
టీబీ వ్యాధి నిర్దారణకు ఏఐ యాప్.. ఏపీలో విజయవంతమైన పైలట్ ప్రాజెక్ట్
వైద్య రంగంలో సాంకేతికత సరికొత్త పుంతలు తొక్కుతోంది. ఒకప్పుడు ప్రాణాంతకమైన టీబీ (క్షయ) వ్యాధిని గుర్తించాలంటే ఎన్నో పరీక్షలు, రోజుల తరబడి నిరీక్షణ అవసరమయ్యేది. కానీ ఇప్పుడు మీ చేతిలో ఉన్న స్మార్ట్‌ఫోన్ ద్వారా మీరు ఒకసారి దగ్గితే చాలు.. మీ ఊపిరితిత్తుల పరిస్థితి ఏంటో తెలిసిపోతుంది. హైదరాబాద్‌కు చెందిన స్టార్టప్ సంస్థ ‘సాల్సిట్ టెక్నాలజీస్’ అభివృద్ధి చేసిన “స్వాసా” అనే కృత్రిమ మేధ (ఏఐ) ప్లాట్‌ఫామ్ ఇప్పుడు గ్రామీణ ఆరోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులు తెస్తోంది.
తూర్పు గోదావరిలో విజయవంతమైన ప్రయోగం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ సహకారంతో ‘మెడ్‌టెక్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ 2025’ కింద ఈ ప్రాజెక్టును తూర్పు గోదావరి జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించారు. ఆరోగ్య కార్యకర్తలు (ఏఎన్ఎంలు) నేరుగా గ్రామాలలోని ఇళ్లకు వెళ్లి ప్రజల దగ్గు శబ్దాన్ని మొబైల్ యాప్‌లో రికార్డు చేస్తున్నారు. కేవలం కొన్ని నిమిషాల్లోనే ఆ శబ్దాన్ని ఏఐ విశ్లేషించి టీబీ మాత్రమే కాకుండా ఆస్తమా సీఓపీడీ వంటి శ్వాసకోశ వ్యాధుల ముప్పును కూడా లెక్కిస్తోంది.
లక్షణాలు లేకపోయినా పసిగడుతోంది
ఈ ప్రాజెక్టు ద్వారా గత ఆరు వారాల్లో సుమారు 8,000 మందికి పైగా పరీక్షలు నిర్వహించగా విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. సాధారణ పరీక్షల్లో బయటపడని 36 శాతం టీబీ కేసులను ‘స్వాసా’ యాప్ పసిగట్టింది. ఎటువంటి లక్షణాలు లేని రోగులను కూడా ప్రాథమిక దశలోనే గుర్తించడం వల్ల వ్యాధి ఇతరులకు సోకకుండా ముందే అడ్డుకునే అవకాశం కలుగుతోంది. సంప్రదాయ పద్ధతులతో పోలిస్తే టీబీ గుర్తింపు శాతం దాదాపు 15 శాతం పెరిగినట్లు అధికారులు వెల్లడించారు.
డిజిటల్ పర్యవేక్షణ - తక్షణ చికిత్స
స్క్రీనింగ్‌లో వ్యాధి ముప్పు ఉన్నట్లు తేలిన వారికి తక్షణమే ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎక్స్‌రే, స్పైరోమెట్రీ, నాట్ వంటి అధునాతన పరీక్షలు నిర్వహించి డాక్టర్ల పర్యవేక్షణలో ఉచితంగా మందులు అందజేస్తున్నారు. కాగా ఈ మొత్తం ప్రక్రియను ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ (ఏబీడీఎం) కు అనుసంధానించారు. రోగి ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ ఐడీ ద్వారా వివరాలను సేకరించి జాతీయ టీబీ ట్రాకింగ్ సిస్టమ్ ‘నిక్షయ్’తో లింక్ చేయడం ద్వారా వారి ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
సామాన్యులకు వరం: నొప్పి లేదు.. ఖర్చు లేదు
ఈ టెక్నాలజీతో ఉన్న అతిపెద్ద ప్రయోజనం ఏమిటంటే.. ఇందులో రేడియేషన్ ముప్పు ఉండదు సూది గుచ్చాల్సిన అవసరం లేదు. ఎటువంటి ఖర్చు లేకుండా, ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఇంటి వద్దే పరీక్ష పూర్తవుతుంది. ముఖ్యంగా కూలీలు, వృద్ధులకు ఇది ఎంతో మేలు చేస్తోంది. తూర్పు గోదావరిలో సాధించిన విజయంతో రాష్ట్రవ్యాప్తంగా ఈ సేవలను విస్తరించాలని ప్రభుత్వం యోచిస్తోంది.
