Let's talk: editor@tmv.in
కాంగ్రెస్ జెండాకు సెల్యూట్ చేసిన ‘ఎస్ఐ’పై చర్యలు తీసుకోవాలి: ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి

కాంగ్రెస్ జెండాకు సెల్యూట్ చేసిన ‘ఎస్ఐ’పై చర్యలు తీసుకోవాలి: ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి

Gaddamidi Naveen
1 జులై, 2026

తెలంగాణలో పోలీస్ వ్యవస్థ అధికార కాంగ్రెస్ పార్టీకి జేబు సంస్థలా మారిందని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. రాజకీయాలకు అతీతంగా, నిష్పాక్షికంగా విధులు నిర్వహించాల్సిన ప్రభుత్వ ఉద్యోగులను కాంగ్రెస్ ప్రభుత్వం తమ పార్టీ కార్యకర్తల్లా మార్చేసిందని ఆయన ధ్వజమెత్తారు. కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలో జరిగిన ఒక వివాదాస్పద ఘటనపై ఆయన ఘాటుగా స్పందించారు.

గాంధారి మండల కేంద్రంలో స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించిన కార్యక్రమానికి సదరు మండల ఎస్‌ఐ మహేందర్ హాజరయ్యారు. ఒక రాజకీయ పార్టీ జెండా ఆవిష్కరణ వేడుకలో పాల్గొనడమే కాకుండా, ఆ కాంగ్రెస్ జెండాకు ఎస్‌ఐ సెల్యూట్ చేయడం తీవ్ర అభ్యంతరకరమని ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు.

రాజకీయాలకు దూరంగా ఉండాల్సిన ఒక బాధ్యతాయుతమైన పోలీస్ అధికారి, బహిరంగంగా అధికార పార్టీ జెండాకు సెల్యూట్ చేయడం పోలీసు వ్యవస్థను కాంగ్రెస్ ఎంతగా నిర్వీర్యం చేసిందో స్పష్టం చేస్తోందన్నారు. ఇలాంటి చర్యలు పోలీసు వ్యవస్థపై ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని, నిష్పాక్షికతను పూర్తిగా దెబ్బతీస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజా సమస్యలపై నిలదీస్తున్న బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై అధికార పార్టీ ఆదేశాలతో అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు పోలీసులను వాడుకుంటున్నారని, అందుకు గాంధారి మండల ఘటన ఒక సజీవ నిదర్శనమని ఆయ‌న విమర్శించారు.

కాంగ్రెస్ పార్టీ తాబేదార్లుగా, కార్యకర్తల్లా వ్యవహరిస్తున్న పోలీసులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. శాంతిభద్రతలను కాపాడాల్సిన వ్యవస్థను ఇలా రాజకీయీకరణ చేయడం ప్రజాస్వామ్యానికే పెద్ద ప్రమాదం అని ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. ఈ వివాదాస్పద ఘటనపై రాష్ట్ర డీజీపీ వెంటనే స్పందించి సమగ్ర విచారణ జరిపించాలని, నిబంధనలు ఉల్లంఘించిన ఎస్ ఐ మహేందర్‌పై తక్షణమే కఠిన శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని వేముల ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు.

ట్యాగ్‌లు
TelanganaCongressBRSPolicePoliceSystemKamareddyGandhariVemulaPrashanthReddyPoliticalNewsTelanganaPoliticsBreakingNews
కాంగ్రెస్ జెండాకు సెల్యూట్ చేసిన ‘ఎస్ఐ’పై చర్యలు తీసుకోవాలి: ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి - Tholi Paluku