Let's talk: editor@tmv.in
అన్నాడీఎంకే నాయకత్వం బీజేపీకి లొంగిపోయింది: రాహుల్ గాంధీ
అన్నాడీఎంకే నాయకత్వం బీజేపీకి లొంగిపోయింది: రాహుల్ గాంధీ

అన్నాడీఎంకే నాయకత్వం బీజేపీకి లొంగిపోయింది: రాహుల్ గాంధీ

Shaik Mohammad Shaffee
21 ఏప్రిల్, 2026

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై, రాష్ట్రంలోని ఏఐఏడీఎంకే వైఖరిపై విమర్శల జడివాన కురిపించారు. సోమవారం కన్యాకుమారి, తూత్తుకుడిలలో జరిగిన భారీ బహిరంగ సభల్లో పాల్గొన్న ఆయన, తమిళనాడు ఆత్మగౌరవాన్ని కాపాడడమే తమ కూటమి లక్ష్యమని స్పష్టం చేశారు.

బీజేపీకి లొంగిపోయిన అన్నాడీఎంకే

తమిళనాడులో బలమైన పార్టీగా పేరున్న ఏఐఏడీఎంకే, ఇప్పుడు తన స్వయం ప్రతిపత్తిని కోల్పోయి బీజేపీకి లొంగిపోయిందని రాహుల్ గాంధీ విమర్శించారు. ఆ పార్టీ నాయకులు తాము చేసిన అవినీతి నుండి తప్పించుకోవడానికే బీజేపీ చెప్పినట్లు వింటున్నారని, రాష్ట్ర ప్రయోజనాల కంటే వారి సొంత లాభాలే చూసుకుంటున్నారని ఆయన ఆరోపించారు. తమిళనాడు పాలన తమిళ ప్రజల చేతుల్లోనే ఉండాలని, ఢిల్లీ చేతుల్లో బొమ్మలా మారకూడదని రాహుల్ హితవు పలికారు.

ఒకే భాష.. ఒకే చరిత్ర

భారతదేశ సమాఖ్య స్ఫూర్తిని బీజేపీ తుంగలో తొక్కుతోందని రాహుల్ గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. "బీజేపీ ఆలోచనా విధానం అత్యంత ప్రమాదకరం. దేశమంతా ఒకే సంప్రదాయం, ఒకే భాష, ఒకే చరిత్ర ఉండాలని వారు బలంగా నమ్ముతున్నారు. కానీ ప్రతి రాష్ట్రానికి తనదైన గళం ఉండాలి, సొంత ప్రాతినిధ్యం ఉండాలి. తమిళ భాష, సంస్కృతి, చరిత్రను కాపాడడంలో డీఎంకే-కాంగ్రెస్ కూటమి ఎల్లప్పుడూ ముందుంటుంది. తమిళులు తిరగబడితే తమ ఆటలు సాగవని ఆర్‌ఎస్‌ఎస్‌కు కూడా తెలుసు" అని ఆయన పేర్కొన్నారు.

మణిపూర్ మంటలు.. దేశవ్యాప్త కుట్ర

దేశంలో శాంతియుతంగా ఉన్న రాష్ట్రాలను బీజేపీ విడదీస్తోందని మండిపడుతూ, మణిపూర్ ఉదంతాన్ని రాహుల్ ప్రస్తావించారు. "ప్రశాంతంగా ఉన్న మణిపూర్‌ను బీజేపీ తగలబెట్టింది. అక్కడ వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికీ అక్కడ అంతర్యుద్ధం కొనసాగుతూనే ఉంది. అదే తరహాలో ఇతర రాష్ట్రాల అధికారాలను బలహీనపరిచేందుకు రాజ్యాంగ విరుద్ధమైన చర్యలకు బీజేపీ పాల్పడుతోంది" అని ధ్వజమెత్తారు.

డీలిమిటేషన్‌పై అభ్యంతరం

మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజన బిల్లుల వెనుక బీజేపీకి దుష్ట సంకల్పం ఉందని రాహుల్ ఆరోపించారు. "దేశ ఎన్నికల నిర్మాణాన్ని మార్చడమే వారి అసలు ఉద్దేశం. ఇలాంటి చర్యలను దేశ వ్యతిరేక చర్యలుగా మాత్రమే అభివర్ణించగలం. అందుకే పార్లమెంట్‌లో ఆ బిల్లులను మేం గట్టిగా ప్రతిఘటించాం. దేశ ప్రజల ప్రాతినిధ్యాన్ని దెబ్బతీసే ఏ ప్రయత్నాన్ని అయినా కాంగ్రెస్ అడ్డుకుంటుంది" అని స్పష్టం చేశారు.

ట్రంప్ ఆదేశాలతోనే మోడీ ఇజ్రాయెల్ పర్యటన!

తూత్తుకుడి సభలో ప్రధాని మోడీపై రాహుల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌లో యుద్ధ వాతావరణం నెలకొనడానికి ముందు ప్రధాని మోడీ అకస్మాత్తుగా ఇజ్రాయెల్ పర్యటనకు వెళ్లడం వెనుక అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఒత్తిడి ఉందని ఆరోపించారు. "ట్రంప్ ఏం చెబితే ప్రధాని మోడీ అది చేస్తారు. ఎప్స్టీన్ ఫైల్స్, అదానీ వ్యవహారాల వల్లే మోడీ అంతర్జాతీయ వేదికలపై ఇలా వ్యవహరిస్తున్నారు. దేశ ప్రయోజనాల కంటే వ్యక్తిగత సంబంధాలకే ఆయన ప్రాధాన్యత ఇస్తున్నారు" అని విమర్శించారు.

తమిళనాడు భవిష్యత్తును కాపాడుకోవడానికి ప్రజలు డీఎంకే-కాంగ్రెస్ కూటమిని ఆశీర్వదించాలని రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు. ఈ సభల్లో భారీ ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు, డీఎంకే శ్రేణులు పాల్గొన్నారు.

అన్నాడీఎంకే నాయకత్వం బీజేపీకి లొంగిపోయింది: రాహుల్ గాంధీ - Tholi Paluku