

రూ.110 కోట్లతో అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్ నిర్మిస్తాం: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
తెలంగాణలో సంక్షేమ రాజ్య నిర్మాణమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. లోయర్ ట్యాంక్‌బండ్ వద్ద రూ.110 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్, కాచిగూడ నింబోలిఅడ్డా వద్ద రూ.25 కోట్లతో నిర్మించనున్న ఎస్సీ హాస్టల్ భవనాల స్థలాలను సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌తో కలిసి ఆయన పరిశీలించారు.
స్థల పరిశీలన అనంతరం డిప్యూటీ సీఎం మాట్లాడుతూ, ఇప్పటికే ఈ రెండు ప్రాజెక్టులకు ఆర్థిక, పరిపాలనా అనుమతులు మంజూరయ్యాయని తెలిపారు. ఈ భవనాలు కేవలం నిర్మాణాలు మాత్రమే కాకుండా వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే ఆధునిక విజ్ఞాన కేంద్రాలుగా నిలుస్తాయని అన్నారు. రాష్ట్రంలోని నిరుద్యోగ యువతీ యువకులు కోచింగ్, అధ్యయన సౌకర్యాల కోసం ఎదుర్కొంటున్న ఇబ్బందులను శాశ్వతంగా తొలగించాలన్నదే ప్రభుత్వ సంకల్పమని పేర్కొన్నారు.
ట్యాంక్‌బండ్ సమీపంలో నిర్మించనున్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్‌ను సెల్లార్, గ్రౌండ్ ఫ్లోర్‌తో పాటు మరో 10 అంతస్తులతో అత్యాధునికంగా నిర్మించనున్నట్లు తెలిపారు. అలాగే నింబోలిఅడ్డా వద్ద మూడు అంతస్తుల ఎస్సీ హాస్టల్ నిర్మాణం దళితులు, పేద వర్గాల దీర్ఘకాలిక ఆకాంక్ష అని చెప్పారు. ఈ రెండు ప్రాజెక్టులు విద్య, జ్ఞానాభివృద్ధికి కీలక కేంద్రాలుగా మారనున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. నాలెడ్జ్ సెంటర్‌లో స్టడీ సర్కిల్స్, డిజిటల్ లైబ్రరీ, ఆధునిక కాన్ఫరెన్స్ హాల్స్ ఏర్పాటు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. ఇవి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు, యువతకు ఉత్తమ అధ్యయన వేదికలుగా ఉపయోగపడతాయని తెలిపారు.
ఈ పర్యటనలో రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, కాలేరు వెంకటేష్, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ తో పాటు సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు పాల్గొన్నారు.
