
ఆటో డెబిట్‌కు ముందే 'అలర్ట్'.. ఆర్బీఐ కొత్త నిబంధనలు
మనకు తెలియకుండానే బ్యాంక్ ఖాతాల నుంచి డబ్బులు కట్ అయిపోతున్నాయనే ఆందోళనకు ఇక కాలం చెల్లనుంది. రికరింగ్ పేమెంట్స్ (ప్రతి నెలా జరిగే చెల్లింపులు) విషయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనలను మరింత కఠినతరం చేస్తూ 'డిజిటల్ పేమెంట్స్ - ఈ-మాండేట్ ఫ్రేమ్‌వర్క్, 2026'ను విడుదల చేసింది. వినియోగదారుల ప్రయోజనాలను కాపాడటమే లక్ష్యంగా తెచ్చిన ఈ కొత్త మార్గదర్శకాలు తక్షణమే అమల్లోకి రానున్నాయి.
ఎందుకీ నిర్ణయం?
సాధారణంగా ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లు, మొబైల్ బిల్లుల వంటి వాటి కోసం మనం ఒకసారి అనుమతి ఇస్తే, ప్రతి నెలా ఆటోమేటిక్‌గా డబ్బులు కట్ అవుతుంటాయి. అయితే చాలా సందర్భాలలో ఖాతాలో సరిపడా బ్యాలెన్స్ లేకపోవడమో లేదా అనవసరమైన సేవలకు డబ్బులు కట్ అవ్వడమో జరుగుతోంది. వినియోగదారులకు తెలియకుండానే జరిగే ఇలాంటి లావాదేవీల వల్ల ఆర్థిక నష్టంతో పాటు మానసిక ఆందోళన పెరుగుతోంది. వీటిని అరికట్టి, డిజిటల్ లావాదేవీలపై ప్రజల్లో నమ్మకాన్ని పెంచేందుకు ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది.
ముందస్తు సమాచారం తప్పనిసరి
కొత్త నిబంధనల ప్రకారం మీ ఖాతా నుండి ఏవైనా ఆటోమేటిక్ పేమెంట్స్ జరగడానికి కనీసం 24 గంటల ముందే బ్యాంకులు లేదా సంబంధిత సంస్థలు వినియోగదారుడికి నోటిఫికేషన్ (ఎస్ఎంఎస్ లేదా ఈ-మెయిల్) పంపాలి. "రేపు మీ ఖాతా నుండి ఇంత మొత్తం కట్ కాబోతోంది" అని ముందే తెలియజేయడం వల్ల, ఖాతాదారుడు తన వద్ద బ్యాలెన్స్ ఉందో లేదో చూసుకోవచ్చు లేదా ఆ పేమెంట్‌ను వద్దనుకుంటే ఆపేయవచ్చు.
పరిమితులు, భద్రత
సాధారణ లావాదేవీలకు సంబంధించి రూ.15,000 వరకు ఎటువంటి అదనపు ధ్రువీకరణ లేకుండానే ఆటో-డెబిట్ అవుతాయి. అయితే అంతకంటే ఎక్కువ మొత్తం కట్ అవ్వాలంటే మాత్రం వినియోగదారుడు తప్పనిసరిగా ఆమోదం తెలపాల్సి ఉంటుంది. కానీ బీమా ప్రీమియంలు, మ్యూచువల్ ఫండ్ సిప్‌లు, క్రెడిట్ కార్డ్ బిల్లుల వంటి కీలక చెల్లింపుల కోసం ఈ పరిమితిని రూ.1,00,000 వరకు పెంచారు. అంటే లక్ష రూపాయల లోపు ఉండే ఈ విభాగాలకు సంబంధించిన పేమెంట్స్ సులభంగా జరిగిపోతాయి.
మీ ఇష్టమే ఇకపై ముఖ్యం
ఈ-మాండేట్ నమోదు చేసేటప్పుడే భద్రతకు పెద్దపీట వేశారు. అదనపు భద్రతా ప్రమాణాల ద్వారా వ్యాలిడేషన్ పూర్తయితేనే కొత్త ఆటో-డెబిట్ సూచనలు రిజిస్టర్ అవుతాయి. అంతేకాకుండా వినియోగదారులకు పూర్తి స్వేచ్ఛను ఇస్తూ, ఎప్పుడైనా తమ ఆటో-డెబిట్ గడువును మార్చుకునేందుకు లేదా దాన్ని పూర్తిగా రద్దు చేసుకునేందుకు బ్యాంకు సౌకర్యం కల్పించాలి. ఏదైనా ఒక నిర్దిష్ట నెలలో ఆటో-డెబిట్ వద్దనుకుంటే, ఆ ఒక్క లావాదేవీని కూడా నిలిపివేసే అవకాశం కల్పించడం గమనార్హం.
ముఖ్యంగా, ఈ-మాండేట్ సదుపాయాన్ని పొందుతున్నందుకు వినియోగదారుల నుండి ఎటువంటి అదనపు ఛార్జీలు వసూలు చేయకూడదని ఆర్బీఐ స్పష్టం చేసింది. ప్రతి లావాదేవీ పూర్తయిన తర్వాత వెంటనే ఖాతాదారుడికి సమాచారం పంపాలి. ఒకవేళ ఏవైనా ఫిర్యాదులు ఉంటే, వాటిని పరిష్కరించేందుకు అవసరమైన వివరాలను కూడా ఆ సమాచారంతో పాటు అందించాలి. పాత నిబంధనలన్నింటినీ రద్దు చేస్తూ తెచ్చిన ఈ ఏకీకృత చట్రం డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో పారదర్శకతను పెంచుతుందని నిపుణులు భావిస్తున్నారు.
