
గోదావరి పుష్కరాలకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి: సీఎం చంద్రబాబు
2027లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా జరగనున్న గోదావరి పుష్కరాల నిర్వహణకు అన్ని ప్రభుత్వ శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. ఈ మహాత్కార్యానికి దాదాపు 10 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించడానికి తరలివచ్చే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఏపీలో 2027 జూన్ 26 నుంచి ప్రారంభం కానున్న ఈ పుష్కరాలు 12 రోజుల పాటు నిరంతరాయంగా కొనసాగుతాయి.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1991లో జరిగిన పుష్కరాల్లో 1.2 కోట్ల మంది, 2003లో 5 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారని అధికారిక ప్రకటన తెలిపింది. రాష్ట్ర విభజన తర్వాత 2015లో జరిగిన పుష్కరాల్లో 4.8 కోట్ల మంది భక్తులు తరలివచ్చారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాట్లాడుతూ.. ఈ ప్రతిష్ఠాత్మక గోదావరి పుష్కరాల ప్రారంభానికి ముందే బహుళార్థసాధక పోలవరం ప్రాజెక్టు పనులను పూర్తి చేసి, దేశానికి అంకితం చేస్తామని ప్రకటించారు. లక్షలాది మందికి తాగునీరు, విస్తారమైన వ్యవసాయ భూములకు సాగునీరు అందించడమే ఈ మెగా ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం. గోదావరి నది ప్రవహించే చారిత్రాత్మక రాజమండ్రి నగరాన్ని అంతర్జాతీయ స్థాయి నగరంగా (గ్లోబల్ సిటీ) తీర్చిదిద్దేలా పనులు చేపట్టాలని సీఎం అధికారులను ఆదేశించారు. పుష్కరాల కోసం చేపట్టే పనులు కేవలం ఆ సమయానికే పరిమితం కాకుండా.. గోదావరి తీర ప్రాంతాలైన పోలవరం, ఏలూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమ, కాకినాడ జిల్లాలకు శాశ్వత ఆస్తులుగా మిగిలిపోవాలని ఆయన ఆకాంక్షించారు.
మౌలిక వసతులు – ఘాట్ల నిర్మాణం
ఆంధ్రప్రదేశ్‌లో గోదావరి నది 212 కిలోమీటర్ల మేర ప్రవహిస్తోంది. ఈ నేపథ్యంలో పోలవరం జిల్లాలోని గుండాల గ్రామంలో మొదటి పుష్కర ఘాట్ నిర్మించబడుతోంది. కోనసీమ జిల్లాలోని బాలుసుతిప్ప, కాకినాడ (గోలంక), పశ్చిమ గోదావరి (నరసాపురం) లలో చివరి పుష్కర ఘాట్లను నిర్మించే ప్రతిపాదనలు ఉన్నాయి. ఆరు జిల్లాల వ్యాప్తంగా మొత్తం 525 పుష్కర ఘాట్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటితో పాటు రోడ్లు, టెంట్లు, మరుగుదొడ్లు, ఇతర వసతులు కల్పిస్తారు. ఘాట్ల మొత్తం పొడవు 10 కిలోమీటర్ల వరకు ఉండనుండగా, అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలోనే 150కి పైగా ఘాట్లు ఏర్పాటు కానున్నాయి.
భారీ బడ్జెట్ కేటాయింపులు
పుష్కరాల ఏర్పాట్లలో భాగంగా రాజమహేంద్రవరం, నరసాపురం తదితర ప్రాంతాల్లో పురపాలక శాఖ రూ.2,000 కోట్ల వ్యయంతో 1,660 అభివృద్ధి పనులను చేపట్టగా, పంచాయతీరాజ్ శాఖ రూ.1,080 కోట్లతో 1,140 పనులను అమలు చేస్తోంది. ఇదిలా ఉండగా, గతంలో 2015లో జరిగిన గోదావరి పుష్కరాల సందర్భంగా ఒకే రోజు గరిష్ఠంగా 58.2 లక్షల మంది భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించారు. అయితే 2027 పుష్కరాల సమయంలో ఈ సంఖ్య కోటి మందికి చేరుకునే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అన్ని శాఖలు ముందస్తు ప్రణాళికతో పనిచేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.
