
కుటుంబ, గృహ గణనలో ఖచ్చితమైన సమాచారం ఇవ్వాలి:జిల్లా కలెక్టర్ ఆనంద్
కుటుంబ గృహ గణనలో ప్రతి ఒక్కరు ఖచ్చితమైన సమాచారం ఇవ్వాలని జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ సూచించారు. తప్పుడు సమాచారం అందించిన పక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుని మూడేళ్ల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు.
బ్రహ్మసముద్రం మండలం పోలేపల్లి గ్రామంలో కుటుంబ, గృహ గణన కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్, ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జనగణనలో సేకరించే వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచుతామని వాటిని ఇతరులకు వెల్లడించరని తెలిపారు. గ్రామాల అభివృద్ధి అవసరాలను గుర్తించడానికి మాత్రమే ఈ సమాచారం ఉపయోగపడుతుందని స్పష్టం చేశారు.
ప్రతి ఇంటికి వచ్చే గణన ప్రతినిధులకు కుటుంబ సభ్యుల సంఖ్య, వాహనాల వివరాలు, విద్యుత్ సౌకర్యం, డ్రైనేజీ వ్యవస్థ వంటి పూర్తి వివరాలు అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సమగ్ర సమాచారంతోనే ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో అవసరమైన మౌలిక సదుపాయాలను మెరుగుపరచగలదని ఆయన పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు మాట్లాడుతూ, జనగణన ద్వారా సేకరించే వివరాలు సంక్షేమ పథకాలపై ఎలాంటి ప్రభావం చూపదని స్పష్టం చేశారు. ప్రస్తుతం ప్రజలకు అందుతున్న పథకాలు కొనసాగుతాయని వాటిలో ఎలాంటి మార్పులు ఉండవని తెలిపారు.
కాగా కేంద్ర ప్రభుత్వం, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందని ఆయన స్పష్టం చేశారు. కుటుంబ గృహ గణనలో ప్రతి ఒక్కరు పాల్గొని, తమ వివరాలను నిజాయితీగా అందించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
