Let's talk: editor@tmv.in
ఆదిలాబాద్‌ విమానాశ్రయ కల సాకారం దిశగా
ఆదిలాబాద్‌ విమానాశ్రయ కల సాకారం దిశగా

ఆదిలాబాద్‌ విమానాశ్రయ కల సాకారం దిశగా

Gaddamidi Naveen
17 జూన్, 2026

ఆదిలాబాద్‌ ప్రజల దశాబ్దాల కల అయిన జాయింట్ యూజర్ (డిఫెన్స్-సివిల్) విమానాశ్రయ ఏర్పాటుకు సంబంధించి కీలక ముందడుగు పడింది. విమానాశ్రయ ఏర్పాటుకు అవసరమైన భూసేకరణ ప్రక్రియను పూర్తిస్థాయి పారదర్శకతతో చేపడతామని జిల్లా కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్, ఎమ్మెల్యే పాయల శంకర్, బెంగళూరుకు చెందిన విమానాశ్రయ ఉన్నతాధికారులు, రాష్ట్ర సివిల్ ఏవియేషన్ డైరెక్టర్ భరత్ రెడ్డిలతో కలిసి ఆయన ఒక ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముందు అధికారులు, ప్రజాప్రతినిధులు సంయుక్తంగా క్షేత్రస్థాయి పరిశీలన, మైక్రో లెవెల్ సర్వే నిర్వహించి, రన్‌వే విస్తరణతో పాటు సాంకేతిక అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు భూసేకరణ చర్యలను వేగవంతం చేశామన్నారు. ఇప్పటికే 700 ఎకరాల భూసేకరణకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి మంజూరు చేసిందని తెలిపారు. అదనంగా డిఫెన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (ఎయిర్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్) కోసం 1,500 ఎకరాలు, సివిల్ ఏవియేషన్ రన్‌వే విస్తరణ కోసం మరో 80 ఎకరాలను కేటాయించేందుకు ప్రాథమిక ఆమోదం లభించిందని వివరించారు. జియో కోఆర్డినేట్ల ఆధారంగా భూసేకరణ పూర్తి చేసి రక్షణ శాఖ, ఎయిర్‌పోర్ట్ అథారిటీకి త్వరలోనే భూములను అప్పగిస్తామని స్పష్టం చేశారు.

ఢిల్లీ స్థాయిలో ముమ్మర చర్చలు: ఎంపీ గోడం నగేష్

విమానాశ్రయ నిర్మాణానికి సంబంధించిన లొకేషన్ల పరిశీలన విజయవంతంగా పూర్తయిందని ఎంపీ గోడం నగేష్ తెలిపారు. గత మార్చిలో ఢిల్లీలో కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, రామ్మోహన్ నాయుడు, కిషన్ రెడ్డిలతో ఈ ప్రాజెక్టుపై సుదీర్ఘంగా చర్చించామని, మే 15న కేంద్ర ఉన్నతస్థాయి బృందం క్షేత్రస్థాయి పరిశీలన కూడా ముగించిందని గుర్తుచేశారు. రక్షణ శాఖ కోరిన 1,500 ఎకరాల భూమి సేకరణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంపూర్ణ సమన్వయంతో పనిచేస్తున్నాయని చెప్పారు.

దశాబ్దాల కల నెరవేరబోతోంది: ఎమ్మెల్యే పాయల శంకర్

విమానాశ్రయ నిర్మాణానికి మొత్తం 1,840 ఎకరాలు అవసరమవుతాయని ఎమ్మెల్యే పాయల శంకర్ తెలిపారు. ఇందులో 1,500 ఎకరాలను రక్షణ శాఖకు అప్పగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసిందన్నారు. ఇప్పటికే 360 ఎకరాలు రక్షణ శాఖ పరిధిలో ఉండగా, రన్‌వే విస్తరణ కోసం మరో 80 ఎకరాలను సేకరించాల్సి ఉందన్నారు. తదుపరి విధానపరమైన నిర్ణయాల కోసం త్వరలోనే ఢిల్లీలో ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రులతో ఉమ్మడి సమావేశం జరగనుందని వెల్లడించారు. ఈ విమానాశ్రయంతో జిల్లా అభివృద్ధికి కొత్త ద్వారాలు తెరుచుకోనున్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు.