Let's talk: editor@tmv.in
గంజాయితో పట్టుబడిన ఎయిర్ ఇండియా కోపైలట్.. వెనక్కి పంపిన అమెరికా

గంజాయితో పట్టుబడిన ఎయిర్ ఇండియా కోపైలట్.. వెనక్కి పంపిన అమెరికా

Shaik Mohammad Shaffee
18 ఏప్రిల్, 2026

అంతర్జాతీయ విమానయాన రంగంలో ఎయిర్ ఇండియా ప్రతిష్ఠ మరోసారి చర్చనీయాంశమైంది. దేశ రాజధాని ఢిల్లీ నుంచి అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోకు ప్రయాణించిన ఓ ఎయిర్ ఇండియా పైలట్, అక్కడ నిషేధిత మత్తుపదార్థం గంజాయి కలిగి ఉన్నాడనే ఆరోపణలతో అమెరికా సరిహద్దు భద్రతా దళాల చేతికి చిక్కారు. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన అక్కడి అధికారులు, సదరు పైలట్‌ను దేశంలోకి అనుమతించకుండా వెంటనే భారత్‌కు తిరిగి పంపించేశారు.

ఈ వారం ప్రారంభంలో జరిగిన ఈ ఘటనపై ఎయిర్ ఇండియా ప్రతినిధి శుక్రవారం అధికారికంగా స్పందించారు. ఈ నెల 14న ఢిల్లీ నుంచి శాన్ ఫ్రాన్సిస్కోకు ప్రయాణించిన మా సిబ్బందిలో ఒకరు, స్థానిక చట్టాల ఉల్లంఘన కారణంగా అక్కడ ప్రవేశం నిరాకరించబడి తిరిగి భారత్‌కు చేరుకున్నారని తెలిపారు. సదరు సిబ్బందిపై వచ్చిన ఆరోపణలు సంస్థ నిబంధనలకు విరుద్ధమని, దీనిపై లోతైన విచారణకు ఆదేశించినట్లు వారు పేర్కొన్నారు.

వివరాల్లోకి వెళ్తే.. సదరు కో-పైలట్ ఆ విమానంలో డ్యూటీలో లేరు. ఆయన 'డెడ్‌హెడ్డింగ్' పద్ధతిలో ప్రయాణికుడిగా ప్రయాణించారు. సాధారణంగా ఒక పైలట్ తన బేస్ స్టేషన్‌కు వెళ్లడానికి లేదా అక్కడ విమానం నడిపే విధి నిర్వహణ కోసం వేరే విమానంలో ప్రయాణికుడిగా వెళ్లే ప్రక్రియను డెడ్‌హెడ్డింగ్ అంటారు. శాన్ ఫ్రాన్సిస్కో చేరుకున్నాక అక్కడి నుంచి మరో విమానాన్ని నడపాల్సి ఉండగా, తనిఖీల్లో గంజాయి బయటపడటంతో అధికారులు అతడిని అడ్డుకున్నారు.

ఈ వ్యవహారంపై ఎయిర్ ఇండియా యాజమాన్యం కఠిన వైఖరిని ప్రదర్శిస్తోంది. సంస్థ విధానాల ప్రకారం సదరు పైలట్‌పై కఠిన క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని ప్రకటించింది. విమానయాన రంగంలో భద్రత, చట్టబద్ధత, వృత్తిపరమైన ప్రవర్తన విషయంలో తమ సంస్థ 'జీరో టోలరెన్స్' విధానాన్ని పాటిస్తుందని, చట్టాలను ఉల్లంఘించే వారు ఎవరైనా ఉపేక్షించే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది.

పైలట్ వద్ద ఎంత మొత్తంలో గంజాయి దొరికింది? అనే పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉన్నప్పటికీ, ప్రతిష్టాత్మక విమానయాన సంస్థకు చెందిన పైలట్ ఇలాంటి వివాదంలో చిక్కుకోవడం చర్చనీయాంశమైంది. ఇప్పటికే పలుమార్లు వివాదాల్లో చిక్కుకున్న ఎయిర్ ఇండియాకు, తాజా ఘటన మరింత ఇబ్బందికరంగా మారింది. ప్రస్తుతం అంతర్గత విచారణ కొనసాగుతోంది, త్వరలోనే తుది నివేదిక వచ్చే అవకాశం ఉంది.