

ఈశాన్యానికి ‘యాక్ట్ ఈస్ట్, యాక్ట్ ఫాస్ట్’: ప్రధాని మోడీ
ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ‘యాక్ట్ ఈస్ట్’ విధానంతో పాటు ‘యాక్ట్ ఫాస్ట్’కు కట్టుబడి ఉందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. మంగళవారం సిక్కిం రాజధాని గ్యాంగ్‌టక్‌లో ఆయన మాట్లాడారు. ఎనిమిది ఈశాన్య రాష్ట్రాలను ఆయన ‘అష్టలక్ష్మి’గా అభివర్ణిస్తూ, సంపద, శ్రేయస్సు, అభివృద్ధికి ప్రతీకలుగా పేర్కొన్నారు. సిక్కిం రాష్ట్ర హోదా 50 సంవత్సరాల వేడుకల ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. సిక్కిం ఆర్థిక వ్యవస్థలో పర్యాటకం కీలకమని, కనెక్టివిటీ పెంపు ద్వారా పర్యాటకులను ఆకర్షించాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు. పశ్చిమ బెంగాల్‌లోని బాగ్‌డోగ్రా నుంచి ఎక్స్‌ప్రెస్‌వే, గ్యాంగ్‌టక్‌లో రింగ్ రోడ్ నిర్మాణం చేపడుతున్నామని వెల్లడించారు. అలాగే రోప్‌వేలు, స్కైవేలు, నాథులా వద్ద ఎక్స్‌ప్రెస్‌వే ప్రాజెక్టులు కూడా ప్రణాళికలో ఉన్నాయని తెలిపారు.
ప్రకృతి పరిరక్షణకు బ్రాండ్ అంబాసిడర్లు మీరే
సిక్కిం ప్రకృతి, సంస్కృతి ప్రత్యేకతను కొనియాడిన ప్రధాని, రాష్ట్ర ప్రజలు ప్రకృతి పరిరక్షణకు బ్రాండ్ అంబాసిడర్లుగా నిలుస్తున్నారని అన్నారు. ఆర్గానిక్ వ్యవసాయం, ఈకో-వెల్‌నెస్ టూరిజం ద్వారా ఈశాన్యం భవిష్యత్ అభివృద్ధి కేంద్రంగా మారుతుందని అభిప్రాయపడ్డారు. పర్యాటకులను పెద్ద సంఖ్యలో సిక్కింకు రావాలని మోడీ పిలుపునిచ్చారు. రాష్ట్రంలో 1,000 హోమ్‌స్టేలు నిర్మిస్తున్నామని, అడ్వెంచర్ టూరిజానికి మౌలిక సదుపాయాలు పెంచుతున్నామని చెప్పారు. ‘ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్’ భావనకు సిక్కిం ప్రతిబింబమని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాలపై విమర్శలు గుప్పించిన ఆయన, గతంలో సిక్కిం అభివృద్ధిని నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. ప్రస్తుతం ఆరోగ్య రంగం సహా మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తున్నామని తెలిపారు. సివోక్-రంగ్పో రైల్వే ప్రాజెక్టు గతంలో ఆలస్యమైందని, ఇప్పుడు వేగంగా కొనసాగుతోందని చెప్పారు.
రూ. 4,018 కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులకు శ్రీకారం
సిక్కింలో సుమారు రూ. 4,018 కోట్ల విలువైన 30 అభివృద్ధి ప్రాజెక్టులను ప్రధాని ప్రారంభించారు. మౌలిక సదుపాయాలు, కనెక్టివిటీ, ఆరోగ్యం, విద్య, విద్యుత్, పర్యాటకం, వ్యవసాయం వంటి రంగాల్లో ఇవి విస్తరించాయి. ప్రధానంగా నామ్చిలో 100 పడకల ఆయుర్వేద ఆసుపత్రికి శంకుస్థాపన, డియోరాలి వద్ద సోవా రిగ్పా ఆసుపత్రి, సిక్కిం యూనివర్సిటీ శాశ్వత క్యాంపస్, నేతాజీ సుభాష్ చంద్రబోస్ యూనివర్సిటీ బ్లాక్, హెలెన్ లెప్చా మెడికల్ కాలేజీలను ప్రారంభించారు. టీస్టా నదిపై రెండు డబుల్ లేన్ బ్రిడ్జ్‌లకు శంకుస్థాపన చేసి, రహదారి విస్తరణ పనులకు శ్రీకారం చుట్టారు. విద్యుత్ సరఫరా మెరుగుదలకు ట్రాన్స్‌మిషన్ వ్యవస్థను అప్‌గ్రేడ్ చేశారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా సింగ్టామ్ పట్టణంలో మురుగు నీటి వ్యవస్థ పునరుద్ధరణకు పూనుకున్నారు. పర్యాటక రంగంలో గ్యాంగ్‌టక్ రిడ్జ్ అభివృద్ధి, కైలాస్ మానసరోవర యాత్రకు మౌలిక వసతులు ప్రారంభించారు. వ్యవసాయ రంగానికి ఊతంగా సిక్కిం ఐఎఫ్‌ఎఫ్‌సీఓ ప్రాసెసింగ్ ప్లాంట్, క్రీడల అభివృద్ధికి ఇండోర్ క్రికెట్ సదుపాయాలు కూడా ప్రారంభించారు.
యువతతో ఫుట్‌బాల్ ఆడిన ప్రధాని
సిక్కిం పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ యువతతో కలిసి ఫుట్‌బాల్ ఆడారు. ఈ అనుభవం తనకు ఉత్సాహాన్నిచ్చిందని తెలిపారు. గ్యాంగ్‌టక్‌లోని ఆర్కిడేరియంను సందర్శించి అక్కడి జీవ వైవిధ్యాన్ని ప్రశంసించారు. ఈ పర్యటన సిక్కిం రాష్ట్ర 50వ వార్షికోత్సవంలో కీలక ఘట్టంగా నిలిచింది.
వారణాసిలో రూ.6,350 కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులకు శ్రీకారం
వారణాసిలో జరిగిన మహిలా సమ్మేళన్‌లో ప్రధాని నరేంద్రమోడీ రూ.6,350 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించి, మరికొన్నింటికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో మహిళల భాగస్వామ్యాన్ని పెంపొందించడంపై ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని తెలిపారు. వేల కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులను ప్రారంభించామని, కాశీ–అయోధ్య మధ్య కనెక్టివిటీ పెంపుపై కూడా దృష్టి పెట్టినట్లు చెప్పారు. ఈ కార్యక్రమానికి యోగి ఆదిత్యనాథ్, నితిన్‌నబిన్ హాజరయ్యారు. యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ, ప్రధాని విజన్‌తో ‘న్యూ ఇండియా’నిర్మాణం జరుగుతోందని అన్నారు. దేశంలో నాలుగు వర్గాలు—మహిళలు, పేదలు, యువత, రైతులు—ప్రధానమని ప్రధాని ఎప్పుడూ చెబుతారని ఆయన పేర్కొన్నారు. బీజేపీ నాయకుడు నితిన్ నబిన్ మాట్లాడుతూ, మహిళల జీవితాల్లో ప్రధాని తీసుకొచ్చిన మార్పులు విశేషమని అన్నారు. మహిళలు ఇప్పుడు సమాజాన్ని మాత్రమే కాకుండా నాయకత్వాన్నీ అందిస్తున్నారని తెలిపారు.
