
చీఫ్ సెలెక్టర్‌గా అగార్కర్ మరో ఏడాది!
టీమ్ ఇండియా సీనియర్ సెలెక్షన్ కమిటీ ఛైర్మన్‌గా అజిత్ అగార్కర్ పదవీకాలాన్ని మరో ఏడాది పాటు పునరుద్ధరించాలని బీసీసీఐ భావిస్తున్నట్లు సమాచారం. 2027 వన్డే ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని, జట్టు ఎంపికలో స్థిరత్వం ఉండాలనే ఉద్దేశంతో బోర్డు ఈ నిర్ణయానికి వచ్చినట్లు బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. అగార్కర్ స్వయంగా పొడిగింపు కోరనప్పటికీ, ఆయన హయాంలో జట్టు సాధించిన విజయాల దృష్ట్యా బాధ్యతలు అప్పగించాలని బోర్డు పెద్దలు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.
విజయవంతమైన ప్రస్థానం
అగార్కర్ సారథ్యంలోని కమిటీ ఎంపిక చేసిన జట్లు గడిచిన మూడేళ్లలో అద్భుత ఫలితాలు సాధించాయి. 2023 అక్టోబర్ నుండి 2026 మార్చి మధ్య భారత్ నాలుగు ఐసీసీ ఫైనల్స్‌కు చేరడం, అందులో మూడు టైటిళ్లు (రెండు టీ20 ప్రపంచకప్‌లు, ఒక ఛాంపియన్స్ ట్రోఫీ) గెలిచింది. అగార్కర్ తన ప్యానెల్ పనితీరును నిర్ణయాధికారులే అంచనా వేయాలని కోరుకుంటున్నట్లు ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.
సాహసోపేత నిర్ణయాల సెలెక్టర్
పలు కఠిన నిర్ణయాల వెనుక అగార్కర్ కమిటీ ముద్ర స్పష్టంగా కనిపిస్తోందని క్రీడా వర్గాల చర్చ. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల టెస్టు రిటైర్మెంట్ తర్వాతి పరిణామాలను పర్యవేక్షించడం, మహమ్మద్ షమీని క్రమంగా అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పించడం వంటి కీలక మార్పులు ఆయన హయాంలోనే జరిగాయి. టీ20 ప్రపంచకప్ కోసం గిల్‌ను పక్కన పెట్టి ఇషాన్ కిషన్‌ను ఎంపిక చేయడం వంటి సాహసోపేత నిర్ణయాలను కూడా బోర్డు పరిగణనలోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే 2027 నాటికి పటిష్ట జట్టును నిర్మించే బాధ్యత ఆయనకే దక్కే అవకాశం ఉంది.
