
అమరావతి ప్రాజెక్టు ప్రజలను మభ్యపెట్టేందుకే: వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాజెక్టు పేరుతో రాష్ట్రంలో భారీస్థాయి అవినీతి, దోపిడీ జరుగుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేవలం ప్రాథమిక మౌలిక వసతుల కల్పనకే రూ. 2 లక్షల కోట్లకు పైగా వ్యయం అవుతుందని తెలిసి కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేవలం స్కామ్‌ల కోసమే అమరావతిపై తప్పుడు ఆశలు కల్పిస్తూ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని మండిపడ్డారు. అమరావతి స్వయం సమృద్ధి రాజధాని అనే వాదన పూర్తిగా అవాస్తవమని తేలిపోయిందని, అయినప్పటికీ రాష్ట్ర ప్రజలపై మోయలేని అప్పుల భారం మోపుతున్నారని విమర్శించారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ రెండేళ్ల కాలంలో అమరావతి కోసం ఇప్పటికే రూ. 47,387 కోట్లు అప్పు చేసిందని తాజా బడ్జెట్‌లో మరో రూ. 9,200 కోట్లు కేటాయించిందని జగన్ వివరించారు. గతంలోనే రూ. 1,200 కోట్ల వ్యయంతో నిర్మించిన అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయం భవనాలు అందుబాటులో ఉన్నప్పటికీ వాటిని వదిలేసి మళ్లీ కొత్త నిర్మాణాల పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. కేవలం ఐదు శాశ్వత సచివాలయ భవనాల నిర్మాణానికే రూ. 10,665 కోట్లు ఖర్చు చేస్తున్నారని లెక్కలు ఇందులో భవనాల సివిల్ పనులకు రూ. 4,354 కోట్లు, డ్రైనేజీ-మౌలిక వసతులకు రూ.1,053 కోట్లు, లిఫ్టులు-ప్లంబింగ్ కోసం రూ. 2,316 కోట్లు, గ్లాస్ ఫిట్టింగ్స్ కోసం రూ. 2,540 కోట్లు, కేవలం డిజైన్ల కోసమే రూ. 401 కోట్లు వెచ్చిస్తున్నారని పేర్కొన్నారు.
ఈ లెక్కన చదరపు అడుగు నిర్మాణ వ్యయం రూ. 20,427 అవుతోందని ఇంటీరియర్ పనులు పూర్తయ్యేసరికి ఇది రూ. 40 వేలకు చేరుకుంటుందని జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇక బెంగళూరు వంటి మెట్రో నగరాల్లో ఫైవ్ స్టార్ సౌకర్యాల భవనాలకు సైతం చదరపు అడుగుకు రూ. 4,500 కంటే ఎక్కువ ఖర్చు కాదని, పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో కేసీఆర్ కేవలం రూ. 615 కోట్లతో అద్భుతమైన సచివాలయాన్ని నిర్మించారని ఈ సందర్భంగా గుర్తుచేశారు. అయితే అమరావతి భూసేకరణలోనూ పక్షపాత వైఖరి నడుస్తోందని భూములిచ్చిన సామాన్య రైతులకు మారుమూల ప్రాంతాల్లో ప్లాట్లు ఇస్తూ ప్రభుత్వానికి సన్నిహితులైన వారికి ప్రైమ్ లొకేషన్లలో భూములు కేటాయించారని ఆరోపించారు.
మరోవైపు అమరావతికి ప్రత్యామ్నాయంగా తాము ప్రతిపాదించిన ‘మావిగాన్ (మచిలీపట్నం-విజయవాడ-గుంటూరు) అభివృద్ధి కారిడార్‌కు ప్రజల నుంచి పెద్దఎత్తున మద్దతు లభిస్తోందని జగన్ తెలిపారు. ఇప్పటికే ఉన్న మచిలీపట్నం పోర్టు, విజయవాడ ఎయిర్‌పోర్ట్, జాతీయ రహదారులు, రైల్వే నెట్‌వర్క్, విశ్వవిద్యాలయాల వంటి మౌలిక వసతుల కారణంగా మావిగన్ ఆర్థికంగా ఎంతో లాభదాయకమైన ప్రాజెక్టు అని ఇది చూసి చంద్రబాబుకు భయం పట్టుకుందని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ప్రస్తుతం ‘జంగిల్ రాజ్ మాఫియా రాజ్యం’ నడుస్తోందని శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని జగన్ దుయ్యబట్టారు. సోషల్ మీడియాపై ప్రభుత్వం అప్రకటిత సెన్సార్‌షిప్ విధిస్తోందని ప్రభుత్వ అవినీతిని, ఇసుక, మద్యం, గంజాయి మాఫియాలను ప్రశ్నించే వారిపై తప్పుడు కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
విఫలమైన సూపర్ సిక్స్.. డైవర్షన్ పాలిటిక్స్
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటుతున్నా ప్రజలకు ఎలాంటి లబ్ధి చేకూరలేదని ‘చంద్రబాబు షూరిటీ - మోసం గ్యారంటీ’గా పాలన సాగుతోందని జగన్ ఎద్దేవా చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ వంటి 143 హామీలను గాలికి వదిలేశారని, పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తామని చెప్పి ఇప్పుడు లీటరుపై రూ. 4 అదనపు భారం మోపారని విమర్శించారు. ఏప్రిల్ నెలలో రాష్ట్రంలో ఇంధన కొరత ఏర్పడినప్పుడు కూడా ప్రజలను పట్టించుకోకుండా అమరావతి కాంట్రాక్టర్ల కోసం రిటైల్ అవుట్‌లెట్ల నుండి ఇంధనం సరఫరా చేయాలని కేంద్రానికి లేఖ రాయడంపై కేంద్ర ప్రభుత్వం చంద్రబాబుకు గట్టిగా చీవాట్లు పెట్టిందని వెల్లడించారు. అవినీతి ఆరోపణల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని జనాభా నిర్వహణపై ఆయన చేపట్టిన ప్రచారం మహిళలను కేవలం పిల్లలను కనే యంత్రాలుగా చూసేలా ఉందన్నారు.
ఇదిలా ఉండగా చంద్రబాబు నాయుడి రాజకీయ చరిత్ర అంతా వెన్నుపోట్లు, హత్యలు, కుట్రలతోనే సాగిందని జగన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. విజయవాడలో వంగవీటి మోహన రంగా హత్య, ఎన్టీఆర్ పై దాడి కేసులో నిందితుడు మల్లెల బాబ్జీ అనుమానాస్పద మృతి జర్నలిస్టు పింగళి దశరథరామ్ హత్యల వెనుక వేళ్లన్నీ చంద్రబాబు వైపే చూపిస్తున్నాయని ఆరోపించారు. అదేవిదంగా గతంలో తన తాత రాజారెడ్డి హత్య కేసు నిందితులను ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో దాచి రక్షించింది చంద్రబాబేనని వైఎస్ రాజశేఖర్ రెడ్డిని అసెంబ్లీకి ఎలా వస్తావో చూస్తానని బెదిరించిన నాలుగు రోజులకే ఆయన ప్రమాదంలో మరణించారని గుర్తు చేశారు.
లోకేష్ కు కౌంటర్
వేకానందరెడ్డి హత్య కేసులో తానే హత్య చేశానని ఒప్పుకున్న దస్తగిరికి చంద్రబాబుకు ఒకే న్యాయవాది వకాల్తా పుచ్చుకోవడాన్ని బట్టే ఎవరిది ‘క్రిమినల్ బ్రెయిన్’ అనేది అర్థమవుతోందని జగన్ అన్నారు. తన బావమరిది బాలకృష్ణ ఇంట్లో కాల్పులు జరిపిన ఘటనను వాచ్‌మెన్ మృతిని చంద్రబాబు ప్రభుత్వం తొక్కిపెట్టిందని విమర్శించారు. అదేవిధంగా మంత్రి నారా లోకేష్ ఇటీవల బహిరంగ సభల్లో చెబుతున్న ఇద్దరూ ఒకటి కాదు అనే మాట నిజమేనని జగన్ అంగీకరించారు. వెన్నుపోటుతో పార్టీలను లాక్కోవడం టీడీపీ చరిత్ర అయితే ప్రజాబలంతో ఒంటరిగా పోరాడి గెలవడం తమ చరిత్ర అని స్పష్టం చేశారు.
తమ ఐదేళ్ల పాలనలో ఎలాంటి అవినీతి లేకుండా పారదర్శకంగా రూ. 2.73 లక్షల కోట్లు డీబీటీ ద్వారా పేదల ఖాతాల్లోకి జమ చేశామని విద్యా, వైద్య రంగాలు దిశ చట్టం వంటి విప్లవాత్మక మార్పులు తెచ్చామని పేర్కొన్నారు. కానీ కూటమి ప్రభుత్వం ఈ రెండేళ్లలోనే రూ.3.6 లక్షల కోట్ల అప్పులు చేసి సంక్షేమ పథకాలను గాలికి వదిలేసి దోపిడీకి పాల్పడుతోందని ఆరోపించారు. 77 ఏళ్ల వయసులో కూడా చంద్రబాబు ఇలాంటి చిల్లర రాజకీయాలు చేయడం సిగ్గుచేటని జగన్ ఘాటుగా వ్యాఖ్యానించారు. కాగా జగన్ చేసిన ఈ సంచలన ఆరోపణలపై తెలుగుదేశం పార్టీ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక స్పందన రాలేదు.
