Let's talk: editor@tmv.in
తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో అంబేద్కర్ జయంతి వేడుకలు

తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో అంబేద్కర్ జయంతి వేడుకలు

Gaddamidi Naveen
15 ఏప్రిల్, 2026

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో మంగళవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా అసెంబ్లీ ఆవరణలోని మహనీయుడి విగ్రహానికి ప్రముఖులు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.

శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ ముదిరాజ్ ఈ కార్యక్రమంలో ప్రధానంగా పాల్గొన్నారు. వీరితో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కౌన్సిల్ సెక్రటరీ వి.నరసింహ చార్యులు, ఇతర ఉన్నతాధికారులు బాబాసాహెబ్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు.

అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనించాలని, ఆయన వేసిన పునాదులే నేటి ప్రజాస్వామ్యానికి మార్గదర్శకాలని ఈ సందర్భంగా నేతలు స్మరించుకున్నారు. చట్టసభల వేదికగా సామాజిక న్యాయం కోసం బాబాసాహెబ్ చేసిన కృషిని వారు కొనియాడారు. సామాజిక సమానత్వం, రాజ్యాంగ విలువల కోసం జీవితాంతం కృషి చేసిన అంబేద్కర్ ఆశయాలను స్మరించుకుంటూ ఈ కార్యక్రమం అసెంబ్లీ ప్రాంగణంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించబడింది.