Let's talk: editor@tmv.in
అంబేద్కర్ విగ్రహాన్ని రెండున్నరేళ్లుగా బందీ చేశారు: కాంగ్రెస్‌పై కేటీఆర్ విమర్శలు

అంబేద్కర్ విగ్రహాన్ని రెండున్నరేళ్లుగా బందీ చేశారు: కాంగ్రెస్‌పై కేటీఆర్ విమర్శలు

Gaddamidi Naveen
15 ఏప్రిల్, 2026

హైదరాబాద్‌లోని హుస్సేన్ సాగర్ తీరాన ఉన్న 125 అడుగుల డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం వద్ద బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించారు. తెలంగాణ భవన్ నుంచి భారీ కాన్వాయ్‌తో బయలుదేరిన ఆయనతో పాటు పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నాయకులు పెద్ద ఎత్తున కార్యక్రమంలో పాల్గొన్నారు. బాబాసాహెబ్ విగ్రహానికి పూలమాలలు సమర్పించి, ఆయన ఆశయాలను స్మరించుకుంటూ పార్టీ శ్రేణులు నినాదాలు చేశారు.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన కేటీఆర్, ప్రపంచంలోనే అతిపెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేశారని గుర్తుచేశారు. బోధించు, సమీకరించు, పోరాడు అనే అంబేద్కర్ సిద్ధాంతంతోనే తెలంగాణ రాష్ట్ర సాధన సాధ్యమైందని ఆయన పేర్కొన్నారు. అంబేద్కర్ పట్ల గౌరవం మాటల్లో కాకుండా చేతల్లో ఉండాలని, దళితుల అభివృద్ధి కోసం తమ ప్రభుత్వం 1000 గురుకుల పాఠశాలలు స్థాపించిందని ఆయ‌న‌ తెలిపారు. అంతేకాకుండా రాష్ట్ర సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టి గౌరవించిన విషయాన్ని కూడా గుర్తు చేశారు.

ఇదే సమయంలో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. గత రెండున్నరేళ్లుగా అంబేద్కర్ విగ్రహ ప్రాంగణాన్ని నిర్లక్ష్యానికి గురిచేసి “బందీ”గా మార్చారని ఆరోపించారు. బీఆర్ఎస్ ఇచ్చిన హెచ్చరికల తర్వాతే ప్రభుత్వం స్పందించి ఇప్పుడు వేడుకలు నిర్వహిస్తోందని మండిపడ్డారు. దళితులకు రూ.12 లక్షలు ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పటివరకు ఒక్క పైసా కూడా ఇవ్వలేదని విమర్శించారు.

చేవెళ్ల ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌తో పాటు బీసీ, రైతు డిక్లరేషన్లను అమలు చేసే వరకు తమ పోరాటం ఆగదని కేటీఆర్ పేర్కొన్నారు. దళిత, గిరిజన వర్గాలకు చేసిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజలను మోసగించిన కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలను రాష్ట్రంలోని ప్రతి గ్రామానికి తీసుకెళ్లి ఎండగడతామని అన్నారు. ఈ కార్యక్రమం అనంతరం కేటీఆర్, ఇతర నేతలు విగ్రహం కింద ఉన్న మ్యూజియంను సందర్శించి, అంబేద్కర్ జీవిత విశేషాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని, అంబేద్కర్ ఆశయాలకు కట్టుబడి పోరాటం కొనసాగిస్తామని ప్రతిజ్ఞ చేశారు.