
పాక్ రాయబారికి అఫ్గాన్ సమన్లు
పాకిస్థాన్ బలగాలు సరిహద్దు నిబంధనలను ఉల్లంఘిస్తూ అఫ్గానిస్తాన్ భూభాగంపై జరిపిన వైమానిక దాడులు ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలకు దారితీశాయి. డ్యూరాండ్ లైన్ వెంబడి కునార్ ప్రాంతంలో పాక్ సైన్యం జరిపిన కాల్పులు, దాడులపై అఫ్గానిస్తాన్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు కాబూల్‌లోని పాకిస్థాన్ ఎంబసీ ప్రతినిధికి (ఛార్జ్ డి అఫైర్స్) సమన్లు జారీ చేసి, అధికారికంగా నిరసన లేఖను అందజేసింది.
విద్యాసంస్థలే లక్ష్యంగా దాడులు
తూర్పు ఆఫ్ఘనిస్తాన్‌లోని అసదాబాద్ సమీపంలో, ముఖ్యంగా ఒక యూనివర్సిటీ లక్ష్యంగా పాక్ బలగాలు దాడులకు తెగబడ్డాయని అఫ్గాన్ ప్రభుత్వం ఆరోపించింది. ఈ దాడుల్లో సామాన్య పౌరులు బలయ్యారని, ప్రజా మౌలిక సదుపాయాలు ధ్వంసమయ్యాయని విదేశీ వ్యవహారాల శాఖ మండిపడింది. తమ గగనతలాన్ని ఆక్రమించడమే కాకుండా, ప్రాదేశిక సార్వభౌమాధికారాన్ని పాక్ ఉల్లంఘించిందని.. ఇది అంతర్జాతీయ సూత్రాలకు విరుద్ధమైన రెచ్చగొట్టే చర్య అని అఫ్గానిస్తాన్ అభివర్ణించింది.
పాక్ ఆరోపణల తిరస్కరణ
అఫ్గానిస్తాన్ భూభాగం నుంచే తొలుత హింస మొదలైందన్న పాకిస్థాన్ వాదనను ఇస్లామిక్ ఎమిరేట్ (తాలిబన్ ప్రభుత్వం) పూర్తిగా తోసిపుచ్చింది. వాస్తవాలను నిర్ధారించడానికి క్షేత్రస్థాయిలో సమగ్ర విచారణ అవసరమని స్పష్టం చేసింది. తమ దేశాన్ని, ప్రజలను రక్షించుకునే చట్టబద్ధమైన హక్కు తమకు ఉందని అఫ్గాన్ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇలాంటి బాధ్యతారాహిత్య చర్యలు కొనసాగితే, భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని పాకిస్థాన్‌ను హెచ్చరించింది.
ఐక్యరాజ్యసమితి ఆందోళన
ఈ దాడులపై ఐక్యరాజ్యసమితి సహాయక మిషన్ కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. సోమవారం మధ్యాహ్నం అసదాబాద్‌లోని యూనివర్సిటీ పరిసరాల్లో జరిగిన దాడుల్లో పదుల సంఖ్యలో పౌరులు మరణించడం, గాయపడటం జరిగిందని ఐరాస తాజాగా ధ్రువీకరించింది. అంతర్జాతీయ మానవతా చట్టాల ప్రకారం.. విద్యాసంస్థలు, పౌరులపై దాడులు చేయడం నిషేధం అని గుర్తుచేసింది. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించిన ఐరాస, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది.
