Let's talk: editor@tmv.in
2028 నాటికి ఆమోదం పొందిన ప్రాజెక్టులన్నీ పూర్తి చేయాలి:ఏపీ సీఎం

2028 నాటికి ఆమోదం పొందిన ప్రాజెక్టులన్నీ పూర్తి చేయాలి:ఏపీ సీఎం

Panthagani Anusha
23 మే, 2026

ఆంధ్రప్రదేశ్‌ను పారిశ్రామికంగా ఆర్థికంగా అగ్రగామిగా నిలిపేందుకు వీలుగా రాష్ట్రంలో ఆమోదం పొందిన అన్ని ప్రాజెక్టుల అమలులో అత్యంత వేగం ప్రదర్శించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. కేవలం వ్యాపారాల నిర్వహణ సులభతరం చేయడమే కాకుండా "స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్" విధానంలో ఆంధ్రప్రదేశ్ దేశానికే ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలో పెట్టుబడుల గ్రౌండింగ్, అనుమతులు, త్వరితగతిన ఉపాధి కల్పన వంటి కీలక అంశాలను ఒకే వేదికపై పర్యవేక్షించేందుకు వీలుగా తక్షణమే ఒక సమగ్రమైన సింగిల్-పోర్టల్ డ్యాష్‌బోర్డ్‌ను ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. ఆమోదం పొందిన ప్రాజెక్టులన్నీ 2026 సెప్టెంబర్ నాటికి క్షేత్రస్థాయిలో ప్రారంభమై 2028 డిసెంబర్ నాటికి పూర్తిస్థాయిలో కార్యకలాపాలు సాగించేలా మంత్రులు, అధికారులు సమన్వయంతో కదలాలని గడువు విధించారు.

ఇక రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పరిగెత్తించడంలో పర్యాటక రంగానికి ముఖ్యమంత్రి తొలి ప్రాధాన్యత ఇచ్చారు. భూముల కేటాయింపు ప్రక్రియలో పర్యాటక ప్రాజెక్టులకే మొదటి ప్రాధాన్యం ఉంటుందని ఆ తర్వాతే ఐటీ సంస్థలకు అవకాశం కల్పించాలని అధికారులకు నిర్దేశించారు. పర్యాటక, ఐటీ రంగాల సమ్మేళనానికి అనుగుణంగా బహుళ ప్రయోజన భవనాల రూపకల్పన జరగాలని సూచించారు. ఇందులో భాగంగా బాపట్ల బీచ్‌కు ముందస్తుగా సమగ్ర మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయాలని, సూర్యలంక బీచ్‌ను అంతర్జాతీయ ప్రమాణాలతో “గోవా ప్లస్” తరహా పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని ఆదేశించారు. వీటితో పాటు రాష్ట్రంలోని 21 ప్రధాన ఆధ్యాత్మిక ఆలయాలను అనుసంధానించే టెంపుల్ టూరిజం సర్క్యూట్‌ను అత్యంత వేగంగా అందుబాటులోకి తీసుకురావాలని స్పష్టం చేశారు. అదేవిధంగా ఐటీ ప్రాజెక్టులు అనుమతులు పొందిన 18 నెలల్లోనే తమ కార్యకలాపాలు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని భవిష్యత్ అవసరాల దృష్ట్యా సెమీకండక్టర్, ఎలక్ట్రానిక్స్ కంపోనెంట్ తయారీ పరిశ్రమలను రాష్ట్రంలో మరింత ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు.

మరోవైపు ఈ సమీక్షా సమావేశంలో ఐటీ, పారిశ్రామిక శాఖ మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ రాష్ట్ర పారిశ్రామిక ప్రగతికి సంబంధించిన గణాంకాలను వెల్లడించారు. గత 23 నెలల కాలంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రికార్డు స్థాయిలో రూ.21.6 లక్షల కోట్ల పెట్టుబడులతో కూడిన 756 ప్రాజెక్టులు లభించాయని ఆయన ప్రకటించారు. ఈ ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రంలోని దాదాపు 21.2 లక్షల మంది యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల బలోపేతానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్న లోకేష్,వాటి అనుమతులు ఇతర సేవలను మరింత వేగవంతం చేసేందుకు త్వరలోనే ఒక ప్రత్యేక వెబ్‌సైట్‌ను ప్రారంభించనున్నట్లు ఈ సందర్భంగా వెల్లడించారు.

ఇక రాష్ట్ర ఇంధన అవసరాలు, పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని 160 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీ లక్ష్యాన్ని సాధించేందుకు ట్రాన్స్‌మిషన్ వ్యవస్థను బలోపేతం చేయాలని, సోలార్ రూఫ్‌టాప్ ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం సూచించారురాష్ట్రంలో నౌకా నిర్మాణ కేంద్రాలు, రేవులు, విమానాశ్రయాలు, అంతర్గత జలమార్గాల ప్రాజెక్టుల అభివృద్ధి కోసం ఒక ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.