినా లోతుగా పరిశీలిస్తే రాజకీయ ఉద్దేశాలు ఉన్నట్లు అనిపిస్తోందని ప్రియాంక గాంధీ వ్యాఖ్యానించారు. డీలిమిటేషన్ కమిషన్‌లో ఉన్న ముగ్గురు సభ్యులే రాష్ట్రాల ప్రతినిధిత్వాన్ని నిర్ణయిస్తారని, ఇది రాష్ట్రాల భవిష్యత్తును ప్రభావితం చేసే అంశమని అన్నారు.

గతంలో నుంచే కాంగ్రెస్‌ మహిళలకు స్థానం కల్పించింది

మహిళా రిజర్వేషన్ అంశం చాలా కాలంగా కొనసాగుతున్నదని గుర్తుచేశారు. కాంగ్రెస్ చరిత్రను ప్రస్తావిస్తూ మోతీలాల్‌ నెహ్రు నేతృత్వంలోని కమిటీ మహిళలకు సమాన హక్కులపై ప్రతిపాదనలు చేసిందని చెప్పారు. అలాగే మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ పంచాయతీలు, మున్సిపాలిటీల్లో మహిళా రిజర్వేషన్ కోసం బిల్లు తీసుకువచ్చారని తెలిపారు. తర్వాత పీవీ.నరసింహరావు ప్రభుత్వం సమయంలో అది అమలులోకి వచ్చిందని గుర్తుచేశారు. మహిళా రిజర్వేషన్ చట్టానికి కాంగ్రెస్ ఎప్పుడూ మద్దతు ఇచ్చిందని, 2023లో కూడా పార్టీ ఆ బిల్లుకు మద్దతు తెలిపిందని ఆమె చెప్పారు. అయితే ప్రస్తుతం ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లులతో చర్చ దిశ మారిపోయిందని విమర్శించారు.

ఇదే చర్చలో పాల్గొన్న సమాజవాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ కూడా కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. మహిళలను సాధికారత చేయడం కంటే రాజకీయ ప్రయోజనాల కోసం ‘నారీ’ని ‘నారా’గా మార్చిందని ఆయన ఆరోపించారు. దేశంలో మహిళా రిజర్వేషన్‌కు తమ పార్టీ ఎప్పుడూ మద్దతు ఇస్తోందని చెప్పిన ఆయన, ఈ చట్టంలో ఓబీసీ, ముస్లిం మహిళలకు కూడా రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. మహిళా రిజర్వేషన్ పేరుతో డీలిమిటేషన్‌ను ముందుకు తీసుకువచ్చి జనగణనను ఆలస్యం చేయాలని కేంద్రం ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు.