
తెలుగు జాతి ఉన్నంతవరకు అల్లూరి త్యాగం చిరస్థాయి: హోంమంత్రి అనిత
భారత స్వాతంత్ర్య సమరయోధుడు, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 129వ జయంతి వేడుకలు అనకాపల్లి జిల్లా నక్కపల్లిలోని ఎంపీడీవో కార్యాలయం వద్ద ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా అక్కడ ఉన్న అల్లూరి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించినట్లు రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత తన సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా వెల్లడించారు.
భారత స్వాతంత్య్రం కోసం, గిరిజన ప్రజల హక్కుల రక్షణ కోసం బ్రిటిష్ పాలకులపై వీరోచితంగా పోరాడి, కేవలం 27 ఏళ్ల చిన్న వయసులోనే అల్లూరి ప్రాణత్యాగం చేశారని హోంమంత్రి స్మరించుకున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు.. రాష్ట్రంలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వంలో అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలను అధికారికంగా 'రాష్ట్ర పండుగ'గా జరుపుకోవడం ఎంతో గర్వకారణంగా ఉందని మంత్రి అనిత పేర్కొన్నారు. తెలుగు జాతి ఉన్నంతవరకు అల్లూరి త్యాగం అందరి గుండెల్లో పదిలంగా ఉంటుందని.. ఆయన దేశభక్తి, అకుంఠిత ధైర్యసాహసాలు నేటి యువతరానికి నిరంతరం ఆదర్శంగా నిలవాలని ఆమె ఆకాంక్షించారు.
