Let's talk: editor@tmv.in
ప్రభుత్వ వైద్యసేవల్లో జవాబుదారీతనం పెంచాలి: మంత్రి సత్యకుమార్ యాదవ్

ప్రభుత్వ వైద్యసేవల్లో జవాబుదారీతనం పెంచాలి: మంత్రి సత్యకుమార్ యాదవ్

Gaddamidi Naveen
1 జులై, 2026

ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యసేవల నాణ్యతను మరింత మెరుగుపరచడంతో పాటు ప్రజల్లో ప్రభుత్వ వైద్యసంస్థలపై సంతృప్తి స్థాయిని 85 శాతానికి పెంచాలని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అధికారులను ఆదేశించారు. ఈ లక్ష్య సాధనకు దోహదపడే ఎనిమిది ప్రధాన అంశాలపై మంగళవారం దాదాపు మూడు గంటల పాటు ఉన్నతాధికారులతో వర్చువల్ సమీక్ష నిర్వహించారు.

ప్రభుత్వ వైద్యసిబ్బంది జవాబుదారీతనాన్ని పెంచేందుకు ఆసుపత్రుల పనితీరు మదింపు విధానంలో సమగ్ర మార్పులు తీసుకురావాలని మంత్రి సూచించారు. ఇప్పటివరకు ఓపీ, ఐపీ సేవలు, శస్త్రచికిత్సలు, నిర్ధారణ పరీక్షల సంఖ్యల ఆధారంగా ఆసుపత్రుల పనితీరును అంచనా వేస్తున్నారని, దీంతో సమర్థంగా పనిచేసే సిబ్బంది, పనితీరు తక్కువగా ఉన్నవారిని ఒకే విధంగా పరిగణిస్తున్న పరిస్థితి ఉందన్నారు. దీనికి బదులుగా ప్రతి వైద్యుడు, నర్సు, టెక్నీషియన్ రోజుకు అందించాల్సిన సేవల ప్రమాణాలను నిర్ణయించి, వాటి ఆధారంగా ప్రతి ఆసుపత్రి, ఆయుష్మాన్ ఆరోగ్య మందిరానికి వార్షిక లక్ష్యాలను నిర్దేశించాలని ఆదేశించారు. ఆ లక్ష్యాల సాధనను ప్రతి నెల సమీక్షించి లోపాలను సరిదిద్దే చర్యలు చేపట్టాలని సూచించారు.

ప్రభుత్వ ఆసుపత్రుల్లో పారిశుధ్య సేవల విషయంలో ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించబోమని మంత్రి స్పష్టం చేశారు. కొత్త శానిటేషన్ ఏజెన్సీల నియామకం తర్వాత సాంకేతిక సమస్యల కారణంగా ఏర్పడిన లోటుపాట్లను పూర్తిగా పరిష్కరించి, అన్ని ఆసుపత్రుల్లో పారిశుధ్య సేవలు ఆశించిన స్థాయిలో అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ప్రెసిడెన్షియల్ ఆర్డినెన్స్-2025 ప్రకారం రాష్ట్రాన్ని ఆరు జోన్లు, రెండు మల్టీ జోన్లుగా విభజించిన నేపథ్యంలో వైద్యశాఖపై పడే ప్రభావాన్ని కూడా మంత్రి సమీక్షించారు. ప్రజారోగ్య వ్యవస్థ అవసరాలను దృష్టిలో ఉంచుకుని డీఎంఈ పరిధిలోని అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అంతకంటే ఉన్నత స్థాయి వైద్యులను రాష్ట్ర క్యాడర్‌గా, డీఎస్‌హెచ్ పరిధిలోని సివిల్ సర్జన్ స్పెషలిస్టులను రాష్ట్ర స్థాయి సిబ్బందిగా పరిగణించాలని నిర్ణయించారు. అలాగే సివిల్ అసిస్టెంట్ సర్జన్లు, డెంటల్ అసిస్టెంట్ సర్జన్లను మల్టీ జోనల్ క్యాడర్‌లో చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదించనున్నారు.

మంత్రి కార్యాలయం నుంచి పంపే వినతులు, ప్రజాప్రతినిధుల అభ్యర్థనలకు సంబంధిత అధికారులు 30 రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని స్పష్టం చేశారు. గత రెండేళ్లలో 12 వేల మంది వైద్యులు, ఇతర సిబ్బంది నియామకాలు జరిగాయని పేర్కొంటూ, రాబోయే మూడేళ్లలో ఖాళీల భర్తీకి సమగ్ర కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశించారు. వర్షాకాలంలో మలేరియా, డెంగీ, చికున్‌గున్యా వంటి సీజనల్ వ్యాధుల నివారణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, అన్ని శాఖలతో సమన్వయం చేసుకుని నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు. జిల్లా స్థాయిలో డీఎంహెచ్‌వోలు ప్రతి వారం పరిస్థితిని సమీక్షించి క్షేత్రస్థాయి సిబ్బందిని అప్రమత్తంగా ఉంచాలని మంత్రి ఆదేశించారు. సమావేశంలో వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్. సురేష్ కుమార్‌తో పాటు వివిధ విభాగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు
AndhraPradeshAPHealthHealthDepartmentGovernmentHospitalsPublicHealthSatyaKumarYadavHealthcareMedicalReformsHospitalManagementSanitation