
బీజింగ్-ఢిల్లీ మధ్య ఎయిర్ చైనా సేవలు ప్రారంభం
భారత్-చైనా దేశాల మధ్య గడిచిన కొన్నేళ్లుగా నెలకొన్న ప్రతిష్టంభన ఎట్టకేలకు వీడుతోంది. ఇరు దేశాల మధ్య ప్రత్యక్ష విమాన రాకపోకలు మళ్లీ ముమ్మరమవుతున్నాయి. చైనాకు చెందిన ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ చైనా బీజింగ్ - ఢిల్లీ మధ్య తన సేవలను మంగళవారం నుంచి అధికారికంగా పునరుద్ధరించింది. గ్లోబల్ టైమ్స్ కథనం ప్రకారం.. ఈ నెలలోనే చైనా విమానయాన సంస్థలు భారత్‌కు పునరుద్ధరించిన రెండో కీలక మార్గం ఇది.
వారానికి మూడు రోజులు సేవలు
బీజింగ్ - ఢిల్లీ మార్గంలో ఎయిర్ చైనా సంస్థ వారానికి మూడు రోజులు (మంగళవారం, శుక్రవారం, ఆదివారం) విమానాలను నడపనుంది. ఈ ప్రయాణానికి ఎయిర్ బస్ 330 విమానాన్ని కేటాయించారు. బీజింగ్ నుండి మధ్యాహ్నం 3:15 గంటలకు బయలుదేరిన విమానం, భారత కాలమానం ప్రకారం మంగళవారం రాత్రి 8:20 గంటలకు ఢిల్లీ చేరుకుంది. టికెట్ ధరల విషయానికి వస్తే, ఎకానమీ క్లాస్ టికెట్ ధర సుమారు 3,570 యువాన్ల (భారత కరెన్సీలో సుమారు రూ.49 వేలు) నుంచి ప్రారంభం కానున్నాయి.
ఎయిర్ చైనా బాటలో మరిన్ని విమానయాన సంస్థలు
తాజా పరిణామాలతో ఇతర ప్రధాన విమానయాన సంస్థలు కూడా భారత్‌కు విమానాల సంఖ్యను పెంచుతున్నాయి. చైనా ఈస్టర్న్ ఎయిర్‌లైన్స్ గత వారం (ఏప్రిల్ 18) నుంచే కున్మింగ్ - కోల్‌కతా మధ్య తన సేవలను పునరుద్ధరించింది. బోయింగ్ 737 విమానాలతో వారానికి ఆరు రోజులు ఈ సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. అంతకుముందు నవంబర్ 2025లో షాంఘై ఢిల్లీ మార్గంలో కూడా ఈ సంస్థ కార్యకలాపాలు ప్రారంభించింది. ఇక స్వదేశీ విమానయాన దిగ్గజం ఇండిగో సైతం చైనా మార్కెట్‌లో దూసుకెళ్తోంది. మార్చి 30 నుంచి కోల్‌కతా-షాంఘై మధ్య రోజువారీ నాన్‌స్టాప్ సేవలను ప్రారంభించింది. గత నవంబర్ నుంచే ఢిల్లీ-గ్వాంగ్‌జౌ మధ్య విమానాలను నడుపుతున్న ఈ సంస్థ, తాజాగా కోల్‌కతా - గ్వాంగ్‌జౌ మార్గంలోనూ కార్యకలాపాలు సాగిస్తోంది.
మొదలైన నూతన అధ్యాయం
కోవిడ్ మహమ్మారితో పాటు డోక్లాం సరిహద్దు వివాదాల కారణంగా గత కొన్నేళ్లుగా రెండు దేశాల మధ్య విమాన రాకపోకలు పూర్తిగా నిలిచిపోయిన విషయం తెలిసిందే. సుదీర్ఘ విరామం తర్వాత భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పచ్చజెండా ఊపడంతో ఈ కీలక సర్వీసులు పునఃప్రారంభమయ్యాయి. ఇది ఇరు దేశాల మధ్య వాణిజ్య, దౌత్య సంబంధాలను మెరుగుపరుస్తుందని నిపుణులు భావిస్తున్నారు.
వాణిజ్య బంధం బలోపేతం
భారత్ - చైనా మధ్య విమాన రాకపోకలే కాకుండా, వ్యాపార సంబంధాల్లో కూడా కొత్త మార్పులు వస్తున్నాయి. గత ఆరేళ్లుగా కొనసాగుతున్న ప్రతిష్టంభనను తొలగిస్తూ, దేశంతో భూ సరిహద్దును పంచుకుంటున్న పొరుగు దేశాల (ముఖ్యంగా చైనా) నుండి వచ్చే పెట్టుబడుల నిబంధనలను కేంద్ర ప్రభుత్వం సరళతరం చేసింది. గతంలో ఈ దేశాల నుండి వచ్చే పెట్టుబడులకు అనుమతులు రావడానికి చాలా సమయం పట్టేది, కానీ ఇప్పుడు ప్రభుత్వం ఒక నిర్ణీత కాలపరిమితిని ఖరారు చేసి, ఆ ప్రక్రియను వేగవంతం చేసింది. దీనివల్ల దేశంలోని కొత్త స్టార్టప్‌లు, అధునాతన టెక్నాలజీ కంపెనీల్లోకి విదేశీ నిధులు సులభంగా రానున్నాయి. విమాన సర్వీసుల పునరుద్ధరణ, పెట్టుబడి నిబంధనల సడలింపుతో అటు ప్రయాణికులకు, ఇటు పారిశ్రామిక రంగానికి పెద్ద ఉపశమనం లభించనుంది. దీనివల్ల వ్యాపారాలు మెరుగుపడి కొత్త ఆర్థిక సత్సంబంధాలు ఏర్పడతాయని నిపుణులు భావిస్తున్నారు.
