
అంబటి మురళివి మొసలి కన్నీళ్లు:ధూళిపాళ్ల నరేంద్ర
రాజకీయ నిరుద్యోగులు ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు రోజుకో అబద్ధం చెబుతూ కుటిల ప్రయత్నాలు చేస్తున్నారని పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ ధ్వజమెత్తారు. వైకాపా నేత అంబటి మురళీకృష్ణ తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పొన్నూరు నియోజకవర్గ అభివృద్ధిని చూసి ఓర్వలేక ప్రజలపై విద్వేషాన్ని, విష రాజకీయాన్ని కక్కుతున్నారని విమర్శించారు.
ఎన్నికల సమయంలో వలస వచ్చి ఓట్లు అభ్యర్థించిన అంబటి మురళి నాకు ఓటు వేయకపోతే నాశనం అయిపోతారు అని ప్రజలను కించపరిచారని ధూళిపాళ్ల గుర్తుచేశారు. ఆనాడు ప్రజల ఆగ్రహానికి గురైనప్పటికీ ఆయనలో మార్పు రాలేదని ఇటీవల ఒక మీడియా సమావేశంలో పొన్నూరును 'దౌర్భాగ్యపు నియోజకవర్గం' అని సంబోధించి స్థానిక ప్రజల మనోభావాలను దారుణంగా దెబ్బతీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయంగా నా మీద కక్ష సాధింపులు చేసుకోండి నేను సిద్ధం. కానీ పొన్నూరు ప్రజలను గుంటూరు జిల్లా రైతులను అవమానిస్తే సహించేది లేదు అని ఆయన హెచ్చరించారు.
మొక్కజొన్న రైతుల పేరిట ధర్నా డ్రామాలు
మొక్కజొన్న రైతుల సమస్యలపై అంబటి మురళి తాజాగా చేపట్టిన ధర్నా ప్రయత్నాలను ధూళిపాళ్ల ఎద్దేవా చేశారు. నియోజకవర్గంలో ఏం జరుగుతుందో తెలియని కనీస అవగాహన లేని వ్యక్తులు ప్రభుత్వంపై బురద చల్లడమే ధ్యేయంగా పెట్టుకున్నారని విమర్శించారు. గత ఐదేళ్ల వైకాపా పాలనలో రైతులు అష్టకష్టాలు పడుతుంటే కనీసం పలకరించిన నాథుడు లేడని ఇప్పుడు అధికారంలో లేకపోయేసరికి 'మొసలి కన్నీళ్లు' కార్చుతూ కొత్త నాటకాలకు ప్రదర్శిస్తున్నారు అని దుయ్యబట్టారు.
రైతు సంక్షేమమే కూటమి లక్ష్యం
మొక్కజొన్న పంట కోత ప్రారంభమైన నేపథ్యంలో బహిరంగ మార్కెట్‌లో ధరల హెచ్చుతగ్గులపై ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని నరేంద్ర వివరించారు. రైతుల ఆందోళనను దృష్టిలో ఉంచుకుని మద్దతు ధరకు పంటను కొనుగోలు చేసేలా కేంద్రాలను ఏర్పాటు చేయాలని తాము ఇప్పటికే ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశామని రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రంతో సంప్రదింపులు జరుపుతోందని కొనుగోలు కేంద్రాల ఏర్పాటు ప్రక్రియ పరిశీలనలో ఉందని స్పష్టం చేశారు.
పారదర్శక పాలన సాగుతోంది
ప్రస్తుత కూటమి ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని అనునిత్యం రైతుల శ్రేయస్సు కోసమే పనిచేస్తుందని ఆయన పునరుద్ఘాటించారు. వరి కొనుగోలు, సొమ్ము చెల్లింపుల్లో తీసుకువచ్చిన పారదర్శకతే ఇందుకు నిదర్శనమని దీనివల్ల రైతుల్లో ప్రభుత్వంపై నమ్మకం పెరిగిందని స్పష్టం చేశారు. ఇప్పటికైనా రాజకీయ నిరుద్యోగులు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను గమనించాలని అవగాహన లేకుండా గుడ్డెద్దు చేనులో పడ్డట్లు వ్యవహరించవద్దని ధూళిపాళ్ల హితవు పలికారు.
