
అమరావతిని అభివృద్ధి ఇంజిన్‌గా తీర్చిదిద్దాలి: ఏపీ సీఎం
నవ్యాంధ్ర రాజధాని అమరావతిని రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు కీలక కేంద్రంగా అసలైన అభివృద్ధి ఇంజిన్‌గా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు స్పష్టం చేశారు. రాజధాని ప్రాంతంలో అభివృద్ధి పనులను వేగవంతం చేయడంతో పాటు ప్రపంచ స్థాయి మౌలిక వసతులతో అమరావతిని అంతర్జాతీయ పెట్టుబడులకు ప్రధాన ఆకర్షణగా మార్చాలని ఆయన సూచించారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఏపీ సీఆర్‌డీఏ) 60వ సమావేశానికి అధ్యక్షత వహించిన ఆయన రాజధాని నిర్మాణంలో నాణ్యత, వేగంపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.
రాజధానిలో చేపట్టే అన్ని నిర్మాణాలు తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఉండాలని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు. కేవలం భవనాలే కాకుండా హై-రైజ్ బిల్డింగ్‌లు, ఐకానిక్ నిర్మాణాలతో అమరావతికి ఒక ప్రత్యేక అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావాలని అధికారులకు సూచించారు. ముఖ్యంగా అమరావతి–విజయవాడ మధ్య కృష్ణా నదిపై నిర్మించనున్న ఐకానిక్ వంతెన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ భవనాలు ముఖ్యంగా అసెంబ్లీ వంటి నిర్మాణాలు ప్రపంచ స్థాయి సందర్శక అనుభవాన్ని కలిగించేలా వినూత్న డిజైన్లతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు.
ఇక రాష్ట్రానికి ఆర్థిక ఊతాన్నిచ్చేలా బ్యాంకులు అంతర్జాతీయ ఆర్థిక సంస్థలకు కేంద్రంగా ఉండేలా ప్రత్యేక ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఏర్పాటు చేయాలని సీఎం ప్రతిపాదించారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని నీరు, విద్యుత్, గ్యాస్ వంటి కనీస సేవల కోసం అత్యాధునిక యుటిలిటీ కారిడార్లను అభివృద్ధి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు 60వ సీఆర్‌డీఏ సమావేశంలో పలు కీలక ప్రాజెక్టులకు నిధుల కేటాయిస్తూ ఆమోదం తెలిపారు. క్వాంటం వ్యాలీలో ట్విన్ టవర్ల నిర్మాణానికి రూ.1,208.41 కోట్లు, సచివాలయం, విభాగాధిపతుల టవర్ల నిర్మాణానికి రూ.2,540 కోట్లు, అసెంబ్లీ సివిల్ పనుల కోసం రూ.798 కోట్లు మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
ఏఐ క్యాంపస్ గా బిట్స్ పిలాని
అంతకుముందు బిట్స్ పిలాని సంస్థ ప్రతినిధులు సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశం అయ్యారు. రాజధాని ప్రాతంలో నిర్మిస్తున్న బిట్స్ పిలాని క్యాంపస్ పనుల పురోగతిపై ముఖ్యమంత్రికి వివరించారు. రాజధానిలో నిర్మిస్తున్న క్యాంపస్ లో క్వాంటం, ఏఐ విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు బిట్స్ పిలాని ప్రతినిధులు తెలిపారు. 2027 నుంచి అడ్మిషన్లు ప్రారంభిస్తామని ముఖ్యమంత్రికి తెలియచేశారు. రాజధాని ప్రాంతంలోని క్యాంపస్ సహా సంస్థ విస్తరణ కోసం రూ.250 కోట్ల మేర వ్యయం చేయనున్నట్టు వెల్లడించారు. కాగా మూడు దశల్లో బిట్స్ పిలాని అమరావతి క్యాంపస్ నిర్మిస్తున్నామని మొత్తం 10 వేల మంది విద్యార్ధులు విద్యను అభ్యసించేలా క్యాంపస్ నిర్మాణం జరుగుతుందని వివరించారు. దీనిపై స్పందించిన సీఎం క్వాంటం టెక్నాలజీ రంగంలో స్టార్టప్ లను ప్రోత్సహించేలా ఈ క్యాంపస్ లో ప్రణాళికలు చేయాలని చంద్రబాబు సూచించారు. ఈ సమావేశంలో పురపాలక, సీఆర్డీఏ, ఆర్ధిక, అటవీ, ఏజీసీఐఎల్ అధికారులు హాజరయ్యారు.
