Let's talk: editor@tmv.in
ఎబోలా వైరస్ వ్యాప్తిపై ఎపీలో అప్రమత్తత.. గన్నవరం ఎయిర్‌పోర్టులో కట్టుదిట్టమైన స్క్రీనింగ్

ఎబోలా వైరస్ వ్యాప్తిపై ఎపీలో అప్రమత్తత.. గన్నవరం ఎయిర్‌పోర్టులో కట్టుదిట్టమైన స్క్రీనింగ్

Gaddamidi Naveen
10 జూన్, 2026

ప్రపంచవ్యాప్తంగా ఎబోలా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రవ్యాప్తంగా ముందస్తు జాగ్రత్త చర్యలను ముమ్మరం చేసింది. విజయవాడ జీజీహెచ్ ఆసుపత్రికి చెందిన డాక్టర్ సుజన తెలిపిన వివరాల ప్రకారం.. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై ప్రత్యేక నిఘా పెట్టామని, గన్నవరం విమానాశ్రయంలో స్క్రీనింగ్ పరీక్షలను ముమ్మరం చేశామని వెల్లడించారు.

గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు వచ్చే అంతర్జాతీయ ప్రయాణికులకు గత 20 రోజులుగా ఈ స్క్రీనింగ్ ప్రక్రియ నిరంతరం కొనసాగుతోంది. ముఖ్యంగా సింగపూర్ నుంచి గన్నవరం వచ్చే ప్రయాణికులకు వారానికి మూడు రోజులు (మంగళ, గురు, శనివారాల్లో) ప్రత్యేకంగా స్క్రీనింగ్ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే మంగళవారం సింగపూర్ నుంచి వచ్చిన 127 మంది ప్రయాణికులకు అధికారులు స్క్రీనింగ్ పరీక్షలు చేశారుని పేర్కొన్నారు.

గత వారం గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న హజ్ యాత్రికులకు సైతం అర్ధరాత్రి, మధ్యాహ్నం వేళల్లో ప్రత్యేక స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించామని డాక్టర్ సుజన తెలిపారు. అయితే, ఇప్పటివరకు పరీక్షించిన ప్రయాణికులలో ఎవరికీ ఎబోలాకు సంబంధించిన ఎలాంటి లక్షణాలు కనిపించలేదని స్పష్టం చేశారు. ఒకవేళ ఎవరిలోనైనా అనుమానిత లక్షణాలు కనిపిస్తే, వారిని తక్షణమే చేర్చి ఐసోలేట్ చేయడానికి వీలుగా ఎయిర్‌పోర్ట్‌లో ప్రత్యేక క్వారంటైన్ గదులను సిద్ధంగా ఉంచినట్లు ఆమె వివరించారు.

ఎబోలా తీవ్రత, అంతర్జాతీయ అత్యవసర పరిస్థితి

ఎబోలా అనేది అత్యంత ప్రమాదకరమైన వైరల్ రక్తస్రావ జ్వరం. ఇది ఎబోలా వైరస్‌కు చెందిన బుండిబుగ్యో స్ట్రెయిన్ సంక్రమణ వల్ల వస్తుంది. దీని మరణాల రేటు చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం ఈ బుండిబుగ్యో స్ట్రెయిన్ నివారణకు ఎలాంటి గుర్తింపు పొందిన వ్యాక్సిన్లు లేదా నిర్దిష్ట చికిత్సలు అందుబాటులో లేవు.

కాంగో, ఉగాండా దేశాల్లో ఈ వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్నందున, ప్రపంచ ఆరోగ్య సంస్థ మే 17, 2026న దీనిని అంతర్జాతీయ ప్రజారోగ్య అత్యవసర పరిస్థితి గా ప్రకటించింది. ఆఫ్రికా సీడీసీ సైతం దీనిని ఖండాంతర భద్రతా అత్యవసర పరిస్థితిగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఉగాండా, దక్షిణ సూడాన్ వంటి ప్రభావిత దేశాలకు అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయవద్దని కేంద్ర ప్రభుత్వం భారత పౌరులకు సూచించింది. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులలో వివరించలేని జ్వరం లక్షణాలు ఉంటే పాయింట్స్ ఆఫ్ ఎంట్రీ (ఎయిర్‌పోర్టుల) వద్దే గుర్తించి నివేదించాలని డబ్ల్యూహెచ్‌ఓ ఆదేశించింది.